నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్లు ఉంది ఏపీ ప్రభుత్వ పరిస్థితి. అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దాలు మాట్లాడి అడ్డంగా బుక్కయింది కూటమి సర్కార్. ఏపీలో వాలంటీర్ వ్యవస్థే లేదని మంత్రి డోలా ప్రకటించగా దీనికి కౌంటర్ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్.
వాలంటీర్ల సేవలకు ఎలాంటి అనుమతులు గుర్తింపు లేకపోతే 2024-25 వార్షిక బడ్జెట్‌లో గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్ల జీతాల కోసం రూ.277కోట్లను ఎందుకు కేటాయించారని జగన్ ప్రశ్నించారు. మండలిలో వాలంటీర్ల వేతనాల పెంపు ప్రశ్న ఉత్పన్నం కాదని ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో వాలంటీర్లకు 5వేలు కాదని రూ.10వేలు ఇస్తామన్నారని కానీ ఇప్పుడు ఆ వ్యవస్థే లేదని చెప్పడం సరికాదన్నారు. వాలంటీర్లకు ఎలాంటి అనుమతి లేదని చెప్పడంపై జగన్ అభ్యంతరం తెలిపారు. గ్రామ సచివాలయాల్లో వాలంటీర్ల వేతనాల చెల్లింపుకు మేజర్ హెడ్ 2515, మైనర్ హెడ్ 198, సబ్ ఆర్డినేట్ హెడ్ 52, డిటైల్డ్ హెడ్ 290, ఆబ్జెక్ట్ హెడ్ 293 ఉన్నాయని చెప్పారు.
ప్రభుత్వంలో జీతాలు ఇవ్వాలంటే బడ్జెట్ అనుమతులు ఉండాలని, ఫైనాన్స్ అనుమతులు కావాలని, హెడ్ అకౌంట్ లేకుండా వేతనాలు ఎలా ఇస్తారని,వాలంటీర్లకు హెడ్ ఆఫ్ అకౌంట్ ఉందని గుర్తుంచుకోవాలన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చే వరకు వాలంటీర్లకు హెడ్ అకౌంట్ ఉందని గుర్తు చేశారు.