Thursday, April 18, 2024
- Advertisement -

గడ్డర్ల ఏర్పాటుతో పరుగులు పెడుతున్న పోలవరం

- Advertisement -

సంకల్పం ఉంటే చేయలేనిది ఏదీ లేదు. ఆ సంకల్పమే ఇప్పుడు పోలవరాన్ని నడిపిస్తోంది. కరోనా వచ్చినా లాక్ డౌన్ తో వలస కార్మికులు తరలిపోయినా కూడా పోలవరాన్ని జగన్ సర్కార్ ఆపలేదు. ఇప్పుడు వానాకాలం వచ్చినా.. గోదావరి వరద పొంగినా పనులు ఆగకుండా పనులు చేసేందుకు జగన్ సర్కార్ సంకల్పించింది. ప్రణాళికతో చేస్తే ఏదైనా సాధ్యమేనని నిరూపిస్తోంది. పోలవరం కీలకదశకు చేరుకుంటోంది. ప్రాజెక్ట్ లో సోమవారం పూజలు నిర్వహించిన అనంతరం సూచనప్రాయంగా గడ్డర్ల ఏర్పాటు పని ప్రారంభించారు. నేటి నుంచి (మంగళవారం) మొత్తం గిడ్డర్ల ఏర్పాటు ప్రకియను మొదలుపెట్టారు. ఇక పోలవరంలో ఇంతవరకు ఏ జలశయానికి లేనివిధంగా ప్రపంచంలోనే తొలిసారిగా హైడ్రాలిక్ వ్యవస్థతో పనిచేసే భారీ గేట్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచంలోనే ఇలాంటి వ్యవస్థ అరుదైనది. గిడ్డర్ల ఏర్పాటు తరువాత హైడ్రాలిక్ పద్ధతిలో పనిచేసే గేట్లను బిగించనున్నారు. సాధారణంగా ఇప్పటివరకు జలాశయాల ఎలక్ర్టోమెకానికల్ గేట్లను వరద వచ్చినప్పుడు ఎత్తడం దించడం చేస్తుంటారు. మన రాష్ర్టంలో ఇప్పటివరకు కూడా ఇదే పద్ధతి ఉంది. దీనివల్ల నిర్వహణ వ్యయంతో పాటు తరచూ ఐరన్ రోప్ ను మార్చాలి వస్తుంటుంది. పోలవరంలో ఇలాంటి సమస్యలు ఎదురుకాకుండా ఎంఈఐఎల్ అధునాతన హైడ్రాలిక్ గేట్లను ఏర్పాటు చేస్తోంది.

అతి పెద్ద గడ్డర్ల ఏర్పాటు ప్రారంభం
వానాకాలం వచ్చింది. గోదావరిలో వరద ఉధృతి విపరీతంగా ఉంటుంది. ఇన్నాళ్లు పోలవరంకు గోదావరి వరదే మైనస్ అందుకే ప్రాజెక్టు నిర్మాణం అత్యంత క్లిష్టమై ప్రాజెక్టు ఏళ్లుగా ఆగిపోయింది. అందుకే కాంట్రాక్ట్ చేపట్టిన సంస్థ మేఘా అందకు తగ్గట్టుగా ఏర్పాటు చేసింది. పనులు ఆగకుండా వానాకాలం వరదలోనూ పనులు చేసేలా ప్లాన్ చేసింది. అన్ని గేట్లకు (48) సంబంధించిన గడ్డర్ల బిగింపు పని 45-46 బ్లాకులోని పిల్లర్లపైన మేఘా సంస్ధ నిపుణులు, నీటిపారుదల అధికారులు పర్యవేక్షణలో అమర్చటం ప్రారంభమయ్యింది. ఒక్కో గడ్డర్‌ సామర్థ్యం ఎంత పెద్దదంటే ఒక్కొక్క దాని బరువు 62 టన్నులు. అత్యంత క్లిష్ట, కీలకమైన పని ఇది.

ఇక ప్రాజెక్టులోని స్పిల్‌ వే లోని 52 బ్లాక్స్‌ కు సంబంధించిన పియర్స్‌ నిర్మాణం పూర్తి కావచ్చింది. స్పిల్‌వే పియర్స్‌ పై గడ్డర్లు ఏర్పాటు చేస్తే స్పిల్‌ ఛానల్‌ పనులలో సింహ భాగం పూర్తి అయినట్లే. ప్రస్తుతం ఇవి 52 మీటర్ల ఎత్తుకు చేరుకున్నాయి. బల్లపరుపు నేలపై కాంక్రీట్ వేయటం, రికార్డులు సాధించటం పెద్ద గొప్ప కాదు. ఇరుకైన పియర్స్ పై కాంక్రిటింగ్, అదీ బహుళార్ధసాధక ప్రాజెక్ట్ నియమనిబంధనలకు అనుగుణంగా చేయటం అనేది క్లిష్టమైంది. అంతటి క్లిష్టమైన పనిని కూడా మేఘా సంస్థ పోలవరంలో పూర్తి చేస్తోంది. స్పిల్‌ వే మొత్తం దూరం రెండు కిలో మీటర్లు. ఇది ప్రపంచంలోనే పెద్దది. ఇంతవరకూ చైనాలోని త్రీ గార్జెస్‌ డ్యాంలో 47 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహించే విధంగా నిర్మిస్తే ఇక్కడ 50 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహించే విధంగా పోలవరంలో స్పిల్ వే నిర్మిస్తున్నారు. జలాశయంలో నీటిని నిల్వ చేసి వరద వచ్చినప్పుడు కిందకు విడుదల చేసేందుకు కీలకమైనదే స్పిల్‌వే. స్పిల్‌వే పనిచేయాలంటే గేట్ల నిర్వహణ ముఖ్యమైనది. గేట్లు పనిచేయడానికే గడ్డర్లు ఉపయోగపడతాయి. వాటిపై హాయిస్ట్‌ వ్యవస్థను ఏర్పాటుచేసి తద్వారా గేట్లను నియంత్రిస్తారు.

భారీ గడ్దర్లు.. బరువు 62 టన్నులు
పోలవరం స్పిల్‌వే పియర్స్‌ పై 196 గడ్డెర్లను ఏర్పాటు చేస్తారు. ఒక్కో గడ్దర్‌ బరువు 62 టన్నులు. ఇప్పటికే 110 గడ్డర్లు స్పిల్‌ వే పై ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాయ్‌. మేఘా ఇంజనీరింగ్ కేవలం రెండునెలల్లో వీటిని సిద్ధం చేసింది. మిగిలిన వాటిని సిద్ధం చేస్తున్నారు. ఒక్కొక్క గడ్డర్ పొడవు దాదాపు 22.5 మీటర్లు ఉంటుంది. ఒక్కో గడ్దర్‌ తయారీకి 25 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌, 10 టన్నుల స్టీల్ ను వినియోగించారు. మొత్త 196 గడ్డెర్లకు గాను 1960 టన్నుల స్టీల్, 4900 టన్నుల కాంక్రీట్ ను వినియోగించారు. స్పిల్‌ వే పై గడ్డెర్లను ఒక క్రమ పద్దతిలో ఇంజినీర్ల పర్యవేక్షణలో ఏర్పాటు చేసేందుకు నెల రోజు సమయం పడుతుంది. గడ్డర్ల ఏర్పాటు అనంతరం ఇనుప రాడ్లతో జల్లెడ అల్లుతారు. ఆ తరువాత దానిపై కాంక్రీట్‌ తో రోడ్‌ నిర్మిస్తారు. ఈ పనులన్నీ పూర్తి అయితే గేట్లు బిగింపు మినహా మిగిలిన ప్రధాన పనులు అన్ని పూర్తి అయినట్లే. అంటే స్పిల్‌ వే పనులు దాదాపు పూర్తి అయినట్లే. స్పిల్‌ వే లో ఒక వైపు గడ్డెర్లు ఏర్పాటు చేస్తూనే మిగిలిన పనులు చేసుకునేందుకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిర్మాణ సంస్థ మేఘా చర్యలు తీసుకుంటోంది. గడ్డెర్ల ఏర్పాటుకు రెండొందల టన్నుల బరువు మోసే క్రేన్‌ ను వినియోగిస్తున్నారు. ఒక్కో గడ్దర్‌ రెండు మీటర్ల ఎత్తు ఉంటుంది. గడ్డెర్ల ఏర్పాటు, రోడ్‌ నిర్మాణం పూర్తి అయితే గోదావరికి ఎంత వరద వచ్చినా పనులు నిరాటంకంగా చేసుకోవచ్చు.

అనతి కాలంలోనే వేగంగా పనులు
మేఘా సంస్థ జూన్‌ చివరి నాటికి స్పిల్‌ వే లో 1. 41 లక్షల క్యూబిక్‌ మీటర్లు, స్పిల్‌ ఛానల్‌ లో 1,11 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పని, జల విద్యుత్‌ కేంద్రం ఫౌండేషన్‌ లో 3. 10 లక్షల క్యూబిక్‌ మీటర్లు, మట్టి తీసే పని 10. 64 లక్షల క్యూబిక్‌ మీటర్లు, రాయి తొలిచే పనులు 1.14 లక్షల క్యూబిక్‌ మీటర్లు, వైబ్రో కంప్యాక్షన్‌ పనులు 10. 86 లక్షల క్యూబిక్‌ మీటర్లు పని చేసింది.

జగన్ పట్టుదలతో పోలవరం సాకారం
ఎందరో సీఎంలు మారారు. కానీ పోలవరం తలరాత మారలేదు. నాడు వైఎస్ఆర్ వేసిన పునాది అలానే ఉంది. ఆయన చొరవతో పట్టలెక్కింది. ఆయన మరణంతో పోలవరం ఆగిపోయింది. కానీ ఆయన తనయుడి చేతిలో ఇప్పుడు పోలవరం పరుగులు పెడుతోంది. 2019 ఎన్నికల్లో వైసీపి అధికారంలోకి రావటంతో జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలనే ఉద్ధేశ్యంతో రివర్స్‌ టెండరింగ్‌లో తక్కువ ధరకు మేఘా సంస్థకు ప్రాజెక్టును అప్పగించింది. అప్పటి నుంచి పనులు గోదావరి పరవళ్లను మరిపించేలా పరుగులు పెడుతున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టును పూర్తి ఏపీ ప్రజల కలలు నెరవేర్చాలని సీఎం జగన్ పట్టుదలతో ముందుకెళ్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -