Thursday, March 28, 2024
- Advertisement -

యామిని సాధినేని దారెటు..?

- Advertisement -

సాధినేని యామిని.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సుపరిచితమమైన పేరు. తెలుగుదేశం పార్టీలో వేగంగా ఎదిగి అంతే వేగంగా ఆ పార్టీని వీడిన ఈ మహిళా నేత ప్రస్తుతం బీజేపీ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోవడంతో కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఆమె హఠాత్తుగా తెర మీదకు వచ్చారు. టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించి మరోసారి వార్తల్లో నిలిచారు. ఎన్నికల తర్వాత రియలైజ్‌ అయ్యానని అందుకే టీడీపీకి గుడ్‌బై చెప్పినట్టు వెల్లడించారు. ప్రాంతీయ పార్టీల్లో వారసత్వ రాజకీయాలు, బంధుప్రీతి పెచ్చుమీరాయని అందుకే జాతీయ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.

అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యే టిక్కెట్‌ ఆశించి భంగపడ్డ యామిని ఎన్నికల ఫలితాల తర్వాత కనుమరగయ్యారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె అక్కడ కూడా పెద్దగా కనిపించలేదు. ఊహించని విధంగా టీడీపీ ఘోర పరాజయం పాలవడంతో కొన్నాళ్ల పాటు మిన్నకుండిపోయారు. టీడీపీలో ఉంటే తనకు భవిష్యత్‌ ఉండబోదన్న ఆలోచనతో ఆ పార్టీని వీడి బీజేపీ చేరేందుకు రెడీ అయ్యారు. టీడీపీలో తన టాలెంట్‌కు తగిన గుర్తింపు దక్కలేదన్న అసంతృప్తికి తోడు, తన ఎదుగుదలకు సీనియర్‌ నాయకులు అడుగడుగునా అడ్డుపడుతుడటంతో విసిగిపోయి టీడీపీకి గుడ్‌బై చెప్పినట్టు ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రత్యర్థులు ప్రయత్నించినప్పుడు టీడీపీ అగ్రనాయకత్వం అండగా నిలబడకపోవడంతో యామిని ఆవేదనకు లోనయ్యారు. చంద్రబాబు తర్వాత పార్టీని నడిపించే సత్తా లోకేశ్‌ లేదన్న ముందుచూపుతో ఆమె టీడీపీని వీడినట్టు కనబడుతోంది.

టీడీపీకి రాజీనామా చేసి చాలా రోజులు గడుస్తున్నా యామిని ఇంకా బీజేపీలో చేరకపోవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. గత వారం రోజులుగా టీవీ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చి తాను బీజేపీలో చేరుతున్నట్టు ఆమె ఊదరగడుతున్నారు. అయితే బీజేపీ నాయకులు మాత్రం ఎటువంటి ప్రకటనలు చేయలేదు. టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత బీజేపీలో చేరడానికి యామిని ఇంతకాలం ఎందుకు వేచిఉన్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఆమె కోరిన పదవికి బీజేపీ సిద్ధంగా లేదా, మరేదైనా కారణం ఉందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. టీడీపీలో చేరేందుకు తన భర్త కులం పేరు వాడుకున్న ఆమె కాషాయ పార్టీలో పాగా వేసేందుకు తన బ్రాహ్మణ కార్డ్‌ బయటకు తీసిన​ట్టు మీడియాలో ప్రచారం జరుగుతోంది. వైసీపీలో చేరేందుకు కూడా ఆమె ప్రయత్నించినట్టు ఒకదశలో ఊహాగానాలు విన్పించాయి.

అయితే ఇదంతా తనంటే గిట్టనివారు చేస్తున్న ప్రచారమని, ఎటువంటి పదవులు ఆశించకుండానే బీజేపీలో చేరతానని యామిని అంటున్నారు. ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, ఎన్ని అవమానాలు ఎదురైనా పాలిటిక్స్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. అయితే బీజేపీలో ఎప్పుడు చేరేది ఆమె వెల్లడించలేదు. బీజేపీలో యామిని పాత్ర ఏంటనేది పార్టీలో చేరిన తర్వాతే స్పష్టత వస్తుంది.

చంద్రబాబుపై ప్రత్యర్థుల మాటల దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టిన యామిని నిష్ర్కమణ టీడీపీకి కచ్చితంగా నష్టం కలిగించేదే. టీడీపీలో బలంగా గళం వినిపించగల మహిళా నేతలు ఇప్పుడు లేరు. నన్నపనేని రాజకుమారి వయోభారం కారణంగా ఇదివరకంత గట్టిగా స్పందించలేకపోతున్నారు.

యామిని లాంటి చురుకైన మహిళా నేతను తయారుచేసుకోవడానికి టీడీపీ ఎంత సమయం పడుతుందన్నది ఇప్పుడే చెప్పలేం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -