Friday, March 29, 2024
- Advertisement -

అయ్యబాబోయ్…… బాబు సొంత డబ్బా….. మెట్రో, ఇవాంక విజిట్, జీఈఎస్ మీట్ కూడా తన ప్రతిభేనట

- Advertisement -

ఇవాంక హైదరాబాద్ రావడం వెనకాల ఎవరి కృషి ఉంది? జీఈఎస్ మీట్ ఎవరి ప్రతిభ? హైదరాబాద్ మెట్రో వెనకాల ఎవరున్నారో తెలుసా? ఇంకెవరు మన బాబుగోరే. అలా అని ఎవరు చెప్పారు అని అడుగుతారా? గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎల్లో మీడియా, వంది మాగధుల భజనతో శాటిస్‌ఫై అయ్యేవారు బాబుగారు. కానీ 2014లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచీ మాత్రం భజన బృందం భజన బాబుగోరికి సరిపోవడం లేదనిపిస్తోంది. తనను మెప్పించే స్థాయిలో ఎవ్వరూ భజన చేసేవాళ్ళు దొరకడం లేదట. అందుకే ఎవరో వస్తారని…..ఏదో చేస్తారని ….ఎదురు చూడడం ఎందుకు అని తన భజన తానే చేసుకోవడం మొదలెట్టాడు. అదేంటి ఎవరి గొప్ప గురించి వాళ్ళే చెప్పుకోవడం పిచ్చ కామెడీగా ఉంటుంది కదా అంటారా? ఆ మాటా నిజమే అనుకోండి. కానీ బాబుగారిని మెప్పించే స్థాయి భజన పరుడు దొరకడం లేదాయే. ఏమాటకామాటే చెప్పుకోవాలి. బాబుగారు తన భజన తానే చేసుకున్న స్థాయిలో ఇంకెవరైనా భజన చేయగలరా? సత్య నాదెళ్ళ విజయం వెనకాల బాబుగారి కృషి ఉంది అని నిస్సిగ్గుగా చెప్పగలరా? పివి సింధు విజయంలో చంద్రబాబు పనితనం కూడా ఉందని చెప్పే ధైర్యం చేయగలరా? హిల్లరీ క్లింటన్‌కి గెలవడం ఖాయం అన్నదశలో ఆమె విజయం వెనకాల కూడా నేనే అన్న ప్రయత్నం చేశారు బాబుగారు. అన్యాపదేశంగా ట్రంప్‌ని ఆడిపోసుకున్నాడు. అయితే ఆయన అంచనాలు తల్లక్రిందులై ట్రంప్ ఘన విజయం సాధించాడు. ఆ దెబ్బతో బాబుకు పొగుడుకునే అవకాశం లేకుండా పోయింది. ఇక నోట్ల రద్దు వెనకాల, జీఎస్టీ నిర్ణయం వెనకాల కూడా బాబుగారే ఉన్నారని కూడా చెప్పారనుకోండి. ఇప్పుడు చెప్పండి అంతర్జాతీయ రాజకీయాల నుంచి స్పోర్ట్స్, సాఫ్ట్‌వేర్ ….ఇలా అన్నిరంగాల్లోనూ అన్ని విజయాల వెనకా బాబుగారే ఉన్నారని పొగడాలంటే ఎవరికైనా తరమా. అసలు ఆ స్థాయిలో భజన చేసుకోవచ్చన్న ఆలోచనలు ఇతరులకు వస్తాయా? అది కూడా సోషల్ మీడియాలో నవ్వుల పాలు అవుతున్నా సరే అంతే గొప్పగా గొప్పలు చెప్పుకోవాలంటే మామూలు మనుషులకు సాధ్యమా?

రాష్ట్ర విభజన విషయంలోనే తికమకగా, మకతికగా ఎవ్వరికీ అర్థం కాకుండా మాట్లాడడం నేర్చుకున్నాడు బాబుగారు. ఇక ప్రత్యేక హోదా విషయంలో కూడా సేం టు సేం స్టైల్. అలాగే ఇప్పుడు కూడా అలానే మాట్లాడాడు. ఆయన మాటలు ఎలా ఉన్నా ఆయన మాటల్లో జనాలకు అర్థమయ్యేలా చెయ్యాలనుకున్న విషయం మాత్రం ఇది. హైదరాబాద్‌కి ఇవాంకా విజిట్ వెనక బాబుగారు, జీఈఎస్ సమ్మిట్ బాబుగారి పుణ్యం… ఇక హైదరాబాద్‌ మెట్రో వెనకాల బాబు కృషి ఉంది. అఫ్కోర్స్ వైఎస్సార్ అడ్డుకున్నాడు, ఆలస్యం చేశాడు అని కూడా చెప్పుకొచ్చాడనుకోండి. ఆయన గొప్పలు ఆయనే చెప్పుకోవడం ఎలా ఉన్నా సోషల్ మీడియా జనాలు మాత్రం కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు.

హైదరాబాద్ మెట్రో నిర్మాణానికి శ్రీధరన్‌తో మాట్లాడా అన్న బాబుగారు విజయవాడ మెట్రో విషయంలో అదే శ్రీధరన్‌ని ఎందుకు ఒప్పించలేకపోయారు? కొన్ని చర్చల తర్వాత బాబుగారితో పడలేక…ఆ విషయం బహిరంగంగా చెప్పి మరీ శ్రీధరన్ ఎందుకు వెళ్ళిపోయాడు. ఇక మెట్రోకు అనుమతులు తీసుకురావడం, నిర్మాణ వ్యవహారాలన్నీ కూడా వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రారంభమయ్యాయని అధికారిక రికార్డులు చెప్తున్నాయి. మరి బాబుగారు చేసిన కృషి అధికారిక రికార్డుల్లో ఎందుకు నమోదవలేదు. వైఎస్సార్ హయాంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్, అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరిగిందన్న విషయం అధికారికంగా ఉంది. మరి చంద్రబాబు కూడా అలాంటి అధికారిక రికార్డులు చూపించగలరా? అలా అడిగిన వాళ్ళందరూ బాబుగారి దృష్టిలో అవినీతి నిరోధకులవుతారు కానీ ఆయన మాత్రం సమాధానం చెప్పడు. ఆయన భజన ఆయన చేసుకుంటూ వెళుతూ ఉంటాడు.

బాబుగారే చెప్పుకున్నట్టుగా….ఆయన భజన మీడియా చెప్తున్నట్టుగా………బాబుగారు అంతటి ఘటనా ఘటన సమర్థులయితే రాజధాని నిర్మాణం మూడున్నరేళ్ళ తర్వాత కూడా గ్రాఫిక్స్ బొమ్మల్లోనే ఎందుకు ఉంది? ఒక్క శాశ్విత నిర్మాణం కూడా ఎందుకు మొదలవ్వలేదు? కనీసం దుర్గ గుడి ఫ్లై ఓవర్‌ నిర్మాణం కూడా పూర్తి చేయలేని దుర్గతిలో చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ఉంది? ఇక ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌లాంటివి ఎందుకు సాధించలేకపోతున్నాడు? పోలవరం నిర్మాణం పూర్తికావడం అసాధ్యమని ఎల్లో మీడియా బూతు పత్రికలో ఈ రోజు చాలా పెద్ద వార్త ప్రచురించారు. అఫ్కోర్స్ తప్పులన్నింటికీ కేంద్రానిదే బాధ్యత అని కూడా చెప్పారనుకోండి. విజయాలు మాత్రమే బాబువి….వైఫల్యాలు అన్నీ ఇంకెవరివో అన్న సిద్ధాంతం కదా. అసలు కేంద్రప్రభుత్వంలో కూడా బాబుగారు భాగస్వామినే కదా. తెలుగుదేశం కేంద్రమంత్రులు కూాడా ఉన్నారు కదా. మరి ఎందుకు ఆంద్రప్రదేశ్‌కి లాభించే ఒక్క పని కూడా జరగడం లేదు. బాబు-మోడీ జోడీ….అభివృద్ధితో కబాడీ ఆడేస్తుందని ఇదే బాబుగారు, ఆయన ఎల్లో మీడియా 2014 ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారుగా. మోడీతో కలిసి ఇచ్చిన హామీలు కానీ, చంద్రబాబు ఇచ్చిన హామీలు కానీ కొర్రీలు లేకుండా ఒక్కటైనా నెరవేరాయా? ఓహో…..ఈ స్థాయి అసమర్థతను కప్పి పుచ్చుకోవాలంటే ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన ఏ గొప్ప పని చోటుచేసుకున్నా ఆ పని వెనకాలే నా ప్రతిభ ఉంది అని డబ్బా కొట్టుకోవాలన్న మాట. బాగుంది బాబూ…..చాలా చాలా బాగుంది. కాకపోతే 2014లో వర్కౌట్ అయిన భజన 2019లో కూడా వర్కవుట్ అవుతుందా? బాబు భజన మీడియా, భజన బృందం ఈ సారి కూడా విజయవంతంగా ప్రజలను నమ్మించగలరా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -