Friday, April 19, 2024
- Advertisement -

అహంకారానికి కేరాఫ్ అడ్ర‌స్ మీరే క‌దా

- Advertisement -

ఎంపీల‌ సంఖ్యాబ‌లం లేక‌పోయినా.. ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్ట‌డ‌మంటే.. అది వారి అహంకార పూరిత ధోర‌ణికి నిద‌ర్శ‌నం. పూర్తి మెజారిటీతో ఏర్ప‌డిన ప్ర‌భుత్వంపై ఇలా చేయ‌డం వ‌ల్ల వాళ్లు సాధించేదేం ఉండ‌దు. దీనివ‌ల్ల మేం ఎంత బ‌లంగా ఉన్నామో మ‌రోసారి నిరూపిత‌మ‌య్యేందుకనే.. అంటూ మోడీ పార్ల‌మెంట్ సాక్షిగా చెప్పిన మాట‌లు.. దేశ‌మంతా ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాల ద్వారా వీక్షించింది. మోడీ ఈ మాట‌ల‌ను చెప్పిన తీరు చూస్తే.. ఇంత‌కంటే అహంకార పూరిత‌మైన ధోర‌ణి మ‌రొక‌టి ఉండ‌ద‌నేది స్ప‌ష్టంగా క‌నిపించింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు మీరు ఏమీ ఇవ్వ‌లేద‌నే విష‌యంపై మాట్లాడాల్సిన మోడీ.. వాటిని ప‌క్క‌న పెట్టి.. మ‌ళ్లీ కాంగ్రెస్ త‌లుపులేసి విభ‌జించింది.. మాకు 14 వ ఆర్థిక సంఘం అడ్డుప‌డ‌డంతో ఏం చేయ‌లేక‌పోయామంటూ.. మొస‌లి క‌న్నీరు కార్చారు. పైగా.. ప్యాకేజీ ప్ర‌క‌టించామని, దానిని సీఎం చంద్ర‌బాబు ఆహ్వానించి.. కేంద్ర ఆర్థిక మంత్రికి కృత‌జ్ఞ‌త‌లు చెప్పారంటూ ఆ పాత విష‌యాన్ని గుర్తు చేశారు. ఇది ఖ‌చ్చితంగా అంద‌రికీ గుర్తుంది.. కానీ.. ప్యాకేజీ ప్ర‌క‌టించిన త‌ర్వాత‌.. న‌యా పైసా కూడా ఇవ్వ‌కుండా క‌క్ష సాధిస్తుంటే.. ఇవ్వ‌లేదు అని ప్ర‌శ్నించ‌కుండా.. మోడీజీ మీరు చేసింది బాగుందంటూ కితాబిస్తారా.. ?
మోడీ త‌న ప్ర‌సంగంలో ఎంత వ్యంగ్యంగా.. ఎంత అహంకార పూరితంగా వ్య‌వ‌హ‌రించారంటే.. ప‌క్క‌నున్న తెలంగాణ అధికార తెరాస పార్టీ చాలా ప‌రిణ‌తితో విభ‌జ‌న హామీల అమ‌లు విష‌యంలో వ్య‌వ‌హ‌రించిందంట‌.. కేవ‌లం ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాత్ర‌మే ప్ర‌తి విష‌యానికీ పోట్లాట‌కు దిగ‌డంతో తాను స‌ర్ధి చెప్పానంటూ.. మోడీ.. ఆంధ్రుల గుండెల‌ను ఏకంగా గున‌పంతో పొడిచినంత దారుణంగా అవ‌మానించారు. విభ‌జ‌న వ‌ల్ల న‌ష్ట‌పోయింది.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌. రాజ‌ధాని కూడా లేకుండా.. త‌ల‌లేని మొండెంలా దిక్కులేని ప‌రిస్థితుల్లోనికి నెట్టేయ‌బ‌డింది ఆంధ్రులే. రెండు రాష్ట్రాల రాజ‌ధానిని తెలంగాణ‌కు క‌ట్ట‌బెట్టారు. దానిపై వ‌చ్చే ఆదాయంతోనే మొత్తం ఆంధ్రప్ర‌దేశ్ బ‌తికేది. దానిని గంప‌గుత్త‌గా ప‌ది జిల్లాల తెలంగాణ‌కు క‌ట్ట‌బెట్టారు. అలాంట‌ప్పుడు కోపం వారి కెందుకొస్తుంది. పైగా.. ప్ర‌తి విష‌యానికీ గొడ‌వ ప‌డుతుంటే.. మీరు ఆర్చారా.. తీర్చారా. రెండు రాష్ట్రాల‌కు ఉమ్మ‌డి ఆస్తులుగా ఉన్న వంద సంస్థ‌ల జాబితాను విభ‌జ‌న చ‌ట్టం పదిలో చేర్చారు. వాటిని కేంద్ర‌మే స‌మానంగా పంచాల్సి ఉంది. కానీ.. ఒక్క‌టి కూడా పంచారా. ఆర్టీసీ ఆస్తుల నుంచి.. పురావ‌స్తు శాఖ విగ్ర‌హాల వ‌ర‌కూ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన‌వి హైద‌ర‌బాద్‌లోనే ఉన్నాయి. వాట‌న్నింటినీ బ‌ల‌వంతంగా తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకుంది. మీరు చోద్యం చూస్తూ.. చేద్దాం.. చూద్దాం.. గొడ‌వ ప‌డొద్దంటూ ఆంధ్ర‌ను న‌ట్టేట ముంచారు. మీరే స‌క్ర‌మంగా.. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌ను ప‌క్క‌న పెట్టి వ్య‌వ‌హ‌రించి ఉంటే.. ఆంధ్రుల‌కు ఎందుకీ దుర్గ‌తి ప‌ట్టేదో.. మీ ప్ర‌సంగంలో చెప్పి ఉంటే బాగుండేది. మీకు ప్ర‌స్తుత మిత్రుడు కేసీఆర్‌.. ఆయ‌న కొద్ది నెల‌ల కింద‌ట హైద‌రాబాద్ సాక్షిగా మిమ్మ‌ల్ని ఎంత దారుణంగా తిట్టారో.. ప్ర‌పంచ మంతా చూసింది. కానీ.. ఆయ‌న ప‌రిణ‌తిని మీరిప్పుడు పొగుడుతున్నారు. ఆంధ్ర సీఎం 29సార్లు ఢిల్లీకి వ‌స్తే.. వ‌ట్టి చేతుల‌తో తిప్పిపంపారు. ఇంత‌కంటే ఓ రాష్ట్రానికి చేయాల్సిన ద్రోహం ఏముంటుంది. ఓ రాష్ట్ర‌ ముఖ్య‌మంత్రి అంటే.. ఎవ‌రైనా కావొచ్చు.. ఆయ‌న ఆ రాష్ట్ర‌ప్ర‌జ‌లంద‌రి ప్ర‌తినిధి అనే విష‌యం మ‌ర‌చిపోయి.. వ్య‌క్తి గ‌త క‌క్ష‌ల‌తో ప్ర‌ధాని హోదాలో ఉండి మీరు నిధులివ్వ‌కుండా వేధించ‌డం ఎంత‌వ‌ర‌కూ స‌బ‌బు.

ఇంకా పాడిందే పాడ‌రా.. అన్న‌ట్టుగా కాంగ్రెస్ త‌లుపులు మూసి విభ‌జించింది.. అంటూ అదే పాట పాడుతూ.. మీ నిజ‌మైన బుద్ధి ఏంట‌నేది మ‌రోసారి ఆంధ్రుల‌కు చూపించారు. మ‌ళ్లీ తెలుగు త‌ల్లి అంటే నాకు గౌర‌వ‌మంటూ మీ మ‌డిక‌ట్టు ప‌ద‌జాలంతో.. తిమ్మిని బ‌మ్మిని చేసే కుయోక్తుల‌తో ఆంధ్రుల ఆత్మ‌గౌర‌వాన్నే మీరు దొబ్బ‌కొట్టారు. తెలుగుదేశం స‌హా విప‌క్షాలు మీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను మీ క‌ళ్లెదుటే ఎండ‌గ‌డుతుంటే.. మీరు ఎంత ఇబ్బందిగా ఫీల‌య్యారో.. మేం ప్ర‌త్య‌క్షంగా చూశాం. మీ ప్ర‌భుత్వంపై అవిశ్వాసం పెట్టిందే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న హామీల కోస‌మైతే.. మీరు మాత్రం గంట‌న్న‌ర ప్ర‌సంగంలో కేవ‌లం ఏడు నిమిషాలు ఆంధ్ర గురించి మాట్లాడారు. మిగ‌తా గంటా 23నిమిషాలూ.. మీ అక్క‌సు వెళ్ల‌గ‌క్కేందుకే కేటాయించారు. ప్ర‌తిప‌క్షాల‌ను అణ‌గ‌దొక్కాల‌ని మీలో ఎంత క‌సి ఉందో.. మీ చేష్ట‌లు, మాటల ద్వారా మ‌రోసారి పార్ల‌మెంట్ సాక్షిగా బ‌య‌ట‌పెట్టారు. మీరు స‌ముద్రాల మ‌ధ్య‌లో పెట్టే విగ్ర‌హాల ఖ‌ర్చుకంటే అత్యంత త‌క్కువ‌గా ఓ రాష్ట్ర నిర్మాణానికి కేటాయించార‌నే విష‌యం ఇప్పుడు చెల్లిపోవ‌చ్చు.. కానీ.. చ‌రిత్ర‌లో మాత్రం సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించ‌బ‌డుతుంద‌నేది వాస్త‌వం.. మోడీజీ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -