Thursday, April 25, 2024
- Advertisement -

బడ్జెట్ అను”మతి” లేని బాబు క్విడ్ ప్రో కో

- Advertisement -

పోలవరం క్విడ్‌ప్రోకో పేరిట చంద్రబాబు నాయుడు అసలు లేని బడ్జెట్‌ను సృష్టించారా…? దేశంలో మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లోనూ మూడేళ్ళలో 3545 కోట్లు వ్యయం చేసేందుకు కేంద్రం నిర్ణయించగా ఆయన మాత్రం ఏకంగా ఏపీలోనే ఈ ఏడాది 7500 కోట్ల స్కామ్‌ జరుగుతోందంటూ ఆరోపించడంలో ఆంతర్యం ఏమిటి? అసలు ఆంధ్రప్రదేశ్‌కు బస్సుల కొనుగోలులో స్వేచ్ఛ, అధికారాలు లేకపోయినప్పటికీ నేరుగా కొనేస్తుందంటూ ఆయన ఏ ఉద్దేశ్యంతో చెబుతున్నారు? అసలు రాష్ట్రాలకు లేని అధికారాన్ని ఆయన ఏకంగా సృష్టించి దానికి క్విడ్‌ప్రోకో అంటూ కొత్త నామకరణం చేసేసి తమ కాలంలో జరిగిన అక్రమాలు, అవకతవకల నుంచి బయటపడేందుకు కొత్త ఆరోపణలను తెరమీదకు తెచ్చారు.

ఆర్టీసీ అస్సలు బస్సులే కొనడం లేదు
ఏపీఎస్‌ఆర్టీసి నేరుగా బస్సుల కొనుగోలు చేసే పద్ధతే లేనప్పుడు ఇక ఒలెక్ట్రా నుంచి ఎలక్ట్రిక్బస్సులు కొనుగోలు చేయడం ఎలా సాధ్యమవుతుంది? ఆర్టీసి నష్టాలతో నడుస్తుండడంతో బస్సుల కొనుగోలు విధానం నిలిపివేసి పూర్తిగా లీజు పద్ధతిలో సేకరిస్తూ ప్రయాణికుల అవసరాలు తీర్చే విధంగా నడుపుతున్నారు. ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలులోనూ అదే విధానం అవలంబిస్తున్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా మార్గదర్శక విధానాలు జారీ చేసింది. దేశంలో ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ, కర్నాటక మొదలైన రాష్ట్రాల రవాణా సంస్థలు లీజు పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులును ఒలెక్ట్రాతో పాటు ఇతర సంస్థల నుంచి సేకరిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2018 మే 23న అమరావతిలో ఒలెక్ట్రా ఏసీ బస్సులలో ప్రయాణించి వాటికి కితాబు ఇవ్వడంతో పాటు రాష్ట్ర ఫ్రభుత్వం వివిధ నగరాల్లోనూ, తిరుమలు-తిరుపతి మద్య ఎలక్ట్రిక్బస్సులు నడిపేందుకు పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తామని ప్రకటించారు.

ఇప్పుడు ఆయనే మేఘా నుంచి క్విడ్‌ ప్రోకో పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ కొనుగోలు చేస్తోందని గగ్గోలు పెడుతున్నారు. మేఘా పెట్టుబడులు ఉన్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ సంస్థలో ఉన్నాయి. పోలవరంలో ప్రధానమైన పనిని తక్కువ ధరకు అంటే 12.6శాతం తక్కువకు టెండర్‌ను మేఘా సంస్థ కోట్‌ చేసింది. ఈ పనికి సంబంధించిన వివాదం ప్రస్తుతం కోర్టులో ఉన్నందున అది పరిష్కారమైతే తప్ప పనిని ఆ సంస్థకు అప్పగించడం ప్రభుత్వానికి సాధ్యం కాదు. కానీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా తెలుగుదేశం నాయకులంతా పోలవరంలో వచ్చే నష్టాన్ని ఒలెక్ట్రా బస్సుల కొనుగోలు చేయడం ద్వారా క్విడ్‌ప్రోకో కింద 7500 కోట్ల రూపాయలు సమకూరుస్తున్నారని ఆరోపిస్తున్నారు.

అసలు ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులునే కొనుగోలు చేసే విధానమే లేదు. కేంద్రం ప్రభుత్వం ఫేమ్‌-2 కింద 350 బస్సులను ఏపీకి మంజూరు చేసింది. ఈ బస్సులను అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్న విధంగానే లీజు పద్ధతిలో ఉత్పత్తి సంస్థ నుంచి తీసుకొని 12 ఏళ్ళపాటు ఆ సంస్థలే నిర్వహిస్తే కిలోమీటర్‌కు నిర్ధారించిన ధర ప్రకారం చెల్లించే విధానాన్ని అమలు చేస్తోంది. ఇందుకోసం ఏడాదికి 3.98 కోట్ల కిలోమీటర్లు మేర ఈ బస్సులు నడపాలని ప్రతిపాదించారు. ప్రాథమికంగా కిలోమీటర్‌కు రూ. 39 చెల్లించాలని భావిస్తున్నారు. అయితే టెండర్లో ఏ సంస్థ తక్కువ ధరకు కోట్‌ చేస్తే ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ఆ ప్రకారం చెల్లిస్తారు. ఇందుకోసం అక్టోబర్‌ 14న ఫైనాన్స్‌బిడ్‌ తెరుస్తారు.

ఏడాదికి 144 కోట్ల వ్యాపారం – 7500 కోట్లు క్విడ్‌ప్రోకో ఎక్కడో బాబే చెప్పాలి
ఇందుకోసం ఆర్టీసీ ఏడాదికి 144 కోట్ల రూపాయలు చెల్లించే విధంగా బడ్జెట్‌ ఏర్పాటు చేసుకుంటోంది. ఇందులో అత్యధిక భాగం కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తోంది. అంత మొత్తం బడ్జెట్‌ స్పష్టంగా కేటాయిస్తే ఒలెక్ట్రా బస్సుల కొనుగోలులో మేఘాకు రూ. 7500 కోట్లు అక్రమంగా చెల్లించనున్నారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మొత్తం 350 బస్సుల లీజు పద్ధతిలో ఒలెక్ట్రాకు లభిస్తాయో లేదో తెలీదు. ఒకవేళ అన్ని బస్సులు ఒలెక్ట్రాకే లభిస్తే ఆ ప్రకారం ఏడాదికి 144 కోట్లు చెల్లిస్తారు (టెండర్‌ ధర ఆధారంగా తుది చెల్లింపు ఉంటుంది). అప్పుడు కూడా బస్సుల ధరలు నిర్వహణ ఖర్చు పోనూ ఒలెక్ట్రాకు లాభం రావచ్చు లేదా నష్టపోవచ్చు. 350 బస్సులు ఆ సంస్థకే దక్కితే ఆర్టీసీ కేటాయించిన మొత్తం బడ్జెట్‌ ఆ సంస్థ ఖాతాలో చేరిపోయినట్లు కానేకాదు. అది వ్యాపారం మాత్రమే అవుతుంది. ఆ ప్రకారం చూసుకుంటే ఐదేళ్ళలో 720 కోట్లు వ్యాపారం ఆ సంస్థకు జరుగుతుంది. అప్పుడు కూడా మొత్తం వ్యాపారం మేఘాకు సంబంధం ఉండదు. ఒలెక్ట్రాలో అత్యధిక వాటా మాత్రమే మేఘా యాజమాన్యానికి ఉంది. మరిక్కడ 7500 కోట్లు క్విడ్‌ప్రోకో ఎక్కడ నుంచి వచ్చిందో చంద్రబాబు నాయుడు అండ్‌ కో నే చెప్పాలి.

పోలవరం ప్రాజెక్ట్‌ను మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ కాళేశ్వరం త్వరితగతిన పూర్తిచేసిన విధంగానే నిర్మించాలని నిర్ణయించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమైన ప్రాజెక్ట్‌లు పూర్తి చేయడం ద్వారా తెలుగు ప్రజలకు ఎంతో కొంత ఉపయోగపడాలనేది సంస్థ యాజమాన్య భావిస్తున్నట్లు పారిశ్రామిక వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందువల్లనే ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్ట్‌ను తక్కువ ధరకు కోట్‌ చేసింది. ఈ వ్యవహారం కోర్టులో పరిష్కారం అయితే తప్ప మేఘాకు పని దక్కే పరిస్థితి లేదు.

పోలవరం లెస్ టెండర్తో బాబులో గుబులు
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పోలవరం పనుల్లో 2400 కోట్ల మేర అక్రమాలు, అవకతవకలు జరిగాయని తద్వారా ఆయనతో పాటు ఆ పార్టీ నేతలు బాగా లబ్ధిపొందారని ఆరోపణలు వచ్చాయి. ఈ ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ వాటిని ఆధారాలతో సహా బయటపెట్టింది. దాంతో చంద్రబాబు ఐదేళ్ళ కాలంలో చేసిన అక్రమాలు, అవకతవకలు బయటపడ్డాయి. ఎన్నికల ప్రచార సమయంలో పోలవరాన్ని ఆయన ఏటీఎం కార్డుగా వాడుకున్నారని ప్రధాని నరేంద్ర మోడి ఆరోపించిన సంగతి ఈ సందర్భంగా గమనార్హం. అదే సమయంలో ప్రాజెక్ట్‌ను 2018 డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తామని ప్రకటించి ఘోరంగా విఫలమయ్యారు. ఎంత వేగంగా చేసినా కనీసం మూడేళ్ళు పడుతుంది. ముంపునకు గురయ్యే బాధితులకు సహాయ పునరావాస కార్యక్రమాలు ప్రారంభించనే లేదు. ఈ పరిస్థితుల్లో తక్కువ ధరకు టెండర్‌ దాఖలు కావడం చంద్రబాబు నాయుడు అండ్‌ కో కు రుచించలేదు. ఆయనపై ఆరోపణలు రుజువయ్యే పరిస్థితి కనిపిస్తుండడంతో దానిని నుంచి బయటపడేందుకు ఒలెక్ట్రా బస్సుల క్విడ్‌ప్రోకోను తెరమీదకు తెచ్చారు. అందుకు పచ్చమీడియా విస్తృతంగా ప్రచారం కల్పిస్తూ ప్రజల మదిలో వాస్తవం అనిపించేందుకు ప్రయత్నిస్తోంది. కుక్కను చంపాలంటే ముందుగా పిచ్చిదనే ముద్రవేయాలనే వ్యూహంతో తెలుగుదేశం వెళుతోంది. అందులో భాగంగానే లేని బస్సుల కొనుగోలు, అసలు బడ్జెట్‌యే లేని మొత్తాన్ని ముందుకు తెచ్చారు.

హిమాచల్ కొండలు ఎక్కిన ఏకైక ఒలెక్ట్రా
కేంద్ర ప్రభుత్వం మొత్తం అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాల కోసం రానున్న మూడేళ్ళలో రూ. 10000 కోట్ల సహాయాన్ని రాష్ట్రాలకు ప్రకటించింది. అందులో భాగంగా 7000 బస్సులను అన్ని రాష్ట్రాల ఆర్టీసీ సంస్థలు కొనుగోలు/లీజుకు తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి 28న స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఏడాది మొత్తం 3545 కోట్లు ఈ-బస్సుల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు నిధులు మంజూరు చేసింది. అయితే చంద్రబాబు నాయుడు ఏకంగా లేనిబడ్జెట్‌ను సృష్టించి అంతకన్నా రెట్టింపు అంటే 7500 కోట్లు ఒక్క ఏపీలోనే స్కాం జరుగుతోందంటూ విచిత్రమైన ఆరోపణలు చేశారు. కేంద్రం కేటాయించిన నిధులతో అన్ని రాష్ట్రాలు కలిపి 5595 బస్సులను సేకరించాలి. అందుకు 3545 కోట్లు కేంద్రం విడుదల చేస్తోంది. మొత్తం బస్సులల్లో ఏపీకి 350 కేటాయించారు. ఆ ప్రకారం ఏపీకి ఆ మొత్తం నుంచి నిధులు విడుదలవుతాయి. అందుకు తగిన విధంగానే ఆర్టీసీ ఏడాదికి 144 కోట్ల బడ్జెట్‌ను వ్యయం చేయాల్సి వస్తోందని అంచనా వేసుకుంది. దీనివ్ల ఆర్టీసీకి ఏడాదికి సరాసరిన 1000 కోట్ల రూపాయలు ఆదా అవుతుంది. కానీ చంద్రబాబు మాత్రం అస్సలు లేని బడ్జెట్‌నే సృష్టించి ఆ విధమైన ఆరోపణలను తాను మాత్రమే చేయగలనని నిరూపించారంటూ పారిశ్రామిక వర్గాలు విస్తుపోతున్నాయి. దేశంలో ఈ-బస్సుల ఉత్పత్తి, తయారీలో ఒలెక్ట్రాతో పాటు టాటా, అశోకా లైలాండ్‌, మహేంద్ర మొదలైన సంస్థలు ఉన్నాయి. ఈ నెల 26న ఏపీఎస్‌ఆర్టీసీ నిర్వహించిన ప్రిబిడ్‌ సమావేశంలో 18 సంస్థలకు సంబంధించిన 27 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే వాటిలో చాలా కంపెనీల బస్సులు ఎత్తైన ప్రాంతాల్లో నడవలేని పరిస్థితి ఉంది. తిరుమల – తిరుపతి మధ్య ఒలెక్ట్రా బస్సులు మాత్రమే నడపడం సాధ్యమవుతుందనేది హిమాచల్‌ ప్రదేశ్‌లో మిగిలిన సంస్థల బస్సుల విఫలం కావడాన్ని బట్టి స్పష్టంగా చెప్పవచ్చని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి.

కేంద్ర మార్గదర్శకాలు కఠినం – రాష్ట్రాల అధికారాలు పరిమితం
దేశంలో మొత్తం అన్ని రాష్ట్రాల్లోని 64 నగరాల్లో ఈ బస్సుల వినియోగించేందుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. నిధులు విడుదల చేసేది కేంద్ర ప్రభుత్వం. వారి మార్గదర్శక సూత్రాల ప్రకారం బస్సులు నడపాలి. ఇందుకోసం ఈ టెండరింగ్‌ విధానాన్ని స్పష్టంగా కేంద్ర నిర్ణయించింది. బస్సుల అర్హత వాటి శక్తి సామర్థ్యాలు నిర్ణయించేందుకు ఉన్నతస్థాయి స్క్రీనింగ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ ప్రకారమే ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ జారీ చేసిన టెండర్‌ ఉంది. ఇందుకు సంబంధించి 110 పేజీల ఈ టెండర్‌ ఆహ్వాన పత్రం లేదా 237 పేజీల ముసాయిదా రాయితీ ఒప్పందాన్ని పరిశీలిస్తే టిడిపి చేస్తున్న ఆరోపణలు ఎంత విచిత్రమైనదో విస్తుపోకతప్పదు. బస్సుల ఎంపిక, ప్రోత్సాహాకాలు, సేకరించే బస్సుల సంఖ్య మొదలైన అంశాల్లో రాష్ట్రాలకు స్వేచ్ఛ లేదు. కేంద్రం నిర్ణయించిన ఆదేశాలను అమలు చేయాల్సిందే. ఒప్పందం కుదిరిన తరువాత కిలోమీటర్‌ ప్రాతిపాదికన ఆపరేటర్‌కు అంటే ఎవరు తక్కువ ధరకు కోట్‌ చేశారో వారికే చెల్లిస్తారు. ప్రిబిడ్‌ సమావేశంలో పాల్గొన్న 18 కంపెనీల్లో ఎవరైనా కావచ్చు. కనీసం బస్సుల తిప్పే నగరాలను స్వేచ్ఛగా ఎంచుకునే అధికారం కూడా రాష్ట్రాలకు లేదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రం సొంతంగా తాను అనుకున్న వారికి టెండర్‌ కట్టబెట్టడం సాధ్యం కాదు.

ఇప్పటికే ఒలెక్ట్రా విద్యుత్‌ బస్సుల విజయవంతంమయ్యాయి. చైనాకు సంబంధించిన బీవైడి సంస్థతో కలసి బస్సులను ఉత్పత్తి చేస్తున్న ఒలెక్ట్రా షాద్‌నగర్‌ సమీపంలో పరిశ్రమను కూడా ఏర్పాటు చేసింది. దేశంలో పలు సంస్థలు ఈ-బస్సులను ఉత్పత్తి చేస్తున్నా ఒలెక్ట్రా బస్సులు మాత్రమే మిగిలినవాటికన్నా మెరుగ్గా ఉన్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఎత్తైన కొండ ప్రాంతాలను సైతం సునాయాసంగా ఈ-బస్సు ఎక్కినందుకు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డులో కూడా చోటు సాధించుకుంది. దేశ వ్యాప్తంగా గత రెండేళ్ళ నుంచి పది రాష్ట్రాలు విద్యుత్‌ బస్సులు నడిపేందుకు ముందుకు రాగా ఒలెక్ట్రా సంస్థ తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర, కేరళ, హిమాచల్‌ ప్రదేశ్‌, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో అద్దే ప్రతిపాదికన ఆయా రాష్ట్రాల ఆర్టీసీకి లీజుకు ఇచ్చింది. ఇవి విజయవంతంగా తిరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏపీలో కూడా ఇదే విధానం పాటించాలని నిర్ణయించారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వ విధానం కూడా తోడైంది. ఇంత స్పష్టమైన విధానం ఉన్నప్పటికీ మేఘాకు మేలు చేసేందుకు ఒలెక్ట్రా నుంచి విద్యుత్‌ బస్సులను ఏపీఎస్‌ఆర్టీసీ కొనుగోలు చేస్తోందని చంద్రబాబు నాయుడు పదేపదే ఆరోపిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -