ఐపీఎల్ ప్రారంభం..అదుర్స్‌ అనాల్సిందే!

ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఈనెల 22న కోల్‌కతా వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్‌లో కోల్‌కతాతో తలపడనుంది ఆర్సీబీ. ఇక ఐపీఎల్ అంటే ఆటే కాదు ఓపెనింగ్ సెర్మనీ కూడా.

ఓపెనింగ్ సెర్మనీని ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఈవెంట్ లో బాలీవుడ్ స్టార్లు మెరవనున్నట్లు సమాచారం. ముఖ్యంగా కేకేఆర్ ఓనర్ షారుఖ్ ఖాన్‌తో పాటు సల్మాన్, విక్కీ కౌశల్, సంజయ్ దత్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అలాగే అరిజిత్ సింగ్, శ్రేయా ఘోషల్ మ్యూజిక్ కాన్సర్ట్ ఇవ్వనున్నారు. శ్రద్ధాకపూర్, వరుణ్ ధావన్, దిశా పటానీ స్పెషల్ డ్యాన్స్ లతో సందడి చేయనున్నారు. అయితే వీరితో పాటే మరికొంతమంది అందమైన భామలు కూడా రాబోతున్నారట. అంతేకాకుండా, పంజాబ్ స్టార్ ర్యాపర్ కరణ్ ఔజ్లా ప్రత్యేక షో చేయనున్నారు.

అమెరికన్ పాప్ బ్యాండ్ వన్ రిపబ్లిక్ ప్రదర్శన కోసం ఆ బృందాన్ని సంప్రదించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈసారి 10 టీమ్‌లు పాల్గొంటుండగా మొత్తం 13 స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. వాస్తవానికి ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌కు మాత్రమే ఓపెనింగ్ సెర్మనీ ఉంటుంది. కానీ, ఈసారి టోర్నీకి వేదిక కానున్న అన్ని స్టేడియాల్లో ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.