Thursday, April 25, 2024
- Advertisement -

కశ్మీర్ లో కీలక ప్రాజెక్ట్ మేఘా చేతికి.. దేశ రక్షణలో కీలక పాత్ర

- Advertisement -

దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన హిమాలయాల్లోని జమ్ము కాశ్మీర్ – లడఖ్ లోని జోజిల్లా పాస్ టన్నెల్ పనికి సంబంధించిన టెండర్లో ఎంఈఐఎల్ ఎల్-1 గా నిలిచింది. శుక్రవారం (21-08-2020) జాతీయ రహదారులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ ఎన్ హెచ్ ఐ డి సి ఎల్ (NHIDCL) ఫైనాన్స్ బిడ్లను తెరవగా ఎంఈఐఎల్ మిగిలిన సంస్థల కన్నా తక్కువ ధరకు కోట్ చేయడం ద్వారా మొదటి స్థానంలో నిలిచింది. మొత్తం పనిని దాదాపు 33 కిలోమీటర్ల మేర 2 విభాగాలుగా నిర్మించాల్సి ఉంటుంది. మొదటి విభాగంలో 18.50 కిలోమీటర్ల పొడవైన రహదారిని అభివృద్ధి చేసి నిర్మించాలి. ఇందులో రెండు టన్నెల్స్ ఉన్నాయి. మొదటిది 2 కి.మీ. మరియు రెండవది 0.5 కి.మీ. అలాగే రెండవ విభాగంలో జోజిల్లా టన్నెల్ ను 14.15 కిలోమీటర్ల మేర రెండు రహదారుల లైన్ గా 9.5 మీటర్ల వెడల్పు, 7.57 మీటర్ల ఎత్తు పద్ధతిలో గుర్రపు నాడా (Horse shoe shape) ఆకారంలో నిర్మించాల్సి ఉంటుంది. ఇంతవరకు దేశంలో ఎక్కడా నిర్మించని పద్ధతిలో అధునాతనమైన రీతిలో క్లిష్టమైన పరిస్థితిలో ఈ పనిని చేపట్టాల్సి ఉంటుంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ రోడ్ టన్నెల్ కు సంబంధించిన పనులను ఎట్టకేలకు పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి టెండర్లను పిలిచింది. ఇందులో జోజిల్లా టన్నెల్ కు సంబంధించి 14.15 కిలోమీటర్ల రహదారిని నిర్మించేందుకు మరియు ఇతర రోడ్ పనులకు గాను వేరే సంస్థలు అధిక ధరలకు కోట్ చేయగా ఎంఈఐఎల్ 4509.50 కోట్ల రూపాయలకు పనులు చేసేందుకు ముందుకు వచ్చింది. మిగిలిన రెండు కంపెనీలతో పోలిస్తే ఎంఈఐఎల్ తక్కువ ధరకు కోట్ చేయడం ద్వారా ఎల్-1 నిలిచింది. గత నెల 30వ తేదిన NHIDCL మూడు సంస్థలు బిడ్ లు సమర్పించగా ఆగష్టు 21 న ఫైనాన్స్ బిడ్లు తెరిచారు.

జమ్ము కాశ్మీర్ లోని శ్రీనగర్ నుంచి లడఖ్ లేహ్ ప్రాంతానికి ఉన్న రహదారి ఏడాది పొడవునా వాహనాలు ప్రయాణించేందుకు అనుకూలంగా ఉండడం లేదు. హిమాలయాల్లో ముఖ్యంగా శీతాకాలంతో పాటు మొత్తం ఆరు నెల్లపాటు శ్రీనగర్- లడఖ్ రహదారిని పూర్తిగా మూసివేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మిలటరీకి సంబంధించిన వాహనాలు కూడా ప్రయాణించలేకపోతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాల్లో సుదీర్ఘ దూరం ప్రయాణించడానికి అత్యధిక వ్యయ ప్రయాసాలతో పాటు సమయం కూడా వృధా అవుతోంది. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా సోనామార్గ్ నుంచి కార్గిల్ మీదుగా లేహ్, లడఖ్ కు రహదారి టన్నెల్ నిర్మించాలని ఎప్పుడో ప్రతిపాదించారు. అయితే ఆచరణలో మొదటి అధ్యాయం ఇప్పటికి సాధ్యం అయ్యింది. ఎంఈఐఎల్ ఎల్-1 గా నిలిచిన పనిని జాతీయ రహదారి-1లోని జడ్ -మోర్హ (Z-Morh) టన్నెల్ నుంచి జోజిల్లా టన్నెల్ వరకు కనెక్టింగ్ టన్నెల్ ను జోజిల్లా పాస్ ప్రాంతంలో సోనామార్గ్- కార్గిల్ మధ్య నిర్మిస్తారు. ఈపిసి పద్ధతిలో పిలిచిన ఈ పని అత్యంత క్లిష్టమైనది. ప్రపంచంలో ఇంతవరకు ఏ రహదారి టన్నెల్ నిర్మాణంలో ఎదురుకాని అవాంతరాలు ఈ టన్నెల్ నిర్మాణంలో ఎదురుకానున్నాయి. సరాసరిన భూ ఉపరితలం నుంచి 700 మీటర్ల దిగువన టన్నెల్ ను నిర్మించాల్సి వస్తుంది. పూర్తిగా క్లిష్టమైన కొండప్రాంతం (complicated hilly terrain) తో పాటు మంచు తుఫాన్ లు తరచూ సంభవిస్తుంటాయి. దట్టమైన మంచు సంవత్సరంలో 8 నెలల పాటు ఉండడం వల్ల పనులు చేయడం అంత సులభం కాదు. అదే సమయంలో పక్కనే నది కూడా ప్రవహిస్తోంది. దీనివల్ల నిర్మాణ సమయంలో నీరు, మంచు ప్రవేశించి తీవ్ర సమస్యలు ఎదురవుతాయని భావిస్తున్నారు.

