మంచు ఫ్యామిలీలో వివాదం మర్చిపోకముందే మరో పెద్ద సమస్య వచ్చి పడింది. కన్నప్పకు సంబంధించిన కీలక సన్నివేశాల హార్డ్ డ్రైవ్ మిస్ అయింది. మే 25న, ముంబయి లోని హైవ్ స్టూడియోస్ నుంచి DTDC కూరియర్ ద్వారా హార్డ్ డ్రైవ్ పంపారు. కార్యాలయంలో రఘు అనే ఉద్యోగి దీన్ని స్వీకరించి, చరిత అనే మహిళకు ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఆ తరువాత రఘు, చరిత ఇద్దరూ గల్లంతయ్యారు. ఈ సంఘటనపై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రెడ్డి విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హార్డ్ డ్రైవ్‌లో ప్రభాస్ నటించిన ముఖ్యమైన సన్నివేశాలు మరియు కీలక VFX దృశ్యాలు ఉన్నట్లు తెలిసింది. ఈ దృశ్యాలు ఆన్లైన్లో లీక్ అయితే, సినిమాకు భారీ ఆర్థిక నష్టం కలగవచ్చని చిత్రబృందం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు, చిత్రబృందానికి చిత్రంలోని దాదాపు 90 నిమిషాల ఫుటేజ్ ఇప్పటికే లీక్ అయ్యే ప్రమాదం ఉందని సమాచారం అందిందని చెబుతున్నారు.
ఈ సినిమాలో మోహన్‌లాల్, అక్షయ్ కుమార్ (ఇది ఆయన తొలి తెలుగు చిత్రం), కాజల్ అగర్వాల్, ప్రభాస్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, 2025 జూన్ 27న విడుదలకు సిద్ధమవుతోంది. ఏదైనా లీక్ వీడియోలు లేదా పైరసీ కంటెంట్ ఆన్లైన్ లో కనిపిస్తే చూడవద్దు, షేర్ చేయవద్దు. సినిమాను థియేటర్ లోనే ఆస్వాదించండి అని ప్రేక్షకులను కోరింది చిత్రబృందం.