మహిళ మృతిపై మైత్రీ మూవీ మేకర్స్ విచారం

పుష్ప 2 రిలీజ్ మేనియాతో తెలుగు రాష్ట్రాలు ఉగిపోతున్నాయి. ముఖ్యంగా బన్నీ నటనకు ఆయన అభిమానులే కాదు విమర్శకులు సైతం ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఇక పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో ఓ మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న తరుణంలో స్పందించింది మైత్రీ మూవీ మేకర్స్. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా మహిళ మృతిపై విచారం వ్యక్తం చేసింది మైత్రీ మూవీ మేకర్స్. సోషల్ మీడియా వేదికగా స్పందించిన మైత్రీ మూవీ మేకర్స్..నిన్న రాత్రి జరిగిన సంఘటన హృదయ విదారకరమైనదని, తాము చాలా బాధపడుతున్నామని పేర్కొంది.

హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆ బాలుడి గురించి మేమంతా ఆలోచిస్తున్నాం..ఆ బాలుడి గురించే ప్రార్థనలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ విపత్కర సమయంలో వారికి అన్ని విధాలుగా అండగా ఉంటూ సపోర్ట్ అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది.

హైదరాబాద్ దిల్‌సుఖ్ నగర్ ఏరియాకి చెందిన రేవతి (39) తన భర్త భాస్కర్, ఇద్దరు పిల్లలు శ్రీ తేజ్ (9) , సన్వీక (7) కలిసి పుష్ప ప్రీమియర్ షో చూడటానికి ఆర్టీసీ రోడ్స్ లోని సంధ్య 70 mmకు వచ్చింది. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి, ఆమె కొడుకు శ్రీ తేజ లుఅపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే పోలీసులు విద్య నగర్ లోని దుర్గ భాయి దేశముఖ్ హాస్పిటల్ కు తరలించారు. రేవతి అప్పటికే మృతి చెందింది.