సూపర్ సిక్స్ హామీలపై యూ టర్న్ తీసుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చెప్పకనే చెప్పేశారు. అయితే ఎన్నికల్లో హామీ ఇచ్చినప్పుడే చంద్రబాబుకు సూపర్ సిక్స్ సాధ్యం కాదని తెలుసు. అయినా అధికారం కోసం హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని అమలు చేయాలంటే నానా తంటాలు పడుతున్నారు.
శరీరం ఆరోగ్యంగా లేనప్పుడు తగిన వైద్యం చేయాలి కదా అంటూ కథలు చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ప్రజల్లో దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండగా తాజాగా కొత్తగా P4 పాలసీ అంటూ మొదలు పెట్టారు.
ఆంధ్రప్రదేశ్‌లో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు ‘P4 పాలసీ’ లక్ష్యంగా పెట్టుకున్నామని ఉగాది నుండి ప్రారంభించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. అంటే మార్చి 30న పీ4 పాలసీ అమల్లోకి రానుంది. ‘P4’ మోడల్ అనేది ‘పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్టనర్షిప్’ (Public-Private-People Partnership).
ప్రత్యేక సర్వే ద్వారా అట్టగుడున ఉన్న వర్గాలను గుర్తించి.. వారికి సాయం అందేలా చేస్తామన్నారు. దీనికోసం అవసరమైన డేటాను సేకరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పలువురు పారిశ్రామిక వేత్తలు తమ సొంత ఊళ్లు, మండలాలను అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చారని.. అలా ఆసక్తి ఉన్న వారిని స్వయంగా ఆహ్వానించి.. ఉగాది రోజున పీ4 కార్యక్రమాన్ని ఆవిష్కరిస్తామన్నారు.
ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రజల అభిప్రాయాలను, సూచనలను, సలహాలను సేకరించేందుకు ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అయితే ఈ పీ4 పాలసీ ప్రజలకు ఎంత మేరకు అర్థమవుతుంది.. ఏ మేరకు సత్ఫలితాన్నిస్తుందనేది వేచిచూడాల్సిందే.