పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా చిత్రం హరి హర వీరమల్లు. హిస్టారికల్ ఎపిక్ వారియర్‌గా వస్తున్న ఈ చిత్రంలో యోధుడి పాత్రలో కనిపించనున్నారు పవన్. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతుండగా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను క్రిష్ పర్యవేక్షిస్తుండగా మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏఎం రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం కోసం, నిర్మాతలు ప్రత్యేకంగా చార్మినార్, ఎర్రకోట సహా మచిలీపట్నం ఓడరేవు వంటి భారీ సెట్‌లను నిర్మించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస ఈ సినిమాకు పనిచేస్తుండగా ఈ ఏడాది చివరి నాటికి హరి హర వీర మల్లు పార్ట్-1 ‘స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ని విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా బాబీ డియోల్, సునీల్, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.