Wednesday, April 17, 2024
- Advertisement -

2 రాష్ట్రాల్లో బీజేపీ ఓటమికి విచిత్ర కారణం..

- Advertisement -

మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఓడిపోవడానికి వినిపిస్తున్న కారణాల్లో ఓ కారణం కాస్త ఆలోచనాత్మకంగా ఉంది. దేశ రాజకీయాల్లో వయసు మీద పడుతున్న రాజకీయ నేతలు ఇక పోలటిక్స్ నుంచి రిటైర్ అవ్వాల్సిన సమయం వచ్చేసిందనే వాదన వినిపిస్తోంది. కొత్త తరానికి కొత్త నాయకత్వం ఉండాలని దేశం కోరుతోందనే సంకేతాలు మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ నుంచి వస్తున్న ఓ వార్త స్పష్టం చేస్తోంది. ఆ రాష్ట్రాల గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేశారు. 75 సంవత్సరాల ఆమె వయోభారంతో గుజరాత్ సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నట్లు 2016 ఆగస్టు 1వ తేదీన ఫేస్ బుక్ ద్వారా ప్రకటించారు. కేవలం వయసు మీద పడిన కారణంగా ఆనందీ బెన్ పటేల్ గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆ ప్రకటనలో తెలిపారు. అందుకే ఆమె ఆ పదవి నుంచి తప్పుకుంటున్నారని, పని ఒత్తిడి నుంచి ఉపశమనం కోరుకుంటున్నట్లు బీజేపీ నాడు ప్రకటించింది.

అయితే అదే సమయంలో ఆనందీ బెన్ పటేల్ ను ఏదైనా రాష్ట్రానికి గవర్నర్ గా పంపే అవకాశముందని వార్తలు వచ్చాయి. కానీ వయోభారంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఆమెను గవర్నర్ గా నియమిస్తే దేశవ్యాప్తంగా విమర్శలు వస్తాయని బీజేపీ భావించింది. కొన్నాళ్లు చడీచప్పుడు లేకుండా సైలెంటుగా ఉండిపోయింది. తర్వాత సీన్ కట్ చేస్తే 77 ఏళ్ల ఆనందీ బెన్ పటేల్ ను ఈ ఏడాది జనవరిలో మధ్యప్రదేశ్ గవర్నర్ గా బీజేపీ నియమించింది. తర్వాత ఇదే ఏడాది ఆగస్టులో ఛత్తీస్ గఢ్ రాష్ట్ర గవర్నర్ గానూ ఆమెకు బాధ్యతలు అప్పగించింది. ఆ రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మోడీ, అమిత్ షా తమ రాష్ట్రం, తమ పార్టీకి చెందిన వ్యక్తికి గవర్నర్ బాధ్యతలు కట్టబెట్టారు. ఎన్నికల తర్వాత మెజార్టీ అటూ ఇటుగా వస్తే తమ చెప్పుచేతల్లో ఉండే గవర్నర్ ద్వారా మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో రాజకీయాలు చేయవచ్చనే ఆమెను గవర్నర్ గా నియమిస్తున్నారని అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి.

అయితే తాజాగా ఆ రెండు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలైంది. అందుకు అనేక కారణాలు ఉండవచ్చు. కానీ 75 ఏళ్ల వయసులో వయోభారం కారణంగా గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఆనందీబెన్ పటేల్ ను 77 ఏళ్ల వయసులో మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలకు గవర్నర్ గా నియమించడంపై ఆ రెండు రాష్ట్రాల్లో పెద్ద చర్చే నడిచింది. సోషల్ మీడియా వేదికగా ఈ చర్చ మరింత ఉద్ధృతమైంది. 75 ఏళ్ల వయసులో గుజరాత్ సీఎంగా పనిచేయలేని వ్యక్తి, 77 ఏళ్ల వయసులో రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా ఎలా పని చేయగలరని నెటిజన్లు ప్రశ్నించారు. మోడీ సొంత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయలేనన్న వ్యక్తిని తమ రాష్ట్రాలకు గవర్నర్ గా ఎలా పంపారని నిలదీశారు. బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటివి చేస్తే, తమ తీర్పు ఇలాగే ఉంటుందని, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ప్రజలు సోషల్ మీడియా వేదికగా తేల్చి చెబుతున్నారు. అందుకే తమ రెండు రాష్ట్రాల్లో బీజేపీని ఓడించామని తమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -