Friday, April 19, 2024
- Advertisement -

ఏపీ రాజధానిలో అసలేం జరుగుతోంది ?

- Advertisement -
విజయవాడలో బుధవారం అర్ధరాత్ర కలకలం రేగింది. భవానీపురంలోని ఆలీవ్ ట్రీ హోటల్లో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారన్న సమాచారంతో  పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 55 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో 50 మంది మగవాళ్లు, ఐదుగురు మహిళలు ఉన్నారు. అదుపులోకి తీసుకున్నవారిలో ఐదుగురు మహిళలను వాసవ్య మహిళ మండలికి అప్పగించారు. మిగిలిన వారిలో 10 మందిని వన్ టౌన్, 15 మందిని భవానీపురం, 10 మందిని ఇబ్రహీం పట్నం, 10మందిని గవర్నర్ పేట పోలీస్ స్టేషన్లకు తరలించారు. మరో ఐదుగురు ఈవెంట్ యాంకర్లతో పాటు విజయవాడకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే కుటుంబీకుడిని  పోలీసులు తప్పించారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఈ  దాడుల్లో కండోమ్ పేకెట్లు, మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, భీమవరంతో పాటు విజయవాడకు చెందిన పలువురు ఈవెంట్ యాంకర్లను, మహిళలను తీసుకువచ్చి, ప్రతి నెలా అసభ్యనృత్యాలు చేయిస్తుంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
 
అయితే ఆ మధ్య ఆర్టీఓ అధికారిపై దాడి చేశారన్న ఆరోపణలు మరిచిపోకముందే ఈ అశ్లీల నృత్యాల వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చిక్కుకున్నారు. అలీవ్ ట్రీ హోటల్  ఆయనదే అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఆ ఆరోపణలను బోండా ఉమామహేశ్వరరావు ఖండిస్తున్నారు. తనకు హోటల్ కు సంబంధం లేదని చెబుతున్నారు. హోటల్ ఆయనదే కానీ ప్రస్తుతానికి అద్దెకు ఇచ్చేశారని, రెంటుకు తీసుకున్న వారు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో బోండాకు తెలియదని, ఇప్పుడు అసభ్య నృత్యాల నిర్వహణ సంగతి హోటల్ నిర్వాహకులను అడగాలని, తమ నాయకుడు బోండాపై బురద జల్లవద్దని ఆయన అనుచరులు చెప్పుకొస్తున్నారు. అద్దెకు తీసుకున్నవారు చేసే అసాంఘిక కార్యకలాపాలకు, హోటల్ ఓనర్ కు లింకు పెట్టడం దారుణమని మండిపడుతున్నారు.
 
విజయవాడలో ఏ అసాంఘిక కార్యక్రమం, అకృత్యం జరిగినా స్థానిక ప్రజాప్రతినిధుల పేర్లు వినిపిస్తుండటం పరిపాటిగా మారింది. గతంలో  కల్తీ మద్యం తాగి పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఆ కేసులో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేరు ప్రధానంగా వినిపించింది. ఆయనకు చెందిన షాపుల్లోనే కల్తీ మద్యం తాగి చనిపోయారనే ఆరోపణలు తీవ్రంగా వినిపించాయి. ఆ కేసు నుంచి బయటపడటానికే ఆయన అధికార పార్టీ నేతలతో చేతులు కలిపారని ఆ తర్వాత విమర్శలు వచ్చాయి. మరో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కాల్ మనీ సెక్స్ రాకెట్ లో ఉన్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపిస్తున్నారు. అధిక వడ్డీలకు అప్పులిచ్చి, అవి తీర్చలేని మహిళలను వ్యభిచార కూపంలోకి దించే నీచ సంస్కృతి బోడె ప్రసాద్ కు ఉందని రోజా ఇప్పటికీ తీవ్రంగా మండిపడుతున్నారు. ఇక ఆర్టీఐ అధికారులపై కేశినేని ట్రావెల్స్ యజమాని టీడీపీ ఎంపీ కేశినేని నాని, అనుచరులతో సహా దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కేశినేని ట్రావెల్స్ నడుపుతున్నారని, అనుమతులు ఇవ్వబోమని చెప్పినందుకే తమపై దాడులకు తెగబడ్డారని ఆర్టీఐ ఉద్యోగులు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. చివరికి బాబు జోక్యం చేసుకుని నానీతో ఆర్టీఐ అధికారికి క్షమాపణ చెప్పించారు. దీంతో ఆ గొడవ సద్దుమణిగింది. మొత్తానికి ఇలా ఏ అకృత్యం జరిగినా దాని వెనుక ఎవరో ఒక ప్రజాప్రతినిధి పేరు వినిపిస్తోంది. అందుకే అసలు ఏపీ రాజధానిలో ఏం జరుగుతోంది ? అనే ప్రశ్న తలెత్తుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -