Thursday, April 25, 2024
- Advertisement -

ప‌థ‌కాల పాచిక‌లు పార‌తాయా?

- Advertisement -

ఓట్ల పండుగ వ‌చ్చేస్తోంది.. ఇంకేముంది అధికార‌, విప‌క్ష పార్టీల‌కు ప్ర‌జ‌ల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి గుర్తొచ్చింది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ.. వీలయినన్ని ఓట్లను తన ఖాతాలో వేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు పథకాల మీద పథకాలు ప్రకటిస్తున్నాయి. వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ఇప్ప‌టికే న‌వ‌ర‌త్నాల పేరుతో కొన్ని ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించి.. ప్ర‌జాసంకల్ప‌యాత్ర పేరుతో అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పాద‌యాత్ర చేస్తూ ప్ర‌జ‌ల‌కు వాటిని చేరువ‌య్యేలా చేశారు. కానీ టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందులో కొన్నింటిని తీసుకొని.. వారు ప్ర‌క‌ట‌న మాత్ర‌మే చేశారు.. మేము అమ‌లు చేస్తున్నాం చూడండి.. మాకే ఓటు వేయండి అంటూ చెప్ప‌క‌నే చెబుతున్నారు. దీనిపై చంద్ర‌బాబు… వైఎస్ జ‌గ‌న్‌ను కాపీ కొడుతున్నారంటూ వైఎస్ఆర్‌సీపీ క్యాంప్ ఇప్ప‌టికే ఎదురుదాడి చేస్తోంది. అది వేరే విష‌యం అనుకొండి.

అస‌లు ఈ ప‌థ‌కాలు ఓట్ల‌ను త‌మ ఖాతాలో వేసుకోవ‌డానికి ఎంత ప్ర‌భావం చూపుతాయ‌నేదే మిలియ‌న్ డాల‌ర్ ప్ర‌శ్న‌. గ‌త ఎన్నిక‌ల్లో అనుభ‌వం ఉన్న నేత‌, రాజ‌ధాని నిర్మిస్తాడు.. అన్న వాద‌న కంటే చంద్ర‌బాబు ఇచ్చిన అనేక హామీలే ఆయ‌న‌ను గ‌ద్దెనెక్కేలా చేశాయి. రైతులకు రుణ మాఫీ – డ్వాక్రా రుణాల మాఫీతో పాటు చాలా హామీలనే ఇచ్చిన చంద్రబాబు… వాటిలో మెజారిటీ హామీల అమలు జోలికి వెళ్ల‌లేదు… కాదు వెళ్ల‌లేక‌పోయారు. కార‌ణం నిధుల కొర‌త‌.
చివ‌రికి ఎంతో కొంత అప్పు చేసి కొంత రుణ‌మాఫీని స‌ర్దుబాటు చేశారు. చూస్తుండగానే ఎన్నిక‌లు వ‌చ్చేశాయి. మళ్లీ ఏం చేయాలా అని ఆలోచ‌న‌లో ప‌డ్డారు.

ఒక్క‌సారి తెలంగాణ ఎన్నిక‌లను గ‌మ‌నిస్తే… కేసీఆర్‌ గెలుపుకు సంక్షేమ ప‌థ‌కాలు చేసిన మేలు అంతా.. ఇంతా కాద‌నేది జ‌గ‌మేరిగిన స‌త్యం. రూర‌ల్ ప్రాంతంలో కేసీఆర్ అమ‌లు చేసిన రైతు బంధు, ఆస‌రా ప‌థ‌కాలు చాలా ప్ర‌భావం చూపాయి. వృద్ధులు, రైతులు ఈ ప‌థ‌కాల కార‌ణంగానే త‌మ ఎమ్మెల్యే అభ్య‌ర్థులు ఎవ‌రన్న‌ది కూడా ప‌ట్టించుకోకుండా కేవ‌లం కేసీఆర్ బొమ్మ చూసి ఈవీఎంల‌లో కారు గుర్తు బ‌ట‌న్‌ను నొక్కార‌న్న‌ది వాస్త‌వం. వీటికి తోడు ఎన్నిక‌ల్లో మ‌ద్యం, డ‌బ్బును ఏరులై పారించారు. మ‌రోవైపు హ‌స్తం పార్టీ ఆర్థిక మూలాల‌ను క‌ట్ చేస్తూ.. చంద్ర‌బాబు ఎంట్రీతో వ‌చ్చిన సెంటిమెంట్‌ను వాడుకున్నారు. ఇలా సామ‌, ధాన, భేద, దండోపాయాలు అన్న‌ట్టు అన్నింటిని క‌లిపి కొట్టిన కేసీఆర్‌.. సీఎం కుర్చిని మ‌రో ఐదేళ్ల పాటు రిజ‌ర్వ్ చేసుకున్నారు.

ఏపీలో రాజ‌కీయం వేరు. ఇక్క‌డ సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ కాదు. అందుకే ఇద్ద‌రు నేతలు సంక్షేమ ప‌థ‌కాల‌పై దృష్టిసారించారు. సంక్షేమ ప‌థ‌కాల విలువ తెలుసు కాబ‌ట్టే.. నాలుగున్న‌రేళ్లు సైలెంట్‌గా ఉన్న చంద్ర‌బాబు.. ఇప్పుడు వ‌రాల జ‌ల్లు కురిపిస్తున్నారు. డ్వాక్రా మహిళలను ఊరించేందుకు చంద్రబాబు ఏకంగా ఓ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో గడచిన ఎన్నికల్లో తాను ఇచ్చిన డ్వాక్రా రుణాల మాఫీని మాట మాత్రంగా కూడా ప్రస్తావించని చంద్రబాబు… కొత్తగా ప్రతి డ్వాక్రా మహిళకు రూ.10 వేల నగదుతో పాటు ఉచితంగా స్మార్ట్ ఫోన్ అందిస్తానని ప్రకటించారు. వాటిని అమ‌లు చేయ‌డానికి మ‌ళ్లీ అప్పులు చేయాలి అని కూడా బ‌హిరంగంగానే చెబుతున్నారు. కానీ చేయ‌లేను అని చెప్పే ప‌రిస్థితి. కానీ ఇక్క‌డ జ‌గ‌న్ సేఫ్ అని చెప్పుకోవాలి. చంద్ర‌బాబువి మోస‌పూరిత వాగ్ధానాలు అని చెబుతూనే.. ప్ర‌జ‌ల‌కు తాను రూపొందించిన న‌వ‌ర‌త్నాల గురించి ప్ర‌చారం చేస్తున్నారు. ఇందులో పిల్ల‌ల నుంచి వృద్ధుల వ‌ర‌కు, మ‌హిళ‌ల‌కు, రైతుల‌కు ఉప‌యోగ‌పడేలా వీటిని రూపొందించారు. జ‌గ‌న్ ఇచ్చిన హామీ నెర‌వేరుస్తాడు అనే న‌మ్మ‌కం ప్ర‌జ‌ల్లో ఉంది. మ‌రి వైఎస్ఆర్‌సీపీ క్యాంప్ దీనిని ఎంత వ‌ర‌కు క్యాష్ చేసుకుంటుందో చూడాలి. ఇక డ‌బ్బు పంపిణీ విష‌యానికి వ‌స్తే ఆ స‌త్తా ఉన్న వారికే టికెట్లు కేటాయించ‌నున్నారు అధికార‌, విప‌క్ష పార్టీలు. ఈ విష‌యంలో మాత్రం అధికార పార్టీ మాత్రం ఒక అడుగు ముందే ఉంద‌ని చెప్పుకోవాలి.

ఏదేమైనా వ‌చ్చే ఎన్నిక‌ల్లో సంక్షేమ ప‌థ‌కాల హామీలు ముఖ్యపాత్ర పోషిస్తాయ‌నేది కాద‌న‌లేని వాస్త‌వం. కాని పోలింగ్ ముందు రోజు రాత్రి ఊరూరా తిరిగే ధ‌న‌ల‌క్ష్మీ కూడా అంతే పాత్ర పోషిస్తుంద‌నేది కూడా ముమ్మాటికి నిజం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -