కొరోనా అలెర్ట్: హైదరాబాద్ లో కఠిన చర్యలు

1255
CoronaVirus High Alert in Hyderabad and Surrounding
CoronaVirus High Alert in Hyderabad and Surrounding

కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉన్న హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు పాటించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరంతో పాటు కర్నూలుకు సరిహద్దులో గల గ్రామాల్లో, గుంటూరు జిల్లాకు సరిహద్దులో గల గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, లాక్ డౌన్ అమలు, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో ఇవాళ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేష్ కుమార్, డిజిపి శ్రీ మహేందర్ రెడ్డి, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ శాంతి కుమారి, ముఖ్య కార్యదర్శులు శ్రీ ఎస్ నర్సింగ్ రావు, శ్రీ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

“హైదరాబాద్ దాని చుట్టుపక్కల జిల్లాలు మినహా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పరిస్థితి అదుపులోనే ఉంది. ఆ ప్రాంతాల్లో వ్యాప్తి చాలా తక్కువగా ఉంది. కొత్తగా నమోదవుతున్న కేసులన్నీ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోనే ఉన్నాయి. కాబట్టీ అధికారులు హైదరాబాద్ పై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎవరికి వ్యాధి లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్షలు జరిపి అవసరమైతే చికిత్స చేయించాలి. ఎవరు పాజిటివ్ గా తేలినా అతను కలిసిన వారందరినీ క్వారన్ టైన్ చేయాలి. హైదరాబాద్ లోని వారు బయటకు పోకుండా, బయటివారు హైదరాబాద్ లోనికి రాకుండా నియంత్రణ చర్యలు పకడ్బందీగా చేపట్టాలి. చురుకైన పోలీసు అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఐఎఎస్ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియియమిచాలి. మొత్తం హైదరాబాద్ ను చుట్టుముట్టాలి. వైరస్ ను తుదముట్టించాలి ” అని ముఖ్యమంత్రి చెప్పారు.

“పక్క రాష్ట్రంలోని కర్నూలు పట్టణం, గుంటూరు జిల్లాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. వాటికి సరిహద్దుల్లోనే తెలంగాణ గ్రామాలున్నాయి. ఈ రెండు సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక అధికారులను నియమించి నియంత్రణ చర్యలు చేపట్టాలి. అటువారెవరు ఇటు రాకుండా, ఇటువారెవరు అటు పోకుండా నియంత్రించాలి. వైరస్ మన దగ్గర పుట్టింది కాదు. ఇతర ప్రాంతాల నుంచి వ్యాప్తి చెందేదే. కాబట్టీ ప్రజల రాకపోకలను ఎంత కట్టుదిట్టంగా నియంత్రించగలిగితే వైరస్ వ్యాప్తిని అంత బాగా అరికట్టవచ్చు” అని ముఖ్యమంత్రి చెప్పారు.

Loading...