రోడ్డున పడ్డ వరద బాధితులు!

పాలకుల నిర్లక్ష్యం, ప్రకృతి ప్రకోపం వెరసీ విజయవాడ ప్రజల శాపంగా మారాయి భారీ వర్షాలు. వరద సృష్టించిన బీభత్సంతో ఇప్పటికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఎవరిని అడిగినా తెలుస్తుంది. నిర్లక్ష్యంతో సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డారు విజయవాడ వరద బాధితులు. ఇంట్లోని సామాన్లు బురదమయం.. పనికిరాకుండా పోయాయి ఎలక్ట్రానిక్ వస్తువులు. సగటున ఒక్కో ఇంట్లో రూ.1-3 లక్షలు ఆస్తి నష్టం సంభవించగా ఇప్పటి వరకు బాధితులకి నయా పైసా కూడా ఇవ్వలేదు చంద్రబాబు.

వరద ముంపు గురించి ఒక్క మాట చెప్పి ఉన్నా జాగ్రత్త పడే వాళ్లం అని బాధితులు వాపోతున్నారు. ఒక్కసారిగా వచ్చిన వరదతో ఏ వస్తువునీ కాపాడుకోలేకపోయాం అని.. ఇప్పుడు కట్టుబట్టలతో రోడ్డునపడిపోయాం అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లు టీడీపీకి చెందినవేనని మరో సాక్ష్యం వెలుగులోకి వచ్చింది. జూన్ నెలలో కూటమి గెలవగానే బోట్ల ర్యాలీతో టీడీపీ నేతలు సంబరాలు చేశారు. ఆ ర్యాలీలో వినియోగించిన బోట్లే మొన్న ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయని స్థానికంగా చర్చ జరుగుతోంది.