‘వజ్ర కవచ ధర గోవిందా’ రివ్యూ

405
Sapthagiri's Vajra Kavachadhara Govinda Movie Review
Sapthagiri's Vajra Kavachadhara Govinda Movie Review

సప్తగిరి ఎక్స్ప్రెస్’, ‘సప్తగిరి ఎల్ ఎల్ బి’ సినిమాలతో హీరోగా సినిమాలు చేసిన స్టార్ కమెడియన్ సప్తగిరి ఇప్పుడు తాజాగా ‘వజ్ర కవచ ధర గోవిందా’ అనే మరొక సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. అరుణ్ పవార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. జి వి ఎన్ రెడ్డి మరియు నరేంద్ర యడల సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో వైభవి జోషి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఇవాళ అనగా జూన్ 14న విడుదలైంది. మరి ముచ్చటగా మూడవ సినిమాతో సప్తగిరి హిట్ అందుకుంటాడో లేదో చూద్దాం..

కథ: గోవిందు (సప్తగిరి) తన గ్రామంలో ఒక క్యాన్సర్ హాస్పిటల్ కట్టాలని అనుకుంటాడు. తనకి మంచి స్నేహితురాలు అయిన ఎమ్మెల్యే ప్రసన్నలక్ష్మి (అర్చన) ఈ విషయంలో తనకు సహాయం చేస్తానని చెబుతుంది కానీ ఆఖరి లో మాత్రం మోసం చేస్తుంది. ఇక చేసేదిలేక క్యాన్సర్ హాస్పిటల్ కట్టడం కోసం దొంగగా మారుతాడు గోవిందు. ఒక నిధిని వెతకడానికి ప్రయత్నాలు మొదలు పెడతాడు. గోవిందు ప్రయత్నాలు ఫలించాయా? క్యాన్సర్ హాస్పిటల్ కట్టగలిగాడా? అసలు ఆ నిధి ఏంటి? చివరికి ఏమైంది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు: ప్రతి సినిమాలోనూ ఏదో ఒక ఇంప్రూవ్మెంట్ చూపిస్తూ వస్తున్న సప్తగిరి ఈ సినిమాలో కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాడు అని చెప్పుకోవచ్చు. యాక్షన్ సన్నివేశాల్లో నే కాక ఎమోషనల్ సన్నివేశాలలో కూడా సప్తగిరి చాలా బాగా నటించాడు. ఇక కామెడీ సీన్ లలో సప్తగిరి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే అక్కడక్కడా కొన్ని సీన్లలో తన నటన ఓవర్ గా అనిపించింది. వైభవి జోషి ఈ సినిమా లో హీరోయిన్ గా కనిపించింది కానీ పెద్దగా ఆమె ఈ సినిమా కి ఉపయోగపడింది ఏమి లేదు. టెంపర్ వంశీకి ఈ సినిమాలో మంచి పాత్ర దక్కింది. ఆ పాత్రకు అతను పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు. అప్పారావు చాలా బాగా నటించాడు. అర్చన కూడా ఈ సినిమాలో మెరిసినా ఆమెది చిన్న పాత్ర అయిపొయింది. ఆమెని దర్శకుడు పూర్తిగా వినియోగించుకోలేదు. మిగిలిన నటులు పర్వాలేదనిపించారు..

సాంకేతిక వర్గం: జి టి ఆర్ మహేంద్ర ఈ సినిమా కోసం మంచి కథను అందించారు. దర్శకుడు అరుణ్ పవర్ ఈ సినిమా మొత్తం ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. ఈ సినిమాలో ప్రేమ, రొమాన్స్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ వంటి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ దట్టంగా ఉన్నాయి. కాకపోతే అవి ఉండాల్సిన మోతాదు కంటే ఎక్కువ ఉండటం తో ఒక దశ లో ఆడియన్స్ చాలా బోర్ ఫీల్ అవుతారు. శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై జి వి ఎన్ రెడ్డి మరియు నరేంద్ర ఎడల అందించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. చిన్న బడ్జెట్ సినిమా అయినప్పటికీ క్వాలిటీ పరంగా ఏ మాత్రం రాజీపడకుండా మంచి నిర్మాణ విలువలు అందించారు నిర్మాతలు. విజయ్ బుల్గని అందించిన సంగీతం చాలా బాగుంది. పాటలు సంగతి పక్కన పెడితే సినిమాలో నేపథ్య సంగీతం పరవాలేదనిపిస్తుంది. ప్రవీణ్ వనమాలి ఛాయాగ్రహణం చాలా బాగా బాగుంది. ఈ సినిమాకు మంచి విజువల్స్ ను అందించారు ప్రవీణ్ వనమాలి .

తీర్పు: జోనర్ తగ్గట్టుగానే ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్గా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంది. ఆసక్తికరంగా మొదలయ్యే ఈ సినిమా మొదటి భాగం మొత్తం క్యారెక్టర్లను పరిచయం చేయడం తోనే సరిపోతుంది. అందుకే అసలు ఈ సినిమా లో కథ ఏంటి అనే అనుమానం మనకి కలుగుతుంది. ఈ సినిమాలో ఇంటర్వెల్ ట్విస్ట్ పర్వాలేదు అనిపిస్తుంది. మొదటి భాగం తో పోల్చుకుంటే రెండవ భాగంలో కామెడీ కంటే ఎమోషన్ లకు పెద్దపీట వేశారు. అయితే సెకండ్ హాఫ్ లో ఏదైతే వర్క్ అవుట్ అవుతుంది అని భావించారో అది అసలు జనాలకి ఎక్కలేదు. సెకండ్ హాఫ్ చాలా లౌడ్ గా ఉంటుంది. ఓవరాల్ గా చెప్పాలంటే సినిమా మొత్తం ఎంటర్టైనింగ్ గా సాగుతుంది కానీ ఏ సెంటర్ ఆడియన్స్ కి మాత్రం రుచించే అవకాశం లేదు. కేవలం మాస్ ఆడియన్స్ ఈ సినిమా ని ఎంజాయ్ చేసే అవకాశం కనిపిస్తుంది.

Loading...