సరిహద్దు రహదారులు సంస్థ (BRO)జమ్ము కాశ్మీర్- లడఖ్ మధ్య అన్ని వర్గాల వారికి రహదారి ప్రయాణ సౌకర్యాలు మెరుగు పరచాలని నిర్ణయించింది. అందులో భాగంగానే హైవే టన్నెల్ ను శ్రీ నగర్ నుంచి బల్తల్ వరకు కూడా నిర్మించాలి. అమరనాథ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు కూడా ఈ టన్నెల్ రహదారి వాడవచ్చు. ఈ యాత్రకు వెళ్లే వారికి కార్గిల్ సమీపంలోని బల్తల్ బేస్ క్యాంప్ గా ఉంది.

సింగిల్ ట్యూబ్ టన్నెల్ గా పిలిచే ఈ జోజిల్ల రహదారిలో రెండు వైపులా ప్రయాణించే (బై డైరెక్షనల్ ట్రాఫిక్) రెండు లైన్ల రహదారి నిర్మించాల్సి ఉంటుందని ఎంఈఐఎల్ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ సిహెచ్. సుబ్బయ్య గారు తెలిపారు. ఈ రహదారిలో ప్రధానంగా శాప్ట్స్ తో పాటు పోర్టల్ స్ర్టక్చర్స్, తవ్విన మట్టిరాయి (మక్కు) డిసోపోసబుల్ ప్రాంతాలు కూడా ఉంటాయి. ఇంతటి క్లిష్టమైన ప్రాజెక్ట్ ను 72 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఈ మొత్తం పనిని ప్రధానంగా రెండు భాగాలుగా చేయాల్సి ఉంటుంది. ఇందులో మొదటి భాగం రహదారి 18.50 కిలోమీటర్లు, రెండవ భాగం టన్నెల్ గా 14.15 కిలోమీటర్లు. మొదటి భాగం జడ్ -మోర్హ నుంచి నుంచి జోజిల్లా టన్నెల్ వరకు ప్రస్తుతం ఉన్న రహదారిని 3.018 కిలోమీటర్లు విస్తరించి అభివృద్ధి చేయాలి. కొత్తరహదారి 13.842 కిలోమీటర్లు నిర్మించాలి. ఇందులోనే ట్విన్ టూర్ టన్నెల్స్ ఒకటి 2.36 కిలోమీటర్లు, రెండవది 2.39 కిలోమీటర్లు నిర్మించాలి. ఇందులో 5 బ్రిడ్జ్ లు ఉంటాయి. ఒక్కొక్కటి 300 మీటర్లు, 150 మీటర్ల చొప్పున రెండు స్నో గ్యాలరీలను నిర్మించాలి. ఈ పనులన్నీ మొత్తం 18.475 కిలోమీటర్లు. అదే విధంగా పార్ట్-2లోని జోజిల్లా టన్నెల్ నిర్మించాలి. ఇందులో టన్నెల్ కు సంబంధించి పైన పేర్కొన్న వివారాలతో పాటు 0.16 కిలోమీటర్ల పొడవున కట్ అండ్ కవర్ టన్నెల్ ఉంటుంది. వెంటిలేషన్ క్యావరిన్, శాఫ్ట్ల్ లు 3 నిర్మిస్తారు. లాంగ్ ట్యూడనల్ వెంటిలెషన్ సిస్టంగా పిలిచే శాఫ్ట్ లు రెండింటిని నిర్మిస్తారు. ఎక్కడా లేనటువంటి క్లిష్టమైన పరిస్థితులు ఈ టన్నెల్ నిర్మాణంలో ఎదురుకావోచ్చని అనుకుంటున్నారు. ఇందులో ప్రత్యేకంగా ట్రాన్స్ పోర్టు వెంటిలేషన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. వీటికి అధనంగా రిటైనింగ్ గోడలు, బ్రిస్ట్ గోడలు, గేబియన్ నిర్మాణాలు, మట్టితో నిర్మించే గోడలు మొత్తం దాదాపు 10 కిలోమీటర్ల వరకు ఎంఈఐఎల్ నిర్మించాల్సి ఉంటుందని సుబ్బయ్య తెలిపారు. మంచుతుఫాన్ లు తలెత్తితే ఎటువంటి ప్రమాదం లేకుండా క్యాచ్ డ్యామ్స్, ఎయిర్ బ్లాస్ట్, ప్రొటెక్షన్ గోడలు, డిఫ్లెక్టర్ డ్యామ్స్ దాదాపు 6 కిలోమీటర్ల మేర నిర్మిస్తారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -