దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు, ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చెల్లి షర్మిల నేడు హైదరాబాద్‌లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 9న వైఎస్సార్ పెళ్లిరోజు కావడంతో మంగళవారం తొలి సమావేశం ఏర్పాట్లు చేసినట్లు షర్మిల సన్నిహితులు చెబుతున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు తన భర్త బ్రదర్ అనిల్‌తో కలిసి బెంగళూరు నుంచి లోటస్‌పాండ్ షర్మిల సోమవారం చేరుకున్నారు. మొత్తంగా వైఎస్ అభిమానులతో పాటు షర్మిల అనుచరులు కూడా హాజరు కానున్న ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు లోటస్ పాండ్ వద్ద ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల ఫ్లెక్సీలు ఆసక్తి రేపుతున్నాయయి. ‘మన కష్టాలు తెలుసు, మన కన్నీళ్లు తెలుసు, మన బతుకులు మార్చిన బాట.. వైఎస్ఆర్ కుటుంబానికి తెలుసు’అన్న వ్యాఖ్యలతో ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. షర్మిలమ్మ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ కూడా కింద స్లోగన్స్ రాశారు. అయితే ఫ్లెక్సీపైన జై వైఎస్ఆర్‌తో పాటు జై షర్మిలక్క అని కూడా రాసి ఉంది. షర్మిల ఫోటోతో పాటు వైఎస్ ఫోటో కూడా ముద్రించారు. అయితే ఈ ఫ్లెక్సీపై జగన్ ఫోటో మాత్రం ఎక్కడా కనిపించలేదు.

మరో ఫ్లెక్సీలో ‘జనంలోకి వస్తుంది షర్మిలక్క.. జనరంజకపాలన ముందుందిక’అని ఉంది. ఇందులో కూడా షర్మిల ఫొటో మాత్రమే ఉంది కానీ జగన్ ఫొటో లేదు. ఇలా పెద్ద ఎత్తున వెలిసిన ఫ్లెక్సీల్లో ఒక్క చోట కూడా వైఎస్ జగన్ ఫొటో లేకపోవడం ఈ ఫ్లెక్సీలపై విపరీతంగా చర్చ జరుగుతోంది. జగన్‌కు షర్మిల మధ్య విబేధాలు నిజమేనా ? అన్న సందేహాలు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు షర్మిల ఇవాళ ఆత్మీయ సమ్మేళనానికే పరిమితం అవుతారా ? లేక రాజకీయా పార్టీ ప్రకటిస్తారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది.