వైకాపాలోకి ప్రముఖ నాయకుడు…… శ్రీకాకుళం ఎంపీ సీటు వైకాపా ఖాతాలోకేనా?

6043
Srikakulam Boddepalli Family Ready to Join YSR Congress Party Soon
Srikakulam Boddepalli Family Ready to Join YSR Congress Party Soon

2019 ఎన్నికలు చంద్రబాబుకి చీకటి రాత్రులు మిగల్చనున్నాయని ఇప్పటికే చాలా సర్వేలు తేల్చేశాయి. అయితే టిడిపి కంచుకోటలాంటి నియోజకవర్గాల్లో కూడా ఓటమి తప్పదన్న విశ్లేషణలే చంద్రబాబులో ఇంకా టెన్షన్ పెంచుతున్నాయి. తాజాగా వచ్చిన జాతీయ సర్వేలో కూడా కాంగ్రెస్-టిడిపి కలిసి పోటీచేసినా కూడా వైకాపా 19 ఎంపి సీట్లలో విజయం సాధిస్తుందని తేల్చి చెప్పేసింది.

ఎర్రన్నాయుడి టైం నుంచీ టిడిపికి బలమైన సీటుగా ఉన్న శ్రీకాకుళంలో ఈ సారి వైకాపా జెండా ఎగరడం ఖాయం అని విశ్లేషకులు తేల్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం ఎంపి సీటుకు వైకాపాలో చాలా కాంపిటీషన్ ఉంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి కుమారుడు, మాజీ మునిసిపల్ ఛైర్మన్ బొడ్డేపల్లి రమేష్ కుమార్ వైకాపాలో చేరడానికి రెడీ అయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో ఈ కుటుంబానికి చాలా ప్రాధాన్యత ఉంది. శ్రీకాకుళం ఎంపి సీటు ఇవ్వాలని చెప్పి అడుగుతూ ఈయన తాజాగా విజయసాయిరెడ్డిని కలిశారు.

అయితే సీటు విషయం పార్టీలో చేరకముందే చెప్పే అలవాటు జగన్‌కి లేదని…భేషరతుగా పార్టీలో చేరితే న్యాయం చేస్తామని విజయసాయిరెడ్డి చెప్పారట. అయినప్పటికీ వైఎస్ జగన్‌పైన అభిమానంతో, నమ్మకంతో వైకాపాలో చేరడానికే నిర్ణయించుకున్నాడు రమేష్ కుమార్. ఆయన వర్గ నాయకులందరినీ వైకాపాలో చేరుస్తానని మాటిచ్చాడట. సోమవారమే జగన్‌ని కూడా కలిసిన ఈ నాయకుడు పాదయాత్ర ముగింపు సందర్భంగా జగన్ సమక్షంలో వైకాపాలో చేరనున్నాడు. ఇప్పటికే శ్రీకాకుళంలో బలంగా ఉన్న వైకాపా వరుసగా నాయకుల చేరికతో మరింత స్ట్రాంగ్ అయిందని…….2019 ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపి సీటుకు వైకాపా తరపున ఎవరు పోటీచేసినా గెలవడం ఖాయం అని శ్రీకాకులం జిల్లా రాజకీయాలను అధ్యయనం చేస్తున్నవాళ్ళు ఘంటాపథం చెప్తున్నారు.