ప‌ద‌వికి అలోక్ వ‌ర్మ రాజీనామా…సీబీఐ నంబర్ 2 బాస్ అరెస్ట్ త‌ప్ప‌దా…?

496
CBI vs CBI : Former CBI Director Alok Verma resigns from service
CBI vs CBI : Former CBI Director Alok Verma resigns from service

సీబీఐలో గత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలు ఆందోళనకరంగా మారాయి. ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్ ఆస్థానాకు, ఆలోక్‌కు మధ్య విభేదాలు తారస్థాయికి చేరడం, అధికారుల్లో కూడా రెండు వర్గాలుగా విడిపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇద్దరు అధికారులనూ బలవంతంగా సెలవుపై పంపిస్తూ ఆదేశాలు జారీచేయడంతో పాటు సీబీఐలోనే అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎం. నాగేశ్వరారవును సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసింది.

తాను ఎలాంటి తప్పు చేయకపోయినా అక్రమంగా, అన్యాయంగా పదవి నుంచి తప్పించడంతో పాటు బలవంతంగా సెలవుపై పంపడాన్ని ఆలోక్‌ సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. ప‌టిష‌న్‌ను విచారించిన సుప్రీంకోర్టు అలోక్ వ‌ర్మ‌నే సీబీఐ బాస్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టాల‌ని అనుకూలంగా తీర్పునిచ్చింది.

అయితే ఈ వ్య‌వ‌హారంపై హై ప‌వ‌ర్ క‌మిటీని ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. మోడీ అధ్యక్షతన సమావేశమైన హై పవర్ కమిటీ అలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్ పదవి నుండి తప్పించాలని నిర్ణయం తీసుకొన్నారు.ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్న లోక్‌సభలో విపక్షనేత మల్లిఖార్జున ఖర్గే మాత్రం వర్మను తప్పించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. జస్టిస్ సిక్రీ మాత్రం వర్మపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేయాలని పట్టుబట్టారు. మోడీ కూడ వర్మను తప్పించేందుకే మొగ్గు చూపారు. దీంతో వర్మను ఫైర్ సర్వీసెస్‌కు బదిలీ చేశారు.

ఫైర్‌సర్వీసెస్ డీజీగా బాధ్యతలు చేపట్టడానికి సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ నిరాకరించారు. తాను ఎలాంటి తప్పులు చేయకపోయినా ఎవరో చేసిన ఆరోపణలకు తనను బలిచేశారనే ఉద్దేశంతో ఆయన అగ్నిమాపక డీజీగా బాధ్యతలు స్వీకరించేందుకు నిరాకరించారు. దీంతో కొత్త బాధ్యతలు స్వీకరించకుండా పదవీ విరమణ చేస్తున్నట్టు కేంద్రానికి సమాచారం పంపారు. వాస్తవానికి అలోక్ వర్మ సీబీఐ డైరెక్టర్‌గా ఈ నెల 30వ తేదీ వరకు పదవీ కాలం ఉంది.కానీ, ఈ లోపుగానే ఆయనను ఈ పదవి నుండి తప్పించారు.

సీబీఐ నంబర్ 2 రాకేష్ ఆస్థానాకు ఎదురు దెబ్బ తగిలింది. లంచం కేసులో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాల్సిందిగా ఢిల్లీ హైకోర్టులో ఆయన వేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. విచార‌ణ‌ను ఎదుర్కోవాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. కోర్టు ఆదేశాలతో ఇప్పుడు రాకేష్ ఆస్థానాను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. అరెస్ట్ నుంచి తాత్కాలిక రక్షణ కల్పించడానికి కూడా కోర్టు నిరాకరించింది. పది వారాల్లో రాకేష్ ఆస్థానాపై విచారణను పూర్తి చేయాలని కూడా స్పష్టం చేసింది. ఆయనపై నేరపూరిత కుట్ర, అవినీతి, నేరపూరిత దుష్ప్రవర్తన కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది.