- Advertisement -

తెలంగాణ పాలిట శాపం..కాంగ్రెస్

- Advertisement -

రాష్ట్రానికి జరిగిన అన్యాయాలపై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు… కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని కలిపింది కాంగ్రెస్ అని, తెలంగాణ విద్యార్థులు, యువకులను పొట్టన పెట్టుకున్నది కూడా కాంగ్రెసేనని ఆయన ఆరోపించారు. కీలక ప్రాజెక్టులను రద్దు చేసి, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్న పార్టీ కాంగ్రెస్ అని స్పష్టం చేశారు.

రాష్ట్ర విభజన సమయంలో పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా, పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని హరీష్ రావు గుర్తుచేశారు. ఆనాడు రాష్ట్రానికి మేలు జరుగుతుందని పాలమూరు ప్రాజెక్టు చేపట్టినా, గత రెండు సంవత్సరాలుగా ప్యాకేజ్–3లోని బుడ్డ కాలువను పూర్తి చేయలేదని విమర్శించారు. ఆ కాలువ పూర్తయి ఉంటే ఈ ఏడాది 50 టీఎంసీల నీటిని నింపుకునే అవకాశం ఉండేదన్నారు.

“పాలమూరు బిడ్డనంటూ మాట్లాడుతున్నావు. కానీ నాటి నుంచి నేటి వరకు పాలమూరు ప్రజలకు కాంగ్రెస్, టీడీపీ చేసిన ద్రోహాన్ని నువ్వే కొనసాగిస్తున్నావు” అంటూ హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సమైక్య పాలనలో 1956 నుంచి 2014 వరకు 60 ఏళ్లలో తెలంగాణలో సాగు చేసిన ఆయకట్టు 42.77 లక్షల ఎకరాలు మాత్రమేనని, కానీ రాష్ట్రం సాధించుకున్న తర్వాత 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో కొత్తగా 48.74 లక్షల ఎకరాల ఆయకట్టు సాగు చేశామని గణాంకాలతో వివరించారు.

పోతిరెడ్డిపాడు, రాయలసీమ లిఫ్ట్ అంశాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డిల వ్యాఖ్యలను హరీష్ రావు బోగస్ అంటూ ఖండించారు. రాయలసీమ ఎత్తిపోతలను బీఆర్ఎస్ అడ్డుకోలేదన్న వాదన పూర్తిగా అబద్ధమని చెప్పారు. ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేయకముందే, 29-01-2020 నాడే కేంద్రానికి, కృష్ణా నది యాజమాన్య బోర్డుకు బీఆర్ఎస్ లేఖ రాసిందని తెలిపారు. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు చేపట్టడంపై ఎన్జీటీకి వెళ్లి 24-02-2021న స్టే తెచ్చి ప్రాజెక్టును నిలిపేశామని స్పష్టం చేశారు.

కృష్ణా జలాల్లో 66:34 వాటాకు 2013లో కాంగ్రెస్ ఒప్పుకుందని, బీఆర్ఎస్ పోరాడి అపెక్స్ కౌన్సిల్ ద్వారా ఆ వాటాను రద్దు చేయించిందన్నారు. కానీ 2024లో మళ్లీ కాంగ్రెస్ అదే వాటాకు సంతకం చేసిందని ఆరోపించారు. అసెంబ్లీలో అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆధారాలతో సహా నిరూపించామని హరీష్ రావు తేల్చిచెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -