బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి సంచలన కామెంట్ చేశారు. ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో భారీ బహిరంగసభకు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేలా కేసీఆర్ సభ సక్సెస్ అవుతుంది అని తేల్చిచెప్పారు దానం నాగేందర్. కేసీఆర్ ని చూడ్డానికి జనం ఆశగా ఉన్నారు.. ఎప్పటినుండో బాగా ఎదురు చూస్తున్నారు.. సభకు కూడా జనం బాగా వస్తారని నేను కూడా అనుకుంటున్నా అని చెప్పారు.
అలాగే స్మితా సబర్వాల్ రీట్వీట్ చేసిన దాంట్లో తప్పేమీ లేదు అన్నారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ వాస్తవాన్నే రీట్వీట్ చేశారు … కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసినట్లు నేను భావించడం లేదు అని తెలిపారు.
గతంలోనూ హైడ్రా తీరును బాహాటంగానే ఎండగట్టారు దానం. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో వాగ్వాదానికి సైతం దిగారు. పేద ప్రజలను హైడ్రా భయబ్రాంతులకు గురి చేస్తోందని మండిపడ్డారు. అంతేగాదు ఖైరతాబాద్‌లో హైడ్రా కూల్చివేతలను సైతం అడ్డుకున్నారు. ఇక కాంగ్రెస్‌లో చేరిన తర్వాత కేసీఆర్‌పై బహిరంగంగానే ప్రశంసలు గుప్పించారు. కేసీఆర్ భోళా మనిషి అని కొనియాడారు. తాజాగా మరోసారి బీఆర్ఎస్ సభ గురించి పాజిటివ్‌గా మాట్లాడటం హస్తం పార్టీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది.