Thursday, April 25, 2024
- Advertisement -

‘సప్తగిరి ఎల్‌ఎల్‌బీ’ రివ్యూ

- Advertisement -
  • ప‌ర్వాలేద‌నిపించిన స‌ప్త‌గిరి

హాస్య‌న‌టుడిగా కెరీర్ ప్రారంభించి మంచి సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న న‌టుడు స‌ప్త‌గిరి. క‌మెడియ‌న్‌గా సినిమాలు చేస్తూనే హీరోగా కూడా న‌టించేస్తున్నాడు. ఈ విధంగా క‌మెడియ‌న్ నుంచి హీరోగా మారిన వారెంద‌రో ఉన్నారు. ఆలీ, బ్ర‌హ్మానందం, సునీల్ దాకా ఎంతో మంది ఉన్నారు. అయితే వారికి క‌లిసొచ్చిందా లేదా అనేది అప్ర‌స్తుతం. స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్ సినిమాతో తొలిసారి హీరోగా స‌ప్త‌గిరి ఆక‌ట్టుకున్నాడు. హీరో ల‌క్ష‌ణాలున్నాయ‌ని నిరూపించుకున్నాడు. అందుకే రెండోసారి హీరోగా ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. హిందీలో సూప‌ర్‌హిట్‌గా నిలిచిన అక్ష‌య్‌కుమార్ ‘జాలీ ఎల్‌ఎల్‌బీ’ సినిమాను రీమేక్ చేశారు. ఆ సినిమా ఎలా ఉందో.. చూద్దాం.

క‌థ‌: ఎల్‌ఎల్‌బీ చేసిన స‌ప్త‌గిరి (స‌ప్త‌గిరి) త‌న ఊరు పుంగ‌నూరులో చిన్న చిన్న త‌గాదాలు, కేసులు ప‌రిష్క‌రిస్తుంటాడు. పంచాయ‌తీల‌న్నీ త‌నకు తెలిసిన జ్ఞానంతో ప‌రిష్క‌రించడంతో మంచి పేరు వ‌స్తుంది. లోక‌ల్‌గా లా ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఇదే స‌మ‌యంలో అత‌డు త‌న‌ మ‌ర‌ద‌లు చిట్టి (క‌శిశ్ వోరా)తో ప్రేమలో ఉంటాడు. చిట్టి తండ్రి వీరి పెళ్లికి అంగీక‌రించడు. స‌ప్త‌గిరికి త‌గినంత గుర్తింపు లేద‌ని చెబుతాడు. స‌ప్త‌గిరి కోర్టులో అడుగుపెడితే ఒక్క కేసూ గెల‌వ‌లేడు. వీట‌న్నిటి నేప‌థ్యంలో ప‌ట్ట‌ణంలో త‌న బావ (ర‌వికిర‌ణ్‌) వ‌ద్ద‌కు వెళ్తాడు. పెద్ద పెద్ద కేసులు డీల్ చేసి పేరు సంపాదించుకోవ‌చ్చ‌నే ఉద్దేశంతో వ‌స్తాడు. ఈ స‌మ‌యంలో మూసేసిన ఓ కేసు అత‌డి దృష్టి ప‌డుతుంది. ఈ కేసును రాజ్‌పాల్ (సాయికుమార్‌) డీల్ చేసి క్లోజ్ చేసి ఉంటాడు. రాజ్‌పాల్ గురించి తెలుసుకుంటాడు. రాజ్‌పాల్ క్లోజ్ చేసిన కేసు ఏమిటిది? సీనియ‌ర్ లాయ‌ర్ రాజ్‌పాల్‌తో స‌ప్త‌గిరి చివ‌రికి గెలిచాడా? ఇంత‌కు ఆ యాక్సిడెంట్ ఏమిటీ? తదిత‌ర విష‌యాలు సినిమాలో ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు.

ప‌స్ల్‌: ‘జాలీ ఎల్‌ఎల్‌బీ’లో ప్ర‌ధాన సీన్ల‌ను ఎక్క‌డా దెబ్బ‌తీయ‌కుండా ద‌ర్శ‌కుడు సినిమాను తీసుకున్నాడు. ప్ర‌ధానంగా కోర్టు సీన్ల‌ను డిట్టో దింపేశాడు. మిగ‌తా సీన్ల‌న్నీ ఇక్కడ మార్చ‌కున్న‌వే. ఈ సినిమా కోసం స‌ప్త‌గిరి చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. ఆ శ్ర‌మంతా సినిమాలో క‌నిపిస్తుంది. కొన్ని అదిరిపోయే స్టెప్పులు కూడా వేశాడు. స‌ప్త‌గిరి, సాయికుమార్‌, శివ‌ప్ర‌సాద్ పోటీప‌డి న‌టించారు. కోట శ్రీనివాస‌రావు, గొల్ల‌పూడి మారుతీరావు, ఎల్బీ శ్రీరామ్‌, నిర్మాత ర‌వికిర‌ణ్‌, ష‌క‌ల‌క శంక‌ర్ ప‌ర్వాలేద‌నిపించారు. హిందీ సినిమాను కంపేర్ చూసి ఈ సినిమా చూడ‌క‌పోతే మంచిది. కోర్టు సీన్లు సీరియ‌స్‌గా ఉండ‌వ‌ని చెబుతూ స‌ర‌దా స‌న్నివేశాలు చూపించారు.

సినిమాను బాగా రిచ్‌గా తీశారు. పాట‌ల లోకేష‌న్లు బాగున్నాయి. ద‌ర్శ‌కుడు ఎక్క‌డా హిందీ సినిమాను దెబ్బ‌తీయ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డాడు. ఆయ‌న ప్ర‌య‌త్నానికి పాస్ మార్కులు వేయొచ్చు. రైతుల కోణం హిందీలో లేదు. కానీ ఇక్క‌డ ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ ఇరికించారు. ఇది కూడా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. ఫుట్‌పాత్ బ‌తుకులు ఎందుకు ఉంటాయి? అక్క‌డ ప‌డుకునే వారు ఎవ‌రు? ఎందుకు ప‌డుకోవాల్సి వ‌స్తుంది? ఫుట్‌పాత్‌ల మీద మ‌నుషులు ప‌డుకుంటే త‌ప్పు.. డ్రైవింగ్ చేస్తే త‌ప్పు కాదా? వంటి కొన్ని సెన్సిటివ్ అంశాల‌ను తెర‌పై చ‌క్క‌గా చూపించారు. చివ‌రి 30 నిమిషాలు కుర్చీలోంచి క‌ద‌ల‌నివ్వ‌లేదు.

మైన‌స్: సినిమా తొలిభాగం కొంచెం బోర్ కొడుతుంది. తొలి భాగంగా హీరో బిల్డ‌ప్‌లు, ఏదో కామెడీతో లాగించాల‌నుకోవ‌డం సినిమాను వీక్ చేశాయి. హీరోయిన్ పాట‌ల‌కే ప‌రిమిత‌మైంది. అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. పాట‌లు ఎందుకొస్తాయో తెలియ‌దు. కామెడీ అనుకోని పోతే నిరాశ త‌ప్ప‌దు. సినిమా ఉన్న‌దంతా సెకండాఫ్‌లోనే.

మొత్తానికి సినిమా ప‌ర్వాలేద‌నిపిస్తోంది. స‌ప్త‌గిరి న‌ట‌న‌కు పేరు పెట్ట‌లేం. మ‌రిన్ని సినిమా అవ‌కాశాలు ఇవ్వొచ్చు. సాధార‌ణ ప్రేక్ష‌కుడిని థియేట‌ర్ వైపున‌కు తీసుకువ‌చ్చే చిత్ర‌మిది.

న‌టీన‌టులు: సప్తగిరి, కషిష్, సాయికుమార్
దర్శకుడు: చరణ్ లక్కాకుల
నిర్మాత: డాక్ట‌ర్‌.కె.రవి కిరణ్
సంగీతం: విజయ్

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -