Friday, April 19, 2024
- Advertisement -

క‌నీసం ఆ ఒక్క రోజైనా రాజ‌కీయాలు ఆపొచ్చు క‌దా…

- Advertisement -

ఆంధ్రప్ర‌దేశ్‌కు న్యాయం జ‌ర‌గాల‌ని ఒక‌రు పోరాడుతుంటే.. మ‌రో ఇద్ద‌రు వారి కాళ్ల‌ను ప‌ట్టుకుని పాతాళంలోనికి లాగుతుంటారు. సొంత రాష్ట్రంలో ఉన్న‌ప్పుడు ఎలాగూ కొట్టుకు చ‌స్తూనే ఉంటారు. రాష్ట్రం దాటి వెళ్లిన‌ప్పుడైనా.. ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల కోసం క‌లిసి పోరాడాల‌నే ఇంగిత జ్ఞానం ఇక్క‌డి వారికి లేదు. ప‌క్క‌నున్న త‌మిళ‌నాడు స‌హా ఏ రాష్ట్రాన్న‌యినా చూడండి.. వారి మ‌ధ్య ఎన్ని గొడ‌వ‌లున్నా.. బ‌య‌ట‌కు వెళ్లేస‌రికి రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ఒక్క‌టైపోతుంటారు. ప్ర‌స్తుతం రాష్ట్రానికి న్యాయం చేయాల‌ని కోరుతూ.. పార్ల‌మెంట్ సాక్షిగా దేశం మొత్తం చూస్తుండ‌గా.. అవిశ్వాస తీర్మానాన్ని ఒక పార్టీ పెట్టింది. దేశ‌వ్యాప్తంగా చాలా పార్టీలు దీనికి మ‌ద్ద‌తు ఇచ్చాయి. మ‌న రాష్ట్రంలో ఉన్న పాతిక ఎంపీ సీట్ల‌లో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ రాజీనామాలు స‌మ‌ర్పించ‌గా.. మిగిలింది 20 మంది కూడా లేరు. అయినా.. అవిశ్వాస తీర్మానానికి 128మంది మ‌ద్ద‌తిచ్చారు. అంటే దేశంలోని చాలా పార్టీలు మ‌న రాష్ట్రం కోసం ముందుకొచ్చి.. వెన్నుద‌న్నుగా నిల‌బ‌డ్డాయి. కానీ.. మ‌న రాష్ట్రంలో ఉన్న జ‌న‌సేన‌, వైఎస్ ఆర్ కాంగ్రెస్ మాత్రం.. ఒక‌వైపు అవిశ్వాసంపై చ‌ర్చ జ‌రుగుతుంటే.. మ‌రోవైపు విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తూ.. కూర్చున్నాయి. వీరి బాధంతా.. ఎక్క‌డ ఈ క్రెడిట్ అంతా అధికార తెలుగుదేశం పార్టీకి వెళ్లిపోతుంద‌నే త‌ప్ప‌.. అస‌లు రాష్ర్ట ప్ర‌యోజ‌నాల కోసం ఇదేమైనా ప‌నికొస్తుంద‌నే క‌నీస ఆలోచ‌న కూడా లేదు.

ఇప్ప‌టివ‌ర‌కూ ఈ కుళ్లు రాజ‌కీయాల‌కు దూరంగా.. స‌రికొత్త వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేస్తాన‌ని చెప్పుకొచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా.. పాచిప‌ట్టిన పార్టీల మాదిరిగానే సోష‌ల్ మీడియాలో ట్వీటుతూ.. తానూ ఓ కుతంత్ర భావ‌జాలవాదినేన‌ని స్ప‌ష్టం చేశాడు. క‌నీసం పార్ల‌మెంట్‌లో అవిశ్వాసంపై చ‌ర్చ జ‌రుగుతున్న ఒక్క రోజైనా.. వీళ్ల కుమ్ములాట‌లు లేకుండా.. ఉంటే.. రాష్ర్టానికి జ‌రిగిన న‌ష్టం అంద‌రిలో ఆలోచ‌న రేకెత్తించేందుకు ఆస్కారం ఉంటుంది. ఇది కేవ‌లం జ‌న‌సేన‌, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీల‌కే కాదు. తెలుగుదేశం పార్టీకీ వ‌ర్తిస్తుంది. గ‌తంలో హోదా వ‌ద్దు.. ప్యాకేజీయే ముద్ద‌న్న చంద్ర‌బాబు.. హోదా కోసం ఉద్య‌మించిన వారిపై ఉక్కుపాదం మోపారు. ఢిల్లీ వెళ్లి దీనిపై పోరాటం చేసేందుకు వైఎస్ ఆర్ కాంగ్రెస్ లాంటి పార్టీలు ప్ర‌య‌త్నిస్తే.. చంద్ర‌బాబు ఇక్క‌డ కూర్చుని.. నీరుగార్చేలా మాట్లాడారు. గ‌తంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెడ‌తామ‌న‌గానే.. మ‌ద్ద‌తు ఇస్తామ‌ని చెప్పిన చంద్ర‌బాబు రాత్రికి రాత్రి వాళ్లు పెట్టేదేంటంటూ.. తానే అవిశ్వాసం పెడ‌తానంటూ పోటీ ప‌డ్డారు. తీరా ఢిల్లీకి వెళ్లిన‌ప్పుడు కూడా ఒకే రాష్ట్రం ఒకే ప్ర‌యోజ‌నం.. కానీ.. ఇద్ద‌రు వేర్వేరుగా అవిశ్వాస తీర్మాన లేఖ‌ల‌ను స్పీక‌ర్‌కు అంద‌జేశారు. అదేంటి.. మీరంతా ఒకే రాష్ట్రంక‌దా.. అంటే వాళ్ల‌తో మాకు సంబంధం లేద‌ని.. ఢిల్లీ న‌డి బ‌జారులో రాష్ర్టం ప‌రువును తీశారు.

ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌రిస్థితి.. మ‌రీ దారుణంగా మారింది. ఢిల్లీలో అవిశ్వాసంపై చ‌ర్చ జ‌రుగుతుంటే.. ఈ ట్విట‌ర్ బాబు.. వ‌రుస ట్వీట్లు వ‌దులుతూ ప్ర‌పంచం మొత్తాన్ని.. పార్ల‌మెంట్‌లో జ‌రిగే అంశం నుంచి డైవ‌ర్ట్ చేయ‌డానికి తెగ ప్ర‌య‌త్నాలు చేశారు. క‌నీసం లోక‌ల్ మీడియాలో మాట్లాడితే.. రాష్ట్రం దాటి ఆ మాట‌లు పోవు. కానీ.. ఈ సారు ట్విట‌ర్ ద్వారా.. ట్వీటుతుండ‌డంతో.. అవి ప్ర‌ధాని మోడీ స‌హా అంద‌రికీ చేరాయి. వీళ్ల‌లో వీళ్ల‌కే స‌ఖ్య‌త లేదు.. ఇంక వీళ్ల‌కు తాను చేసేదేముంటుంద‌న్న‌ట్టుగా మోడీ ప్ర‌వ‌ర్త‌న మార‌డానికీ ఈసారు త‌న వంతు ప్ర‌య‌త్నం చేశారు. రాష్ర్టం కోసం అంద‌రూ క‌లిసిక‌ట్టుగా వెళితే త‌ప్ప‌.. ప్ర‌యోజ‌నాలు నెర‌వేర‌డం క‌ష్టం అనే విష‌యం తెలిసీ.. వీరికి త‌మ పార్టీ ప్ర‌యోజ‌నాలే ముఖ్యం త‌ప్ప‌.. ప్ర‌జ‌ల గురించి ప‌ట్ట‌ద‌ని అర్థ‌మ‌వుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -