ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేమియన్ మార్టిన్ తన ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టిన మెనింజైటిస్ ఇన్ఫెక్షన్తో చేసిన పోరాటం గురించి వెల్లడించారు. కోలుకున్న తర్వాత మొదటిసారిగా ప్రజల ముందుకు వచ్చి, కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు వైద్య సిబ్బందికి నిరంతర సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
మెనింజైటిస్‌తో ప్రాణాంతక పరిస్థితిని ఎదుర్కొన్న తర్వాత, తనకు అండగా నిలిచిన కుటుంబం, స్నేహితులకు డేమియన్ మార్టిన్ కృతజ్ఞతలు తెలిపారు. మెదడు, వెన్నుపాము చుట్టూ ఉన్న పొరలకు సంక్రమణ, వాపు వచ్చే మెనింజైటిస్ అనే ప్రమాదకర వ్యాధితో బాధపడుతూ, డిసెంబర్ 26న గోల్డ్ కోస్ట్‌లోని ఆసుపత్రికి ఆయనను అత్యవసరంగా తరలించారు.
ఐసీయూలో చికిత్స పొందుతూ, వైద్యులు ఆయనను కృత్రిమ కోమాలో ఉంచారు. అనంతరం అద్భుతంగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరణాన్ని జయించిన తర్వాత, తన కష్టకాలాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగంతో కూడిన సందేశాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.తన జీవితంపై నియంత్రణ పూర్తిగా కోల్పోయిన ఆ క్షణాల్లో, బతికే అవకాశాలు 50 శాతం మాత్రమే ఉన్నాయని వైద్యులు చెప్పినట్లు మార్టిన్ తెలిపారు.
ఈ పోస్ట్ నా కుటుంబం, స్నేహితులు మరియు నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ పెద్ద కృతజ్ఞత. 2025 డిసెంబర్ 27న మెనింజైటిస్ నా మెదడును పూర్తిగా ఆక్రమించడంతో నా జీవితం నా చేతుల నుంచి బయటకు వెళ్లిపోయింది. నాకు తెలియకుండానే, ఈ భయంకరమైన వ్యాధితో పోరాడేందుకు 8 రోజుల పాటు నన్ను పూర్తిగా కదలలేని కోమాలో ఉంచారు. కానీ నేను పోరాడాను… గెలిచాను అని తన ఎక్స్ ఖాతాలో రాశారు.
జీవితం ఎంత విలువైనదో ఈ అనుభవం నాకు గుర్తు చేసింది. పారామెడిక్స్, డాక్టర్లు, నర్సులు నుంచి కుటుంబం, స్నేహితులు, నాకు తెలియని వారు కూడా—అందరూ ప్రేమ, మద్దతు సందేశాలతో నాకు అండగా నిలిచారు. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. 2026కి సిద్ధం… నేను తిరిగి వచ్చాను అని వెల్లడించారు మార్టిన్. .
డేమియన్ మార్టిన్ ఆస్ట్రేలియాకు 67 టెస్టులు, 208 వన్డేలు ఆడారు. 1999, 2003 వరల్డ్ కప్ విజేత జట్లలో కీలక సభ్యుడిగా ఉన్నారు. 2003 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్‌పై అజేయంగా 88 పరుగులు చేసి, రికీ పాంటింగ్‌తో కలిసి 234 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. అలాగే 2006 ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచారు.
