ఏపీలో కూటమి పొత్తు పవన్ వల్లే సాధ్యమైందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. విజయవాడలో జరిగిన ఎన్డీయే కూటమి శాసనసభా పక్ష సమావేశంలో చంద్రబాబును ఫ్లోర్ లీడర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోగా ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు చంద్రబాబు.
దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ప్రజలు చారిత్ఆక తీర్పు ఇచ్చారన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు వల్ల ఢిల్లీలో తమను అందరూ గౌరవిస్తున్నారని.. స్టైకింగ్ రేటు 93 శాతం రావడం అరుదైన అనుభవమన్నారు. పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ..ఆయన వల్లే కూటమి సాధ్యమైందన్నారు.
జైల్లో నన్ను కలిశాక పొత్తు ప్రకటన తొలుత పవన్ కళ్యాణ్ చేశారు… ఆ రోజు నుంచీ ఎలాంటి పొరపచ్ఛాలు లేకుండా మూడు పార్టీలు కలిసేలా పవన్ కళ్యాణ్ వ్యవహరించారని కొనియాడారు. ఇక నరసాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. కేంద్ర మంత్రి వర్గంలో ఆయనకు సహాయ మంత్రి దక్కిందని చెబుతూ.. శ్రీనివాస వర్మ సామాన్యమైన కార్యకర్త. ఈరోజు కేంద్రంలో మంత్రి స్థానం వచ్చిందన్నారు. వర్మకు ఎంపీ సీటు వచ్చినప్పుడు ఆశ్చర్యం అనిపించిందని కానీ విచారిస్తే పార్టీ కోసం కష్టపడ్డారని తెలిసిందన్నారు. ఒక పార్టీ కార్యకర్తను గుర్తించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నారు.