తెలంగానాణాలో మూగ‌బోయిన ఎన్నిక‌ల ప్ర‌చారం….

343
Telangana Election 2018 : Telangana Election Compagian End Tody on 5th Decumber
Telangana Election 2018 : Telangana Election Compagian End Tody on 5th Decumber

తెలంగాణాలో ఎన్నిక‌ల ప్ర‌చారానికి తెర‌ప‌డింది. నెల‌రోజులుగా మైకుల‌తో అన్ని రాజ‌కీయ పార్టీలు ఎన్నిక‌ల మోత మోగించాయి. ఈరోజు సాయంత్రం ఐదు గంటలతో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. సాయంత్రం ఐదు గంటల తర్వాత బహిరంగ సభలపై ఈసీ నిషేధం విధించగా, సభలు, ఊరేగింపులు, సినిమా, టీవీల ద్వారా ప్రచారంపై ఆంక్షలు విధించింది.

దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పార్టీలకు ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఏడో దేదీ సాయంత్రం 5 గంటల వరకు ఎలాంటి బల్క్ మెసేజ్‌లు పంపకూడదని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో అన్ని పార్టీలు, ఇండిపెండెంట్లు కలిపి 1821 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అందులో వివిధ పార్టీల నుంచి 515, ఇండిపెండెంట్లు 1306 మంది పోటీలో ఉన్నారు.

అధికార పార్టీ టీఆర్ఎస్, ప్రజాకూటమిలోని పార్టీలు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ లు తమ గెలుపును ఆకాంక్షిస్తూ హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారాలు, నేతల ప్రసంగాలు జరిగాయి. ఎన్నికల ప్రచారంలో జాతీయ పార్టీల నేతలు పాల్గొన్నారు. తెలంగాణలోని మొత్తం 119 స్థానాలకు ఈ నెల 7న ఎన్నికలు జరగనున్నాయి. 11న కౌంటింగ్ జరుగుతుంది.

చివరి వరకు పార్టీలన్నీ నువ్వా నేనా అన్నట్లు పోటీపడి మరి ప్రచారం చేశాయి. ప్రధాని నుంచి పార్టీలో కిందిస్థాయి కార్యకర్త వరకు అందరూ ప్రచారంలో బిజీగా గడిపారు. గల్లీ, గల్లీకి తిరుగుతూ ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. బుధవారం గజ్వేల్‌లో జరిగిన సభతో టీఆర్ఎస్ ప్రచారాన్ని ముగిస్తే.. ప్రజా కూటమి కోదాడ బహిరంగ సభతో ప్రచారానికి పుల్‌స్టాప్ పెట్టింది.

ఇక రాష్ట్రంలో సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఒపీనియన్‌ పోల్స్‌, సర్వేలపై నిషేధం అమల్లోకి వచ్చింది. బుధవారం సాయంత్రం 7 గంటల నుంచి మద్యం దుకాణాలు బంద్ అవుతాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే, రెండేళ్లు జైలుశిక్ష లేదా జరిమానా విధించే అవకాశం ఉంది.

ఈ నెల 7న (శుక్రవారం) ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకు.. మిగిలిన ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. తెలంగాణ ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో 1,821 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్ కోసం.. 32,815 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.