Tuesday, April 16, 2024
- Advertisement -

ఈడీ వ‌ల‌కు బాబు చిక్కుతారా?

- Advertisement -

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసు మ‌ళ్లీ తెర‌పైకి వ‌స్తోంది. ఈ కేసులో కాంగ్రెస్ నేత వేం న‌రేంద‌ర్‌రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే హైదరాబాద్‌లోని రోలింగ్‌హిల్స్‌లోని ఆయన ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. అంతేకాదు వారం రోజుల్లో ఈడీ ఎదుట హాజరు కావాలనేది నోటీసుల సారాంశం.

ఏ మీడియా అంత పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోయినా.. ఇదేం అంత చిన్న విష‌యం కాద‌నేది పోలిటిక‌ల్ స‌ర్కిల్ టాక్‌. తెలంగాణ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు తెల‌ప‌డానికి ఈ కేసు కూడా ఓ కార‌ణ‌మ‌న్న వాద‌న బ‌లంగా వినిపించేది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మెల్లి మెల్లిగా ఈ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డాల‌నేది చంద్ర‌బాబు ఆలోచ‌న‌గా బాగా ప్ర‌చారం జ‌రిగింది. కానీ తానోక‌టి త‌లిస్తే దైవ‌మొక‌టి త‌లిచిన‌ట్టు చంద్ర‌బాబు ఆశ‌లు నెర‌వేర‌లేదు. ఒక్క దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అన్న‌ట్టు కేసీఆర్ కొట్టిన దెబ్బ‌కు ఇటు చంద్ర‌బాబు, అటు కాంగ్రెస్‌లు కోలుకోలేక‌పోయాయి… పోతున్నాయి.

కేసీఆర్ గెలిచారు. కానీ చాలా రోజుల‌ వ‌ర‌కు ఓటుకు నోటు కేసు తెర‌పైకి రాలేదు. ఈ కేసులో కీల‌క నిందితుడు రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు.. ఆయ‌న మాట వినిపించ‌డం లేదు. ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీకి అన్ని తానై వ్య‌వ‌హ‌రించిన రేవంత్‌.. ఇప్పుడు గాంధీ భ‌వ‌న్ ఏరియాలో క‌నిపించ‌డం లేదు.

ఈ విష‌యం ప‌క్క‌న పెడితే.. యాధృచ్చికంగా జ‌రిగిందో లేక తెర వెనుక ఎవ‌రైనా సంక‌ల్పించారో తెలీదు కానీ ఉన్న‌ట్టుండి ఓటుకు నోటు కేసు తెర‌పైకి వ‌చ్చింది. అదీ ఏపీ ఎన్నిక‌లు మ‌రికొన్ని రోజుల్లో ఉన్న‌ద‌న‌గా. ఇప్పుడు నోటీసులు కేవ‌లం వేం న‌రేంద‌ర్ రెడ్డికి ఇచ్చిన‌ట్టే క‌నిపిస్తున్నా తెర వెనుక ఏదో జ‌రుగుతుంద‌ని టాక్‌.

ఇప్ప‌టికే మోదీని, కేసీఆర్‌ను త‌లుచుకోకుండా.. కాదు కాదు… తిట్ట‌కుండా రోజు గ‌డ‌వ‌డం లేదు చంద్ర‌బాబుకు. మ‌రీ చూస్తు చూస్తు ఉరుకుంటారా? అని ఎదురు ప్ర‌శ్నిస్తున్నారు కొంద‌రు నేత‌లు. అందుకే ఈ నోటీసుల వార్నింగ్ అంటున్నారు. అస‌లు ఈ కేసు వ‌ల్లే చంద్ర‌బాబు త‌ట్టా బుట్టా స‌ర్దేసీ క‌ర‌క‌ట్ట‌కు షిఫ్ట్ అయ్యార‌ని.. లేదంటే ప‌ది సంవ‌త్స‌రాలు ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉన్న హైద‌రాబాద్‌ను వ‌ద‌లాల్సిన అవ‌స‌రం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అంతేకాదు ప్ర‌త్యేక‌హోదాను మోదీ కాళ్ల ద‌గ్గ‌ర‌ తాక‌ట్టు పెట్ట‌డానికి కార‌ణం కూడా ఈ కేసేన‌ని వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి కూడా విమ‌ర్శిస్తున్నారు.

కానీ చంద్ర‌బాబు కంట్రోల్‌లో ఉండ‌టానికి ఈ కేసును ఎప్పుడూ హాట్‌హాట్‌గానే కేసీఆర్ ఉంచుతార‌ని మ‌రో వాద‌న‌. అవ‌స‌ర‌మైన‌ప్పుడు అట‌క మీది నుంచి దించ‌డం.. అవ‌స‌రం తీర‌గానే కేసు ఫైళ్ల‌ను అట‌కెక్కిస్తార‌ని అంటున్నారు.

ఏదేమైనా ఈ కేసుకు సంబంధించి ఏ చిన్న వార్త వ‌చ్చినా చంద్ర‌బాబు క్యాంప్ అల‌ర్టైపోతుంది. ఇప్పుడు వేం న‌రేంద‌ర్‌రెడ్డికి నోటీసుల విష‌యంలోనూ అంతే. అస‌లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్‌ రెడ్డిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెడుతూ రూ. 50 లక్షలతో రెడ్‌ హ్యాండెడ్‌గా రెడ్ హ్యాండ‌డ్‌గా దొరికారు. ఈ కేసులో మ‌రికొద్ది దూరం తవ్వితే చంద్ర‌బాబు బ‌య‌టికి రావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని స‌మాచారం. చూడాలి మ‌రీ.. ఎన్నిక‌ల ముందు ఇంకేం జ‌ర‌గనుందో ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -