బ్రిటిష్ కాలం నాటి న్యాయ చట్టాలకు ముగింపు పలుకుతు కేంద్రం తీసుకొచ్చిన కొత్త న్యాయ చట్టాలు నేటి నుండి అమల్లోకి వచ్చాయి. నేరాల దర్యాప్తు, విచారణ వేగవంతం ఉండేలా కొత్త చట్టాలను రూపొందించారు. ప్రధానంగా కేసుల విచారణలో జాప్యాన్ని అరికట్టేందుకు కేవలం రెండు వాయిదాలకే అవకాశం ఇవ్వగా విచారణ పూర్తయిన 45 రోజుల్లోగా తీర్పు వెలువరించేలా ప్రణాళిక రెడీ చేశారు.
దీంతో నేటి నుండి ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్(సీఆర్పీసీ), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత(బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియం(బీఎస్) అమల్లోకి వస్తాయి.
ఇక కొత్త చట్టాల్లో ప్రధానమైన అంశాలను గమనిస్తే…మైనర్‌పై సామూహిక లైంగిక దాడికి పాల్పడితే మరణ శిక్ష లేదా జీవిత ఖైదు నిబంధన విధించారు. అలాగే
జీరో ఎఫ్ఐఆర్ విధానంతో ఒక వ్యక్తి పోలీసుస్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఏ స్టేషన్లో అయినా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే ఏదైనా ఘటనను ఒక వ్యక్తి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు వీలు కల్పించారు. అలాగే ఆ వ్యక్తి పోలీసుస్టేషన్‌కు వ్యక్తిగతంగా వెళ్లాల్సిన అవసరం లేదు.
లైంగిక దాడి బాధితురాలి స్టేట్మెంట్ను ఆమె సంరక్షకురాలు లేదా బంధువు సమక్షంలోనే రికార్డు చేయాల్సి ఉంటుంది. ఏదైనా కేసులో నిందితులు, బాధితులు 14 రోజుల్లోగా ఎఫ్ఐఆర్, పోలీసు రిపోర్టు, చార్జిషీట్, స్టేట్మెంట్లు, ఇతర డాక్యుమెంట్ల కాపీలను పొందవచ్చు. రాజద్రోహం స్థానంలో దేశద్రోహం అనే పదాన్ని చేర్చారు. వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాద చర్యలను నిర్వచించారు. ఏదైనా కేసులో చేపట్టే తనిఖీలు, స్వాధీనాలను వీడియో రికార్డింగ్ చేయడం తప్పనిసరి.
వివాహం పేరుతో మోసం చేయడం, మైనర్లపై సామూహిక లైంగిక దాడికి పాల్పడటం, మూక హత్యలు, చైన్ దొంగతనాలు వంటి ఘటనలకు పరిష్కరించేందుకు ప్రత్యేక నిబంధనలు. మహిళలపై నేరాల కేసుల్లో బాధితులు తమ కేసు పురోగతిపై 90 రోజుల్లోపు ఎప్పటికప్పుడు సమాచారం పొందేందుకు అర్హులు. ప్రధానంగా మహిళలు, దివ్యాంగులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు, 15 ఏండ్లలోపు పిల్లలు, 60 ఏండ్ల పైబడిన వృద్ధులు పోలీసుస్టేషన్‌కు వెళ్లడం నుంచి మినహాయింపు ఇచ్చారు.

