Friday, April 19, 2024
- Advertisement -

మద్దతు ఇచ్చే ధైర్యం లేదు కానీ.. అభినందనలు తెలపడానికి ఎక్కడలేని ఉత్సాహం…

- Advertisement -

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరీ ఇంత పిరికివాడా ? అటో.. ఇటో.. తేల్చి చెప్పలేని భయస్తుడా ? హోరాహోరీగా సాగిన తెలంగాణ ఎన్నికల్లో ఫలానా పార్టీకి ఓటు వేయండి. లేదా ఫలానా పార్టీకి ఓటు వేయకండి. అని చెప్పలేని అసమర్ధుడా ? ఇంత పిరికివాడు… తెల్లారి లేచింది మొదలు దాశరధి, గుంటూరు శేషేంద్రశర్మ, శ్రీశ్రీ, చేగువేరా అంటూ….వారి కవితలు, స్ఫూర్తిగాథల గురించి చెప్పేస్తూ, వేదికలు ఎక్కి ఊగిపోతూ ఉపన్యాసాలు ఇచ్చేయడమేంటని సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర పదజాలంతో ఉతికి ఆరేస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్ లో గత 20 ఏళ్లుగా స్థిరపడిన సీమాంధ్రులు పవన్ తీరును ఎండగడుతున్నారు. ముఖ్యంగా కూకట్ పల్లి ప్రాంతానికి చెందిన సెటిలర్ రవిచంద్, పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. తాను పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తినే అయినా గత 20 ఏళ్లుగా హైదరాబాద్ లోని నివశిస్తున్నామని రవిచంద్ లేఖలో తెలిపారు. తెలంగాణ విభజన సమయంలో అనేక ఒత్తిళ్లు, అవమానాలు, బెదిరింపులకు లోనయినా అక్కడే సొంత నివాసం ఏర్పరుచుకుని ఉంటున్నామని చెప్పారు.

తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుతో పాటు ఆ పార్టీ నాయకులందరికీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. ఓ లేఖను కూడా విడుదల చేశారు. ముందుగా పవన్ రాసిన లేఖను చూసి తరించాలని, ఆ తర్వాత పవన్ సారుకు తాను రాసిన లేఖను చూడాలని రవిచంద్ ఆ లెటర్ లో కోరారు. పవన్ వ్యవహారశైలిపైన ఆయన అభిమానిగా రవిచంద్ రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. జనసేన శ్రేణులతో పాటు ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చనే లేవదీస్తోంది.

రవిచంద్ కోరినట్లు ముందుగా పవన్ లేఖలో ఏముందో ఓ సారి చూద్దాం….

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన గౌరవనీయులు శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారికి నా తరపున, జనసేన శ్రేణుల తరపున హృదయపూర్వక శుభాభినందనలు తెలుపుతున్నాను. ఈ తీర్పుతో తెలంగాణ ప్రజల విజ్ఞత మరోసారి రుజువైంది. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన, తెలంగాణను తెచ్చిపెట్టిన తెలంగాణ రాష్ట్ర సమితికి, ఆ పార్టీ నాయకుడు శ్రీ కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు పట్టం కట్టి తమ మనసులోని మాటలను మరోసారి చాటి చెప్పారు. ఈ అఖండ విజయానికి సారధులైన శ్రీ కేసీఆర్ గారు, వారి కుమారుడు శ్రీ కేటీఆర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను కేసీఆర్ గారు నెరవేరుస్తారన్న నమ్మకం నాలో సంపూర్ణంగా ఉంది. ఈ ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన శ్రీ హరీష్ రావు గారికి నా శుభాకాంక్షలు. విజయం సాధించిన ప్రతి ఒక్కరితోపాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు నా అభినందనలు’ ఇట్లు పవన్ కళ్యాణ్….. అని లేఖలో పవన్ రాసుకొచ్చారు.

ఇక పవన్ ను ఉద్దేశించి రవిచంద్ రాసిన లేఖ ఏంటో ఓ సారి చూద్దాం.

గెలిచిన అభ్యర్ధులకు అభినందనలు తెలపడం మంచిసంప్రదాయమే. ప్రతి ఒక్కరం స్వాగతించాల్సిన అంశమే..కానీ ఎన్నికల్లో ఫలానా అభ్యర్ధికే ఓటు వేయండి. ఫలానా వారికి వేయకండి అని చెప్పే దమ్మూధైర్యం లేని పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు అభినందనలు తెలపడానికి అంత ఉత్సాహం ఎందుకో, ఆంధ్రులను నిత్యం తిడుతూ, ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో నివశించే నాలాంటి ఆంధ్రులను, మీరూ… ఇక్కడ ఉండొచ్చు…ఇక్కడ బతకొచ్చు…అంటూ వారి దయాదాక్షిణ్యాలతో బతకాలన్నట్టు చెప్పే గులాబీ నాయకుల గెలుపుపై, రేపు ఆంధ్రాలో పోటీ చేస్తానని చెప్పుకుంటున్న పవన్ సార్ ఆనందం చూస్తుంటే ఈ లేఖ రాయాలని అనిపించింది. ఉమ్మడి రాజధానిలో పరాయి దేశంలో బతుకుతున్నట్టు బతుకుతున్న తమలాంటి ఆంధ్రుల ఆవేదన పట్టని పవన్ సార్ ఇప్పుడు సడెన్ గా గులాబీ దళంపై అభినందనలు కురిపించడంలో చూపిస్తున్న ఉత్సాహం ఆనందం సంతోషం చూస్తుంటే ఆయన అభిమానిగా నా గుండె తరుక్కుపోతోంది. నిత్యం ఆంధ్రులను తిడుతూ, ప్రత్యేకహోదాను అడ్డుకుంటామని హెచ్చరిస్తూ, తెలంగాణ గడ్డపై నుంచొని ఆంధ్రాకు ప్రత్యేకహోదా ఇస్తామని ప్రకటిస్తారా ? అంటూ విద్వేషాలను రెచ్చగొట్టి, మళ్లీ సెంటిమెంట్ రగిల్చి, ఆంధ్రులను దొంగలుగా దోషులుగా చిత్రీకరిస్తూ రాజకీయ పబ్బం గడుపుకొనే నాయకులను అభినందించడం పవన్ కే చెల్లింది. ఇక్కడ పోటీ చేయలేక తోక ముడిచేసిన ఈయన రేపు ఆంధ్రాలో పోటీ చేసేస్తాడంట. అక్కడ ఉద్ధరించేస్తాండంట. గెలిచినవాళ్లను అభినందించడానికి చూపించే ఉత్సాహంలో సగమైనా, కనీసం ఓ పది శాతమైనా హైదరాబాద్ లో, తెలంగాణలో నివశిస్తున్న ఆంధ్రుల బాగోగుల పట్ల పవన్ చూపించి ఉంటే బాగుండేది. కానీ పెన్ డ్రైవ్ ల భయమో ? ఆస్తులు కాపాడుకోవాలనే భయమో కానీ, నాడు ఎవరిపైనే ఘర్జించాడో నేడు వారికే జేజేలు పలుకుతుండటం అత్యంత బాధాకరం.

అయితే తాజా ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేయాలనే విషయంలో తనతో పాటు తనలాంటి చాలామంది ఆంధ్రులతో పాటు తెలంగాణకు చెందిన సామాన్యులకు అయోమయం నెలకొందన్నారు రవిచంద్. అన్ని పార్టీలు హామీలు గుప్పిస్తూ, తమను ఓటు అభ్యర్ధించడంతో నిర్ణయం తీసుకోవడంలో కొంత తడబాటు తప్పలేదని ఆయన లేఖలో స్పష్టం చేశారు. ఆ సమయంలో తాము పవన్ కళ్యాణ్ వైపు చూశామన్నారు. కొత్త తరానికి కొత్త రాజకీయం అంటూ…ఆంధ్రాలో ముఖ్యంగా గత కొద్ది రోజులుగా గోదావరి జిల్లాల్లోనే ప్రధానంగా ‘కాపు’ కాసి, మకాం వేసిన పవన్ కళ్యాణ్ నిర్ణయం కోసం ఎదురు చూశామన్నారు. తనదీ పవన్ సొంత జిల్లాయేనని, దీంతో పాటు ఆయన సామాజికవర్గానికే చెందిన వ్యక్తిని కావడంతో పవన్ దిశానిర్దేశం చేస్తారని ఆశించానని రవిచంద్ తెలిపారు. తనతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పవన్ అభిమానుల మధ్య కూడా ఇదే చర్చ తరచూ జరిగేదని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రా తేడాలేకుండా పవన్ అభిమానులం అందరం, మా నాయకుడు ఏ పార్టీకి ఓటు వేయమంటాడు ? ఎవరికి మద్దతు తెలుపుతాడు ? ఎవరి విధానాలను అభినందిస్తాడు ? ఎవరిని విమర్శిస్తాడు ? ఎవరి లోపాలను ఎండగడతాడు ? ఎవరు అసమర్ధ నాయకులు ? ఎవరు సమర్ధ నాయకులు ? పవన్ నోటి వెంట చెబితే…ఆయన అభిమానులుగా, ఆయనను ఆరాధించే భక్తులుగా ప్రాంతాలకతీతంగా పవన్ మాటే వేదంగా ఓటు వేద్దామని ఎదురుచూశాం.

కానీ ఎలక్షన్ కు రెండు రోజుల ముందు పవన్ సార్ ఓ సెల్ఫీ వీడియో సందేశం జనం మీదకు వదిలారు. దాశరధి గారు చెప్పిన కవితను కంఠస్తా పెట్టేసి, ప్రజలకు అప్పజెప్పేస్తూ తన మదిలో ఆ కవిత మారుమోగుతోందని చెప్పుకొని తెగ సంబరపడిపోతూ సందేశం ఆరంభించారు. ఆ తర్వాత తెలంగాణ ఇచ్చామనేవాళ్లు, తెలంగాణ తెచ్చామనేవాళ్లు, తెలంగాణను పెంచామనేవాళ్ల మధ్యలో మనం ఎవరికి ఓటేయాలి ? ఎవరికి ఓటేయకూడదు ? అనే అయోమయ పరిస్థితుల్లో నా విన్నపం ఒకటి అంటూ…పవన్ గారు జ్యోతిలక్ష్మి డాన్స్ లా చూపించీ చూపించనట్టు…చెప్పీ చెప్పనట్టు…ఓ మాట చెప్పేశారు. అత్యంత ఎక్కువ పారదర్శకతతో, తక్కువ అవినీతితో ఎవరైతే మంచి పరిపాలన అందించగలరో…. దీని మీద ప్రజలంతా లోతుగా ఆలోచించి, ఓ మంచి నిర్ణయం తీసుకుని ఓటేయాలని సెలవిచ్చారు.

దాశరథి కవితతో ఆరంభించి కొండంత రాగం తీసిన పవన్ సార్, చివరికి చెప్పందేంటి అంటే…? ఏమీ లేదు. మాట్లాడితే నాకు భయం లేదు. ప్రాణాలకు తెగించే రాజకీయాల్లోకి వచ్చాను. నన్ను చంపేస్తారని తెలిసినా నిజాన్ని నిర్భయంగా చెబుతాను. ఖబడ్దార్..అంటూ జనసేన అధ్యక్షుడిగా ఆయన సినిమా డైలాగులను పలు రాజకీయ సభల్లో చెప్పారు. సినిమాల్లో కోట్లు సంపాదించుకోగలను, కానీ నీతివంతమైన పాలన కోసం, పారదర్శకమైన నాయకత్వం వహించాలనే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకొచ్చారు. ఖబడ్దార్ అంటూ తొడకొట్టారు. మీసం మెలేశారు. ఊగిపోతూ ఉపన్యాసాలిచ్చారు. వాటన్నింటినీ చూసి స్వతహాగా ఆయన అభిమాని అయిన నేను, నాతో పాటు ఇతర అభిమానులం పవనిజం అంటే సూటిగా సుత్తిలేకుండా, వాడివేడిగా ఉంటుందని ఆశించాం. డైలాగులు చెప్పినట్టే ఆచరణలోనూ పవన్ నిర్భయంగా వ్యవహరిస్తారని, తన అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు ఎలాంటి మొహమాటాలు, భయాలు, అనుమానాలు లేకుండా దిశానిర్దేశం చేస్తారని భావించాం. కానీ పవన్ అన్ని డైలాగులు చెప్పి తెలంగాణలో ఫలానా పార్టీకి ఓటేయండని కానీ, ఫలానా పార్టీక ఓటేయకండని కానీ చెప్పలేకపోవడం చూసి ఆశ్చర్యపోయాం. కామన్ మ్యాన్ కూడా ధైర్యంగా గొంతెత్తి చాటి చెప్పాడు. నాకేం ఇచ్చావ్ ? నాకేం చేశావ్ ? ఇన్నాళ్లూ ఎక్కడికి పోయావ్ ? నీకెందుకు ఓటేయ్యాలి ? అని సాధారణ మహిళలు కూడా పెద్దపెద్ద నాయకులను ముఖం మీదే నిలదీశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా అనేకమందిని ప్రశ్నించారు. ఎవరికి ఓటు వేస్తామో ? ఎవరికి ఓటు వేయమో ? అన్నది దాపరికాలు, భయాలు లేకుండా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు.

కానీ ఓ పార్టీ అధ్యక్షుడిగా, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని చెబుతూ, తెలంగాణలో నా లాంటి అభిమానులను అనేకమందిని కలిగి ఉండికూడా పవన్ కళ్యాణ్ నోరు తెరిచి ఫలానా పార్టీకి ఓటు వేయండి. ఫలానా పార్టీకి ఓటు వేయకండి. అని చెప్పలేనంత భయస్తుడా ? అని ఇప్పుడు నెటిజన్లు మమ్మల్ని ప్రశ్నిస్తుంటే సిగ్గుతో సమాధానం చెప్పలేకపోతున్నాం. ఓ నాయకుడిగా దిశానిర్దేశం చేయాల్సిన వాడు అటూ ఇటూ కాకుండా మాట్లాడం ఏంటని ? ఇతడా మీ నాయకుడు ? ఇతడా మీ అభిమాన హీరో ? వీళ్లు సినిమాల్లోనే తప్ప నిజజీవితంలో రాజకీయాల్లో జీరోలు… అని ఎగతాళి చేస్తుంటే ఓ ఆంధ్రుడిగా, పవన్ అభిమానిగా సిగ్గుతో చచ్చిపోతున్నాను. ఈ పరిస్థితి నా ఒక్కడిదే కాదు పవన్ అభిమానులందరిదీను. తెలంగాణలోని పరిస్థితులపై కానీ, అక్కడున్న సీమాంధ్రుల సాదకబాధలు కానీ ఏ మాత్రం పట్టకుండా పవన్ ఉంటున్నారా ? రాజకీయ పార్టీలంటే, నాయకులంటే అంత భయమున్నవాడికి ఎందుకు రాజకీయాలు ? లోపాలను ఎత్తి చూపలేనివాడు, ప్రజాప్రతినిధులను ప్రశ్నించలేని వాడు, తన ఫాలోవర్స్ కి డైరెక్టుగా ఫలానా వారికి ఓటేయండి. ఫలానా వారికి వేయకండి అని చెప్పలేని వాడు ఈయన ఒక నాయకుడా ? ఎందుకంత భయం ? ఎంకన్నకో, సుబ్బన్నకో, దారినపోయిన దానయ్యకో…ఎవరో ఒకరికి మద్దతు ఇవ్వవచ్చు కదా… ఏ ఒక్క పార్టీకి సపోర్ట్ చేయకుండా, పారదర్శక పాలన, అవినీతి తక్కువ…అంటూ సోది చెప్పడానికా రెండు రోజుల మందు వాట్సప్ వీడియో రిలీజ్ చేశాడని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇంత పిరికివాడికి రాజకీయాలు ఎందుకు ? అటో..ఇటో..చెప్పలేనివాడికి నాయకత్వమెందుకు ? అని నిలదీస్తుంటే సమాధానం చెప్పలేకపోతున్నాం. ఇక మీ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నా. జనం అడిగే ప్రశ్నలకు పవన్ సమాధానం ఏం చెబుతారో చూద్దామన్న ఆశ, ఆలోచన కూడా నాకు ఇప్పుడు లేవు. ఎందుకంటే ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పినవాడికే ప్రజల నుంచి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక ఆయనేం ప్రశ్నిస్తాడు ? ఏం సమాధానం చెబుతాడు ?

ఇట్లు
పవన్ కళ్యాణ్ తాజా మాజీ అభిమాని
హైదరాబాద్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -