Saturday, April 20, 2024
- Advertisement -

బాబూ క‌ప‌ట రాజ‌కీయాల‌కు కాలం చెల్లింది.

- Advertisement -

టీడీపీ అధినేత, ప్ర‌తిప‌క్ష‌నాయ‌కుడు చంద్ర‌బాబునాయుడు చేస్తున్న క‌ప‌ట‌ రాజ‌కీయాల‌కు కాలం చెల్లింద‌ని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి, చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని గారు స్ప‌ష్టంచేశారు. స్థానిక త‌న కార్యాల‌యంలో ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని గారు శుక్ర‌వారం విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కె.అచ్చ‌న్నాయుడు అధికారాన్ని అడ్డంపెట్టుకుని టీడీపీ హయాంలో అడ్డ‌గోలు అవ‌నీతికి పాల్ప‌డ్డార‌ని తెలిపారు. దాదాపు రూ.150 కోట్ల కుంభ‌కోణానికి పాల్ప‌డ్డ‌ట్టు ఏసీబీ అధికారుల వ‌ద్ద అన్ని సాక్షాధారాలు ఉన్నాయ‌ని చెప్పారు. విచ్చ‌ల‌విడి అవినీతికి పాల్ప‌డ్డ‌వారిని అరెస్టు చేయ‌క స‌త్క‌రిస్తారా..? అని ప్ర‌శ్నించారు. మోసం చేసిన అచ్చెన్నాయుడును చ‌ట్టం ప్ర‌కారం అరెస్టు చేస్తే.. ఇదేదో బీసీల‌ను అణ‌గ‌దొక్కే చ‌ర్య‌గా, బీసీల‌కు ద్రోహం చేస్తున్న‌ట్లుగా చంద్రబాబునాయుడు, ఆయ‌న కుమారుడు లోకేష్‌, ఆ పార్టీ నాయ‌కులంతా కులం రంగుపుల‌మాల‌ని తెగ తాప‌త్ర‌య‌ప‌డుతున్నార‌ని ఎద్దేవా చేశారు.

బీసీల‌కు చేసిన అన్యాయం గుర్తులేదా..?

ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్ర‌బాబూ.. మీరు బీసీల‌కు చేసిన అన్యాయాన్ని అప్పుడే మ‌రిచిపోయారా.. అంటూ సూటిగా ప్ర‌శ్నించారు. బీసీ స‌బ్‌ప్లాన్ కింద ఏడాదికి రూ.10వేల కోట్లు చొప్పున ఐదేళ్ల‌కు క‌లిపి రూ.50వేల కోట్లు ఇస్తాన‌ని టీడీపీ హామీ ఇచ్చింద‌ని, తీరా చూస్తే ఐదేళ్ల‌కు క‌లిపి చంద్ర‌బాబునాయుడు రూ.13వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. నాయిబ్రాహ్మ‌ణుల‌ను తోక క‌త్తిరిస్తాన‌ని, మ‌త్స్య‌కారుల‌ను తోలు తీస్తాన‌ని దుర్భాష‌లాడి, బీసీల‌ను ఘోరంగా అవ‌మానించిన నీచ చ‌రిత్ర చంద్ర‌బాబునాయుడిదంటూ నిప్పులు చెరిగారు. బీసీలకు రాజ్యాధికారాన్ని రాజ్యాంగం క‌ల్పిస్తే జ‌న్మ‌భూమి క‌మిటీల ద్వారా వారి హ‌క్కుల‌ను దారుణంగా కాల‌రాసిన నీచ చ‌రిత్ర టీడీపీద‌ని ధ్వ‌జ‌మెత్తారు. కాపుల‌ను బీసీల్లో చేర్చుతామంటూ ఆ రెండు వ‌ర్గాల వ‌ర్గాల మ‌ధ్య చిచ్చుపెట్టి త‌మాషా చూసిన దారుణ చ‌రిత్ర‌ను అప్పుడే ప్ర‌జ‌లు ఎలా మ‌రిచిపోతార‌ని ప్ర‌శ్నించారు. బీసీల‌ను ఆర్థికంగా, రాజ‌కీయంగా అణ‌గదొక్కి ఇప్పుడు బీసీల‌పై వ‌ల్ల‌మాలిన ప్రేమ‌ను బాబు, ఆయ‌న వందిమాగ‌ధులు ఒల‌క‌బోస్తుంటే అత్యంత హాస్యాస్పందంగా ఉంద‌ని మండిప‌డ్డారు.

బీసీల‌కు చేయూత‌నిచ్చి ఆదుకుంటున్న‌ది మేమే

బీసీల‌కు అన్ని విధాలా చేయూత‌నిచ్చి ఆదుకుంటున్న‌ది త‌మ ప్ర‌భుత్వ‌మేన‌ని ఎమ్మెల్యే గారు స్ప‌ష్టంచేశారు. త‌మ‌ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గారికి బీసీల క‌ష్టాలు బాగా తెలుస‌ని చెప్పారు. కాబ‌ట్టే తాము అధికారంలోకి వ‌చ్చిన ఏడాది కాలంలో 50 శాతానికి పైగా బీసీ ప్ర‌జ‌ల సంక్షేమానికే నిధులు ఖ‌ర్చుచేశామ‌న్నారు. రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న సంక్షేమ‌ప‌థ‌కాల కోసం ఒక్క ఏడాదిలోనే తాము రూ.40వేల కోట్లు ఖ‌ర్చుచేశామ‌ని, 3.58 కోట్ల మంది ల‌బ్ధి పొందార‌ని తెలిపారు. వీరిలో 50శాతం దాదాపు 1.72 కోట్ల మంది బీసీలే ఉన్నార‌ని, వారి సంక్షేమానికి త‌మ ప్ర‌భుత్వం ఖ‌ర్చుచేసిన మొత్తం అక్ష‌రాలా రూ.20వేల కోట్ల‌ని వెల్ల‌డించారు. బీసీల అభ్యున్న‌తికి ఈ స్థాయిలో, ఎవ‌రూ వేలు చూప‌ని విధంగా తాము చిత్త‌శుద్ధితో కృషి చేస్తున్నామ‌ని స్ప‌ష్టంచేశారు. జ‌గ‌న‌న్న చేదోడు కింద రెండు రోజుల కింద‌టే బీసీ సోద‌రుల కోసం రూ.200 కోట్లు ఖ‌ర్చుచేసిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తుచేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు. వ‌చ్చే ఆగ‌స్టు 12న 45 ఏళ్లు నిండిన‌ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మ‌హిళ‌ల‌కు ఒక్కొక‌రికి రూ.18500 ఆర్థిక సాయం అంద‌జేయ‌బోతున్నామ‌న్నారు. ఐదేళ్ల‌కు క‌లిపి ఒక్కో మ‌హిళ‌కు రూ.75వేల సాయం చేసేలా ముందుకు వెళెతున్నామ‌ని చెప్పారు. బీసీల‌కు నామినేష‌న్ ప‌ద‌వులు, కాంట్రాక్ట్ ప‌నుల్లోనూ రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించామ‌ని చెప్పారు. ఈ నెల 19న త‌మ పార్టీ త‌ర‌ఫున న‌లుగురికి రాజ్య‌స‌భ‌లు ఎన్నిక అయ్య అవ‌కాశం ఉంటే.. వారిలో ఇద్ద‌రికి బీసీల‌కే ఆ ప‌ద‌వులు క‌ట్ట‌బెట్ట‌బోతున్న గొప్ప చ‌రిత్ర త‌మ‌ద‌ని స్ప‌ష్టంచేశారు. కేబినెట్‌లో 7గురు మంత్రులు బీసీలేన‌ని, ఒక బీసీ ప్ర‌జాప్ర‌తినిధి ఈ రాష్ట్రానికి ఉప‌ముఖ్య‌మంత్రిగా ఉన్నార‌ని, ఇవ‌న్నీ బీసీల‌కు తాము ఇస్తున్న గౌర‌వం, ప్రాధాన్యాల‌కు ఉదాహ‌ర‌ణ‌లేన‌ని చెప్పారు.

క‌ప‌ట రాజ‌కీయాలు క‌ట్టిపెట్టండి

ఒక అవినీతి ప‌రుడిని అదుపులోకి తీసుకుంటే అదేదో బీసీల‌పై దాడి అన్న‌ట్లుగా టీడీపీ నాయ‌కులు గ‌గ్గోలు పెడుతుండ‌టం వారి కుటిల రాజ‌కీయాల‌కు అద్దంప‌డుతోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. త‌ప్పుచేసిన‌వారు ఎవ‌రైనా స‌రే చ‌ట్ట‌ప్ర‌కారం శిక్షార్హులేన‌ని తెలిపారు. కులం పేరుతో అవినీతి ప‌రుల‌ను కాపాడే హ‌క్కు ఎవ‌రికీ లేద‌ని స్ప‌ష్టంచేశారు. ఇప్ప‌టికైనా టీడీపీ క‌టిల రాజ‌కీయాలు మానుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు. టీడీపీని బీసీలు న‌మ్మే ప‌రిస్థితి లేద‌ని, త‌మ‌కు దూర‌మైన బీసీల‌ను ఎలాగైనా మ‌ళ్లీ ద‌గ్గ‌రికి చేర్చుకోవాల‌నే ఉద్దేశంతో కుటిల రాజ‌కీయాల‌కు ఆపార్టీ పెద్ద‌లు పాల్ప‌డుతుండ‌టం దారుణ‌మ‌న్నారు. కార్య‌క్ర‌మంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు పాల్గొన్నారు.

-Ramesh Reddy Chilakala

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -