Thursday, April 25, 2024
- Advertisement -

అంటరాని పార్టీపై పురందేశ్వరికి ఎంత ప్రేమో

- Advertisement -

ఒకప్పటి టీడీపీ నాయకురాలు, నిన్నటి కాంగ్రెస్ నాయకురాలు, ప్రస్తుత బీజేపీ నాయకురాలు, రేపు ఏ పార్టీలో ఉంటారో తెలియని దగ్గుబాటి పురందేశ్వరిగారికి చంద్రబాబు మీద ఎక్కడ లేని కోపం పుట్టుకొచ్చింది. అదే సమయంలో మోడీ మీద ఎక్కడ లేని ప్రేమ పొంగుకొచ్చింది. కానీ బీజేపీ ఏపీకి చేస్తున్న అన్యాయంపై మాత్రం ఆమెలో వీసమెత్తు చలనం లేదు. పైగా ఆమె మాటలు వింటే దయ్యాలు వేదాలు వల్లించిన చందంగానే ఉన్నాయి. అవిశ్వాస తీర్మానంలో మద్దతిచ్చిన కాంగ్రెస్ సహా ఇతర పార్టీలకు ధన్యావాదాలు చెప్పడానికి చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నట్లు ప్రకటించారు. దీనిపైనే పురందేశ్వరికి కోపం వచ్చేసింది. నాన్నగారు ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీ పెట్టారో, ఆ పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ తోనే చేతులు కలుపుతారా ? కాంగ్రెస్ మద్దతుతో ఏపీకి అన్యాయం చేసిన మోడీ మీద అవిశ్వాసం పెడతారా ? తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేస్తారా ? కాంగ్రెస్ పార్టీకి ధన్యావాదాలు చెబుతారా ? అంటూ పురందరేశ్వరి ఒంటికాలిపై లేచారు.

నాన్నగారి పార్టీ, ఆశయాలు, ఆత్మగౌరవం అంటూ ఇంత బాధ పడిపోతున్న పురందేశ్వరి, మరి అదే కాంగ్రెస్ పార్టీలో నాడు ఎలా చేరిపోయారో ? వారిచ్చిన కేంద్రమంత్రి పదవి అనే భిక్షనే పంచభక్షపరమాన్నాలుగా ఎలా అనుభవించారో… ఏపీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తున్న వేళ చివరి వరకూ పదవిలో వేలాడి, అంతా అయిపోయాక, బీజేపీలోకి మారిపోయి, ఆ పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ కేంద్రమంత్రి అయిపోవచ్చని అవకాశవాద రాజకీయాలు చేసిన ఈమె, ఈ రోజు ఏం మాట్లాడుతున్నారో ఆమెకైనా అర్ధమవుతోందా ? అసలు ఏం అర్హత ఉందని ఈమె చంద్రబాబుని విమర్శిస్తున్నారు. ఈమె కాంగ్రెస్ లో చేరిన రోజు, ఆ పార్టీ తరఫున కేంద్రమంత్రిగా వెలగబెట్టినన్నాళ్లూ నాన్నగారి ఆశయాలు, ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా ? రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా, అడ్డగోలుగా విభజిస్తున్నారు..వద్దు మొర్రోమని ఆరుకోట్ల ఆంధ్రులు లబోదిబోమన్నప్పుడు పురందేశ్వరికి తెలుగువారి ఆత్మఘోష, ఆత్మగౌరవం వినిపించలేదా ? ఇప్పుడు కూడా అవిశ్వాస తీర్మానం పెట్టేసి మోడీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని టీడీపీ నాయకులు చెప్పలేదే. మెజార్టీ లేదని తెలియనంత అమాయకులు కాదు. అవిశ్వాసం తీర్మానం ద్వారా చర్చతో ఏపీకి జరిగిన అన్యాయాన్ని, మోడీ చేసిమ మోసాన్ని దేశమంతా వినిపించాలనే ప్రయత్నమే అవిశ్వాస తీర్మానం. టీడీపీ నేతలు మోడీని కించపరిచేలా మాట్లాడారు. అని బాధ పడిపోయారు. మీకు పదవులు ఇవ్వాలంటే అలా మోడీ మీద ప్రేమ నటించండి తప్పు లేదు కానీ, మోడీని కించపరిచేలా పార్లమెంట్ లో కాదు, ఆంధ్రా వీధుల్లో అత్యంత దారుణంగా జనం మాట్లాడుతున్నారు. హోదా పేరుతో దారుణంగా మోసం చేశాడని, నోట్ల రద్దు, అవినీతి అంతం అని చెప్పి, సామాన్య, చిరు ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజల వెన్ను విరిచాడని మోడీని మాటల్లో చెప్పలేనంత దారుణమైన భాషలో తిడుతున్నారు. మరి వారికి పురందేశ్వరి ఏం సమాధానం చెబుతారు.

ప్రత్యేక హోదా ఇవ్వలేదని కానీ, విభజన హామీలు నెరవేర్చలేదనే బాధ కానీ పురంధేశ్వరి మాటల్లో వీసమెత్తు కనిపించలేదు. మోడీని కించపరిచారనే బాధ పడినదానిలో పదో వంతు బాధ కూడా ఏపీకి జరిగిన అన్యాయంపై ఆమెకు లేదు. పైగా మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందని డాంభికాలు పలుకుతున్నారు. అదీ చూద్దాం. ఏపీలో ఎన్ని సీట్లు గెలుచుకుంటారో. ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారో. ఇప్పటికే ఆ పార్టీని ఇతర పార్టీలు అంటరాని పార్టీగా చూస్తున్నాయి. బీజేపీతో వెళ్తే తమ పని మటాషేనని భయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో దమ్ముంటే పురందేశ్వరి ఏపీలో ఒక్క బీజేపీ ఎంపీని గెల్చుకోండి. ఆ తర్వాత మోడీని కించపరచడం గురించి, తెలుగువారి ఆత్మగౌరవం గురించి మాట్లాడండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -