వైఎస్ ఫ్యామిలీలో నెలకొన్న ఆస్తుల వివాదంపై విజయమ్మ స్పందించిన సంగతి తెలిసిందే. విజయమ్మ రాసిన లేఖపై స్పందిస్తూ లేఖను విడుదల చేసింది వైసీపీ. జగన్‌మోహన్‌రెడ్డికి న్యాయపరమైన ఇబ్బందులు కలిగించి ఆయన బెయిల్ రద్దుకు జరుగుతున్న కుట్రపూరిత వ్యవహారాలను వైఎస్ విజయమ్మ తన లేఖలో ఎందుకు ప్రస్తావించలేదని వైఎస్సార్‌సీపీ ప్రశ్నించింది.
షర్మిల ఎన్నో రకాలుగా తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా జగన్ ఒక్కరోజు కూడా తన చెల్లెలిని ఒక్క మాట కూడా అనలేదనే విషయాన్ని గుర్తు చేసింది. చెల్లెలుపై ప్రేమాభిమానాలతోనే జగన్ తన స్వార్జిత ఆస్తుల్లో షర్మిలకు వాటా ఇచ్చేందుకు ఎంవోయూ చేశారని… అవి కుటుంబ ఆస్తులే అయితే ఎంవోయూ చేయాల్సిన అవసరం ఉండదు..చట్టా రీత్యా హక్కు వస్తుంది కదా? అని పేర్కొంది.
జగన్ సంతకాలు లేకుండానే షేర్లు బదిలీ చేయడం మోసపూరితం కాదా? అని నిలదీసింది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయడమే కాకుండా ఆయన కుమారుడు వైఎస్ జగన్‌ను అక్రమంగా 16 నెలలు జైల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటూ ఎన్నికలకు కొద్ది గంటల ముందు విజయమ్మ వీడియో రికార్డింగ్‌ను విడుదల చేసినప్పుడు వైఎస్సార్ అభిమానులు తీవ్రంగా కలతచెందారని తెలిపింది. వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణిగా, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాతృమూర్తిగా విజయమ్మను అమితంగా గౌరవిస్తామని లేఖలో పేర్కొంది వైసీపీ.