Thursday, April 18, 2024
- Advertisement -

విజయ్‌ చందర్‌కు కీలక పదవి

- Advertisement -

సీనియర్‌ నటుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత తెలిదేవర విజయ్‌ చందర్‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో కీలక పదవి దక్కింది. ఆయనను ఏపీ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి నియామక ఉత్తర్వులు జారీ చేశారు.

ఏపీలో అధికార పదవి దక్కించుకున్న సిని​మా రంగానికి చెందిన మూడో వ్యక్తి విజయ్‌ చందర్‌ కావడం విశేషం. పృథ్విరాజ్‌ను ఎస్వీబీసీ చానల్‌ చైర్మన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. సినిమా నటి, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఏపీఐఐసీ చైర్మన్‌గా ఉన్నారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో కీలక నేతగా ఉన్న విజయ్‌చందర్‌ మొదటి నుంచి వైఎస్‌ జగన్‌ వెంట ఉన్నారు. జగన్‌ పట్ల పుత్రవాత్సల్యం ప్రదర్శించేవారు. పాదయాత్రలోనూ జగన్‌ వెంట నడిచారు. జగన్‌ ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకున్న వారిలో ఆయన ఒకరు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో పార్టీ తరపున రాష్ట్రమంతా తిరిగి విస్తృతంగా ప్రచారం చేశారు.

ఇక సినిమాల విషయాని కొస్తే కరుణామయుడు చిత్రంతో ఆయన తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అలాగే సాయిబాబా పాత్రతోనూ మెప్పించారు. ఆంధ్రకేసరి, రాజాధిరాజు, దయామయుడు, భద్రాచలం సినిమాలు ఆయనకు మంచిపేరు తెచ్చిపెట్టాయి.

విజయచందర్ అసలు పేరు రామచందర్. 1942లో మద్రాసులో పుట్టారు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు ఈయనకు తాత అవుతారు. విజయచందర్ తల్లి పుష్పావతి, ప్రకాశం పంతులు కూతురు. తండ్రి తెలిదేవర వెంకట్రావు హోమియోపతి వైద్యుడు. విజయ్‌ చందర్‌ విద్యాభ్యాసం అంతా కాకినాడలో జరిగింది.

కాకినాడ పి.ఆర్. గవర్నమెంట్‌ కాలేజీలో చదువుతుండగా ఆయన నాటకాలు వేస్తుండేవారు. డిగ్రీ ఐపోయాక హైదరాబాద్ వచ్చేసి విద్యుత్ శాఖలో ఉద్యోగంలో చేరారు. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌కు మారారు. కొంతకాలం తర్వాత ఉద్యోగం వదిలేసి సినిమాల్లో నటించాలనే కోరికతో మద్రాస్ కు వెళ్లారు.

ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన మరో ప్రపంచం సినిమాతో వెండితెరపై అడుగుపెట్టారు. కరుణామయుడు సినిమాతో ఆయన పాపులయ్యారు. తర్వాత వెనుదిరిగి చూసుకోకుండా ఎన్నో సినిమాల్లో నటించారు. సినీ పరిశ్రమలో అందరికి తలలో నాలుకలా ఉండే ఆయన హైదరాబాద్ నగర శివార్లలోని 11 ఎకరాల స్థలాన్ని చిత్రసీమలోని సీనియర్ సిటిజెన్స్ కోసం ఇచ్చేసి మంచి మనసు చాటుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -