చట్టం మీ చుట్టమా..?మీరు ఎమ్మెల్యే తాలుకా అయితే ఏంటీ?

ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకం బాగా పెరిగిపోయిందనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్‌ని చేతుల్లోకి తీసుకుంటున్న ఈ పార్టీల నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బహిరంగంగానే రెచ్చిపోతున్న అధికార యంత్రాంగం స్పందించడం లేదు.

ప్రధానంగా టీడీపీ – బీజేపీ – జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఓవరాక్షన్ చేస్తూ బైక్‌లకు నెంబర్ ప్లేట్ తీసేసి తాము పలనా ఎమ్మెల్యేగారి తాలుకా అని నంబర్‌ ప్లేట్ పెట్టేస్తున్నారు. అంతేకాదు అదేదో ఘనకార్యం అయినట్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు.

ప్రధానంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే తాలుకా అంటూ నంబర్ ప్లేట్లపై రాయిస్తున్నారు. అయితే మోటారు వాహన చట్టం ప్రకారం ఇలా చేయడంపై నిషేధం. బండిపై నంబరు ప్లేటుపై నంబరు కాకుండా వేరేమైనా రాస్తే చట్టపరంగా తీసుకొనే చర్యలకు బాధ్యలు కావాల్సి ఉంటుంది. అంతేగాదు నంబర్ ప్లేటు నిర్దేశిత సైజు, ఫాంట్, రంగులో అక్షరాలు, అంకెలు ఉండాలి. వాహనం నమోదైన రాష్ట్రం, ప్రాంతం గుర్తించే కోడ్‌లతో పాటు కొత్తగా క్యూఆర్ కోడ్‌లు వస్తున్నాయి.

నంబర్ ప్లేట్‌పై వ్యక్తిగత సందేశాలు, పేర్లు, టైటిల్స్ రాయటం భారత మోటారు వాహనాల చట్టం ప్రకారం నిషేధం. ముఖ్యంగా రాజకీయ పార్టీ గుర్తులు వాహనం నంబర్ ప్లేటుపై రాయకూడదు. నంబర్ ప్లేట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించడం లేదా మార్చడం చట్టపరమైన నేరం.కానీ ఇప్పుడు ఇవేవి పోలీస్,ఆర్టీఏ అధికారులకు పట్టడం లేదు. ప్రభుత్వం తమ చేతుల్లో ఉందనో లేదో మరె కారణమో తెలియదు కానీ సామాన్య ప్రజలు మాత్రం ఇది సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.