మేఘా కృషికి పచ్చబడ్డ తెలంగాణ

1020
MEIL completes critical works of Kaleshwaram Lift Irrigation Scheme
MEIL completes critical works of Kaleshwaram Lift Irrigation Scheme

తెలంగాణ దేశానికి ధాన్యాగారమవుతోంది. ఈ రబీలో రికార్డు స్థాయిలో పంట పండింది. దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ అవతరించింది. దీనివెనుక కాళేశ్వరం గోదారి జలాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టును చేపట్టి రికార్డు స్థాయిలో పూర్తి చేసి తెలంగాణ భూములకు నీళ్లందించి సస్యశ్యామలం చేసిన ‘మేఘా ఇంజనీరింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్’ (ఎంఈఐఎల్) కృషి ఉంది. గోదావరి జలాలను తెలంగాణ వ్యాప్తంగా పంపింగ్ చేసి పచ్చబడేలా చేసిన ‘ఎంఈఐఎల్‌’ రికార్డ్‌ సమయంలో ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణను దేశానికే ధాన్యాగారంగా మలచడంలో కీలక భూమిక పోషించింది. తెలంగాణ ఇంతలా సాధించడం వెనుక మేఘా కృషి పనితనం కాదనలేనిదని సాగునీటి నిపుణులు.. ప్రభుత్వ వర్గాలు, ప్రజాప్రతినిధులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాళేశ్వరం బహుళ ఎత్తిపోతల పథకంలో భాగంగా మేఘ ఇంజనీరింగ్ ఇంఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ నిర్మించిన కొండపోచమ్మ సాగర్ జలాశయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు శుక్రవారం ప్రారంభించారు. దీని ద్వారా 3763 మెగావాట్ల పంపింగ్ సామర్థ్యం వినియోగంలోకి వచ్చింది.

మేఘా సాధించిన ఘనత ఇదీ..
ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం భారీ ఎత్తిపోతల పథకంలో అత్యధిక పంపింగ్‌ కేంద్రాలను మేఘా (ఎంఈఐఎల్‌) పూర్తిచేసింది. తన ఇంజనీరింగ్‌ శక్తిసామర్థ్యాలు, నైపుణాన్ని చాటుకుంది. మొత్తం 22 పంపింగ్ కేంద్రాలలో 96 మెషిన్లు (ఒక పంపు, ఒక మోటారును కలిపితే మిషన్ అవుతుంది ) 4680 సామర్థ్యంతో నిర్మిస్తుండగా అందులో 15 కేంద్రాలలో 89 మెషిన్లను 3840 సామర్థ్యంతో నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో కేవలం నాలుగేళ్ళ సమయంలో దాదాపు 4 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంప్‌హౌస్‌లను నిర్మించడమే కాకుండా వాటిని పంపింగ్‌ ద్వారా వినియోగంలోకి (ఆపరేషన్‌, మెయిన్‌టెనెన్స్‌) తీసుకురావడం ద్వారా మేఘా అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ఔరా అనిపించింది. గొప్ప ఘనతను సాధించింది..


కేసీఆర్ పట్టుదల.. మేఘా కృషి..
తెలంగాణ సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు ఈ కాళేశ్వరం. ఆయన పట్టుదలకు మేఘా సంస్థ కృషి తోడైంది. అగ్నికి ఆయువు తోడైనట్టుగా తెలంగాణలో వేగంగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టుదల, నీటిపారుదల శాఖ నిరంతర పర్యవేక్షణకు తోడు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఎలక్ట్రోమెకానికల్‌ ఇంజనీరింగ్‌ సంస్థలు బీహెచ్‌ఈఎల్‌, ఆండ్రిజ్‌, జైలం, ఏబిబి, క్రాంప్టన్‌ గ్రేవ్స్‌, వెగ్‌ లాంటి సంస్థలు భాగస్వామ్యం పంచుకున్నాయి. ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా లేని స్థాయిలో తొలిసారిగా ఇక్కడ భారీ స్థాయిలో బహుళ ఎత్తిపోతల పథకం కాళేశ్వరాన్ని నాలుగేళ్ళ క్రితం ప్రభుత్వం ప్రారంభించింది. గత ఏడాది జూన్‌లో అంటే నిర్మాణ పనులు ప్రారంభించిన మూడేళ్ళలోనే లింక్‌-1, లింక్‌-2లో ఎత్తిపోతల కేంద్రాలు వినియోగంలోకి వచ్చాయి.


పాతళంలోంచి బీడు భూములకు…
మేఘా సంస్థ పాతళంలోకి నీటిని పంపి ఎత్తిపోసి తెలంగాణ ప్రాజెక్టులను నీటితో కళకళలాడేలా చేసింది. మొత్తం పంపింగ్‌ కేంద్రాల్లో అత్యధిక (15) కేంద్రాలను (భూ ఉపరితలం పైన 11, భూ అంతర్భాగంలో 4) ఎంఈఐఎల్‌ నిర్మించింది. రోజుకు 2 టిఎంసీల నీటిని పంప్‌చేసే విధంగా నిర్మించిన కేంద్రాల్లో 3840 మెగావాట్ల సామర్థ్యం కలిగిన వాటిని ఎంఈఐఎల్‌ నిర్మించింది. వీటిలో 9 కేంద్రాలు వినియోగంలోకి వచ్చాయి. మరో నాలుగు పంపింగ్‌ కేంద్రాలు ఎంఈఐఎల్‌ పరంగా పంపింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. మరో రెండు పంపింగ్‌ కేంద్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇప్పటివరకు పూర్తయిన పంపింగ్‌ కేంద్రాలు 3763 మెగావాట్ల సామర్థ్యం వినియోగంలోకి వచ్చింది. మొత్తం మీద మేఘా ఇంజనీరింగ్‌ రోజుకు 2 టీఎంసీల సామర్థ్యం కింద 3840 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పనులను చేపట్టింది.


కీలక ప్రాజెక్టులు మేఘా చేతిలోనే రూపుదిద్దుకున్నాయి.
గోదావరి నీటిని ఎత్తిపోసే కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన ప్రాజెక్టులన్నీ మేఘా చేతిలోనే ఉండడంతో పనులు వేగంగా సాగి నీరు తెలంగాణ వ్యాప్తంగా ప్రాజెక్టులు, చెరువుల్లోకి చేరింది. గోదావరిని దిగువ నుంచి ఎగువకు తిరుగు ప్రయాణం చేసే విధంగా పంపింగ్‌ చేయడం కోసం 1120 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మూడు పంప్‌హౌస్‌లను 28 మిషన్‌లతో ఏర్పాటు చేశారు. అవి లక్ష్మీ (మేడిగడ్డ), సరస్వతి (అన్నారం), పార్వతి (సుందిళ్ల) పంపింగ్‌ కేంద్రాలు. ఆ తర్వాత ప్యాకేజ్‌-8 పంపింగ్‌ కేంద్రం గాయత్రి. మొత్తం పంపింగ్‌ కేంద్రాల్లో అత్యధిక భాగం భూగర్భంలో నిర్మించినవే. అత్యధిక సామర్థ్యం కలిగిన పంపింగ్‌ కేంద్రాలు భూగర్భంలోనివే. ఇందులో మేఘా ఇంజనీరింగ్‌ నిర్మించిన గాయత్రి (ప్యాకేజ్‌-8), అన్నపూర్ణ (ప్యాకేజ్‌-10), రంగనాయక సాగర్‌ (ప్యాకేజ్‌-11), మల్లన్నసాగర్ (ప్యాకేజ్‌-12) భూగర్భంలో నిర్మించినవే. ఇందులో ప్రధానంగా గాయత్రి పంప్‌హౌస్‌ నిర్మాణం కోసం భూగర్భంలో 2.3 ఘనప మీటర్ల మట్టిని తొలిసి బయటకు తీసింది. గాయత్రి (ప్యాకేజ్‌-8) పంపింగ్‌ కేంద్రం ప్రపంచంలోనే అతిపెద్దది కావడం..మేఘా నిర్మించడం ఇంజినీరింగ్ అద్భుతాల్లో ఒకటిగా పేరొందడంతో మేఘా సంస్థ పేరు మారుమోగిపోతోంది.


భారీ విద్యుత్ వ్యవస్థతో మేఘా సత్తా
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అతిపెద్ద విద్యుత్‌ సరఫరా వ్యవస్థను ఎంఈఐఎల్‌ ఏర్పాటు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు మొత్తం 4680 మెగావాట్ల విద్యుత్‌ అవసరం ఉండగా, ఇందులో అత్యధికంగా 3840 మెగావాట్ల విద్యుత్‌ వ్యవస్థను ఎంఈఐఎల్‌ ఏర్పాటు చేసింది. మొత్తం ఏడు ఈశాన్య రాష్ట్రాల విద్యుత్‌ సరఫరా సామర్థ్యం (3916 మెగావాట్లు), కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంఈఐఎల్‌ ఏర్పాటు చేసిన విద్యుత్‌ వ్యవస్థకు దాదాపు సమానం కావడం మేఘా సంస్థ సత్తాకు నిదర్శనంగా మారింది.


తెలంగాణ నీటి కలను తీర్చిన మేఘా
తెలంగాణ ఏర్పడిందే నిధులు, నీళ్లు, నియామకాలు. ఇందులో నీటి దోపిడీకి గురై తెలంగాణ ఎన్నో పోరాటాలు చేసింది. ఇప్పుడు తెలంగాణ ప్రజల నీటి కలను తీర్చి మేఘా సంస్థ చరిత్రలో నిలిచింది. ఆ సంస్థకు తెలంగాణ ప్రజలంతా రుణపడి ఉండేలా చేసుకుంది. కేసీఆర్ సంకల్పం.. మేఘా కృషికి తెలంగాణ పచ్చబడింది. దేశానికే ధాన్యాగారంగా మలిచింది. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పట్టుదల, నిరంతర పర్యవేక్షణ, నేరుగా యంత్రాంగంతో ప్రతీ అంశం చర్చించి ప్రోత్సహించడం వల్లనే ఇంత తక్కువ కాలంలో ప్రపంచంలోని అతి పెద్ద ప్రాజెక్ట్‌ను పూర్తి చేశామని మేఘా సంస్థ ప్రతినిధి బి. శీనివాస్‌ రెడ్డి తెలిపారు. ఇలా తెలంగాణ సాగునీటి పంటల విప్లవం వెనుక మేఘా కృషి చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Loading...