ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి టూర్ షెడ్యూల్ ఫిక్స్ అయింది. మే 2న ప్రధాని అమరావతిలో పర్యటించనుండగా రాజధాని నిర్మాణ పనులు పున: ప్రారంభించనున్నారు మోదీ. ఇందుకు సంబంధించి టూర్ షెడ్యూల్ ఫిక్స్ అయింది.
మే 2వ తేదీన మధ్యాహ్నం 3గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో మధ్యాహ్నం 3.30 గంటలకు అమరావతిలోని హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి 1.1కిలో మీటరు మేర 15 నిమిషాలపాటు రోడ్ షోలో పాల్గొంటారు.
3.45గంటలకు అమరావతి పెవిలియన్ ను సందర్శిస్తారు. సాయంత్రం 4గంటల నుంచి 5గంటల వరకు అమరావతి రాజధాని నిర్మాణ పనులు పున: ప్రారంభంతోపాటు బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 5గంటలకు అమరావతి ప్రాంతం నుంచి తిరిగి పయణమవుతారు. సాయంత్రం 5.10 గంటలకు హెలికాప్టర్ లో బయల్దేరి గన్నవరం విమానాశ్రయానికి వెళ్తారు. గన్నవరం నుంచి బయల్దేరి 5.20గంటలకు ఢిల్లీకి బయలుదేరుతారు.
ప్రధాని సభ కోసం మూడు వేదికలు సిద్ధం చేస్తున్నారు. ప్రధాన వేదికపై ప్రధాని నరేంద్ర మోదీతోపాటు సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా మొత్తం 20 మంది ముఖ్యులు ఆసీనులవుతారు. మిగతా వీవీఐపీల కోసం మరో వేదిక ఏర్పాటు చేశారు.