Friday, April 19, 2024
- Advertisement -

గంటా మీడియాను ఇలా వాడేశార‌న్న మాట‌..!

- Advertisement -

జ‌న‌సేనానిపై ఏపీ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు ఫైర్ అయ్యారు. అది కూడా మాముల‌గా కాదు.. రాజ‌కీయాలంటే సినిమా కాద‌ని.. సినిమాల్లో స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత… డైరెక్టర్ స్టార్ట్, యాక్షన్ అంటే నటులు నటిస్తారని… రాజకీయాలు అలా కాదు అంటూ చిన్న‌పాటి క్లాస్ ఇచ్చారు. అక్క‌డితో ఆగ‌లేదు… రాజకీయ నేతలు మొదట నాలెడ్జ్ పెంచుకోవాలని… ఎవరో పేపర్ పై ఏదో రాసిస్తే… దాన్ని చూసి మాట్లాడటం మానుకోవాలని సూచించారు. పరిజ్ఞానం, అవగాహన పెంచుకున్న తర్వాత పవన్ కల్యాణ్ మాట్లాడితే బాగుంటుందని స‌ల‌హా ఇచ్చారు. దీంతో అంద‌రికి క్లారిటీ వ‌చ్చేసింది గంటా శ్రీ‌నివాస‌రావుకు జ‌న‌సేన‌లో చేరే ఉద్దేశం లేద‌ని.

ఇదంతా ఓకే.. మొన్న‌టివ‌ర‌కు గంటా రేపో మాపో జ‌న‌సేన‌లోకి వెళ్తార‌ని పుకార్లు షికార్లు చేశాయి. ఇన్ని రోజులు ఎవరూ అడగకపోయినా.. మంత్రి గంటా శ్రీనివాస్ జనసేనలోకి వెళ్లడం లేదంటూ స్టేట్‌మెంట్లు ఇస్తూ వ‌చ్చారు. దీని వెనుక‌ చాలా పెద్ద క‌థే ఉంద‌ని ఓ టాక్ న‌డుస్తోంది. విశాఖ టీడీపీలోకి సబ్బం హరి, కొణతాల రామకృష్ణ, విష్ణుకుమార్ రాజు, దాడి వీరభద్రరావు లాంటి నేతలు రావడానికిరెడీగా ఉన్నార‌ని.. వీరందరూ చంద్రబాబుతో ఇటీవలి కాలంలో ఒకటికి రెండు సార్లు రహస్యంగా సమావేశమయ్యారని వార్త‌లు వ‌చ్చాయి. దీనికి త‌గ్గ‌ట్టుగానే బీజేపీ నేత‌ల చ‌ర్య‌లు కూడా ఉన్నాయి. దాదాపుగా వీరంతా మంత్రి గంటా శ్రీనివాసరావుకు వ్యతిరేక వర్గమే. వీరి వెనుక మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు ఉన్నాడ‌ని.. గంటాకు చెక్ పెట్ట‌డానికే ఈ క‌థంతా న‌డిపిస్తున్నార‌ని వినిపించింది.

స‌రిగ్గా ఈ స‌మ‌యంలోనే మంత్రి గంటా తాను జ‌న‌సేన‌లో చేర‌డం లేద‌నే స్టేట్‌మెంట్లు ఇవ్వ‌డం ప్రారంభించారు. ఇన్‌డైరెక్ట్‌గా చంద్ర‌బాబుకు హెచ్చ‌రించార‌ని చెప్పుకోవ‌చ్చు. మ‌రి తెర వెనుక ఏం జ‌రిగిందో తెలియ‌దు కానీ నేత‌ల చేరిక‌లపై ఇప్పుడు ఊసే లేదు. అంతేకాదు చంద్రబాబు నుంచి ఏం హామీ వ‌చ్చిందో తెలియ‌దు కానీ ఇప్పుడు జ‌న‌సేన ఎపిసోడ్‌పై క్లారిటీ ఇచ్చేశారు.

ఇలా ప‌రోక్షంగా బెద‌రించ‌డం గంటాకు కొత్త విష‌య‌మేమీ కాదు. కొద్ది రోజుల కిందట.. టీడీపీ తరపున భీమిలి టిక్కెట్ లేదని ఆయన సర్వేలో వెనుకబడ్డారని ప్రచారం జరిగినప్పుడు అసంతృప్తికి గురయ్యారు. హైకమాండ్ ప్రోద్భలంతోనే తనకు టిక్కెట్ ఎగ్గొట్టడానికే అలాంటి సర్వేను లగడపాటి పేరుతో ఓ ప‌త్రిక ప్రచురించిందని కాస్త అస‌హ‌నానికి గుర‌య్యారు. అప్పట్లో కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టి తన అసంతృప్తిపై మీడియాకు తెలిసేలా చేశారు. దాంతో.. చంద్రబాబు ఆయనను బుజ్జగించారు. అప్పటికి పరిస్థితి సద్దుమణిగింది. ఇలా ప‌రిస్థితులు త‌న‌కు వ్య‌తిరేకంగా మారిన ప్ర‌తిసారి కొత్త అస్త్రాల‌తో ముందుకు వ‌స్తున్నారు గంటా శ్రీ‌నివాస‌రావు. ఇలా త‌న‌కు స‌మ‌స్య వ‌చ్చిన ప్ర‌తిసారి మీడియాకు లీకులిచ్చి వాడేస్తార‌న్న మాట‌. కానీ రాజ‌కీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జ‌ర‌గొచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -