Friday, March 29, 2024
- Advertisement -

వాట్సప్ గ్రూపులో చేరాలంటే 2 వేల రూపాయలు

- Advertisement -

మందుబాబుల వేసిన ఎత్తుకు కరీంనగర్ పోలీసులకు దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయింది. టెక్నాలజీ వినియోగంలో పోలీసుల కన్నా నాలుగు ఆకులు ఎక్కువే చదివామని నిరూపించారు. డ్రైంకెన్ డ్రైవ్ సహా, బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా మద్యం తాగుతూ న్యూసెన్స్ చేస్తున్న తాగుబోతుల ఆట కట్టించేందుకు పోలీసులు భారీ స్కెచ్ వేశారు. కరీంనగర్ లో ఎక్కడికక్కడ డ్రోన్ కెమేరాలు ఏర్పాటు చేశారు. మందుబాబులు ఎక్కువగా సంచరించే బహిరంగ ప్రదేశాలైన పార్కులు, థియేటర్లు, మానేరు డ్యాం, ఊరి బయటి తోటలు సహా ఇతర బహిరంగ స్థలాల్లో ఈ డ్రోన్ కెమేరాలు పని చేస్తున్నాయి. వాటి ద్వారా మందుబాబుల కదలికలు, గొడవలు, న్యూసెన్స్ అంతటనీ పోలీస్ స్టేషన్ లో కూర్చుని చూస్తున్న పోలీసులు, వెంటనే రంగంలోకి దిగుతున్నారు. క్షణాల్లో న్యూసెన్స్ చేస్తున్న స్థలాలకు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న చోటుకి వెళ్లిపోతున్నారు. వారిని తెచ్చి స్టేషన్ లోపల పడేస్తున్నారు. కేసులు బుక్ చేస్తున్నారు. ఊరి బయట, ఇతర బహిరంగ ప్రదేశాల్లోకి టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ పై వెళ్తున్న మద్యం ప్రియులు తప్పతాగి, తిరిగి అదే వాహనాలు మీద వస్తున్నారు. ఆ క్రమంలో డ్రెంకెన్ డ్రైవ్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో వాహనాలతో ఎవరైతే వెళ్లి, మద్యం తాగి, తిరిగి అవే వాహనాలు డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నారో వారిపై ఈ డ్రోన్ కెమేరాలతో నిఘా పెట్టారు. తాగి వాహనం ఎక్కిన వెంటనే, పోలీసులు అక్కడికి చేరిపోయి, వాహనంతో పాటు సదరు మందుబాబులను అదుపులోకి తీసుకుంటున్నారు.

మొదట్లో ఈ విషయం మందుబాబులకు అస్సలు అర్ధం కాలేదు. ఎక్కడ మందుకొట్టి, బండి డ్రైవ్ చేసినా క్షణాల్లో వచ్చేస్తున్నారు. అసలు వీరికి ఎలా తెలిసిపోతోందిరా బాబూ…అని తెగ ఆలోచించారు. అంత పక్కా సమాచారం ఇస్తున్న ఇన్ ఫార్మర్స్ ఎవరబ్బా…అని ఆలోచించీ చించీ, చివరికి డ్రోన్ కెమేరాల గుట్టు కనిపెట్టేశారు. ఓర్నీ టెక్నాలజీ ఉపయోగించి మా ఆటలకు అడ్డుకట్ట వేస్తున్నారా ? అని మందుబాబులు విషయాన్ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. తాము కూడా టక్నాలజీ వాడి పోలీసులకు దొరక్కుండా తప్పించుకోవాలని పెద్ద ప్లాన్ వేశారు. వెంటనే కరీంనగర్ లోని దాదాపు 8వందల మంది మందుబాబులు కలిశారు. పలు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ ఎక్కడ నిర్వహిస్తున్నారు. ఎక్కడ సోదాలు చేస్తున్నారు. వాహనాలు ఏ రూట్ లో తనిఖీలు చేస్తున్నారు. వంటి సమాచారాన్ని ఆ గ్రూపులు ద్వారా ఇతరులకు క్షణాల్లో చేరవేసేయడం మొదలు పెట్టారు. పోలీసులు ఉన్న రూటులో కాకుండా వేరే రూటులో వెళ్లిపోయి తప్పించుకోవడం చేశారు. దీంతో రానురానూ పోలీస్ కేసులు తగ్గిపోయాయి. గతంలో నెలకు వందల సంఖ్యలో కేసులు నమోదైతే, ఇప్పుడు పది కూడా నమోదు కాకపోవడంతో ఈ సారి అవాక్కవడం పోలీసులవంతైంది.

ఏదో జరుగుతోందని అంచనా వేసిన పోలీసులు మళ్లీ తమ బుర్రకు పని చెప్పారు. మెల్లగా కూపీలాగి మందుబాబుల వాట్సాప్ గ్రూపుల గుట్టురట్టు చేశారు. అడ్మిన్ లను అదుపులోకి తీసుకుని విచారించగా మరిన్ని షాకింగ్ విషయాలు తెలిశాయి. తమ గ్రూపులో మెంబర్ కావాలంటే ఒక్కో వ్యక్తి 2 వేల రూపాయలు చెల్లించాలి. డ్రంకెన్ డ్రైవ్, బహిరంగ ప్రదేశాల్లో పోలీసుల తనిఖీలు, దాడులుకు సంబంధించిన సమాచారం మాత్రమే ఆ గ్రూపుల్లో పోస్ట్ చేయాలి. అంతకుమించి ఏ ఇతర పోస్టులు చేయకూడదు. పనికిమాలిన రాజకీయాలు, ఇతర కామెంట్లు, జోకులు, పొరపాటున కూడా పోస్ట్ చేయకూడదు. ఆఖరికి హాయ్, గుడ్ మోర్నింగ్, గుడ్ నైట్ వంటి మెసేజులు పెట్టినా సదరు వ్యక్తి కచ్చితంగా 2వందల రూపాయలు ఫైన్ కట్టాల్సిందే. కట్టకపోతే గ్రూప్ నుంచి అతడిని తొలగించేస్తారు. ఈ రూల్స్ పెట్టుకోవడమే కాకుండా, కచ్చితంగా అమలు చేయడంతో మందుబాబులు తమకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారని పోలీసులు విచారణలో తెలుసుకుని అవాక్కయ్యారు. మీరు మామూలోళ్లు కాదురా బాబూ అని మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -