- Advertisement -

వైసీపీ సంస్ధాగత నిర్మాణంపై స్పెషల్ డ్రైవ్‌

- Advertisement -

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శుల కోసం రాష్ట్రస్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ స్టేట్ కోఆర్డినేటర్‌ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా పార్టీ సంస్ధాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంపై ఆయన కీలక దిశానిర్దేశం చేశారు. రాబోయే 35 రోజుల పాటు ప్రత్యేకంగా వైఎస్సార్‌సీపీ సంస్ధాగత నిర్మాణ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు పార్టీ కమిటీలను పటిష్టంగా నిర్మించడమే లక్ష్యంగా ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని వెల్లడించారు.

పార్టీ కమిటీలకు సంబంధించిన మొత్తం డేటాను పూర్తిగా డిజిటలైజ్‌ చేస్తామని, ప్రతి కమిటీ సభ్యుడి వివరాలు ఒకే ప్లాట్‌ఫామ్‌లో పొందుపరుస్తామని సజ్జల తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయితే వైఎస్సార్‌సీపీకి 16 నుంచి 18 లక్షల బలమైన క్యాడర్ సైన్యం సిద్ధమవుతుందని చెప్పారు. కమిటీలు పూర్తయిన వెంటనే పార్టీ క్యాడర్‌కు ఐడెంటిటీ కార్డులు అందజేస్తామని ప్రకటించారు.

గ్రామస్థాయి కమిటీల్లో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉండాలని, ఉత్సాహంగా పనిచేసే వారికే అవకాశాలు కల్పించాలని ఆయన సూచించారు. మీడియా, సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలని, జిల్లా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు పూర్తి సహకారం అందించాలని కోరారు.

పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడిందని సజ్జల గుర్తు చేశారు. కోటి సంతకాల ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారిందంటే అది పార్టీ శ్రేణుల శ్రమ ఫలితమని అన్నారు.ఈ 35 రోజుల సంస్ధాగత నిర్మాణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఒక ఛాలెంజ్‌గా తీసుకుని తమను తాము నిరూపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఇన్‌చార్జ్‌ లేళ్ల అప్పిరెడ్డి, ప్రధాన కార్యదర్శి (మీడియా) పూడి శ్రీహరి, రాష్ట్ర కార్యదర్శులు చల్లా మధుసూదన్ రెడ్డి, పుత్తా ప్రతాప్‌, హర్షవర్ధన్‌, పుత్తా శివశంకర్‌, కందుల రవీంద్ర, వజ్ర భాస్కర్‌, లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్ రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు తదితరులు పాల్గొని సంస్ధాగత నిర్మాణ స్పెషల్ డ్రైవ్‌పై అవగాహన కల్పించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -