ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది టీమిండియా. కటక్ వేదికగా ఆదివారం జరిగిన రెండో వన్డేలో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది రోహిత్ సేన. ఇంగ్లండ్ విధించిన 305 పరుగుల టార్గెట్‌ను కేవలం 44.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసింది.
కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతున్న రోహిత్ .. కటక్ వన్డేలో సిక్సర్ల వర్షం కురిపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 90 బంతుల్లో 7 సిక్స్‌లు, 12 ఫోర్లతో 119 పరుగలు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. శుభ్‌మన్ గిల్ 52 బంతుల్లో 60 పరుగులు చేయగా శ్రేయస్ అయ్యర్ (44), అక్షర్ పటేల్ (41)పరుగులతో రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జామీ ఓవర్టన్ రెండు వికెట్లు, ఆదిల్ రషీద్, లియామ్ లివింగ్ స్టోన్, గుస్ అట్కిన్సన్ తలా ఓ వికెట్ పడగొట్టారు. సెంచరీతో రాణించిన రోహిత్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఇక అంతకముందు టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు మంచి శుభారంభాన్ని ఇవ్వగా జో రూట్ (69) , డకెట్ 65, లివింగ్‌స్టన్ 41, బట్లర్ 34, బ్రూక్ 31 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌట్ కాగా రవీంద్ర జడేజా మూడు వికెట్లు, షమీ, రాణా, పాండ్యా, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు. మూడో వన్డే మ్యాచ్ ఫిబ్రవరి 12 బుధవారం జరగనుంది.