అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో కెనడా, గ్రీన్‌ల్యాండ్, వెనిజువెలా అమెరికా భాగాలుగా చూపించే మ్యాప్‌తో కూడిన పోస్టును మంగళవారం షేర్ చేశారు. ఈ పోస్టులో ట్రంప్ ఓవల్ ఆఫీస్‌లో కూర్చుని ఉన్న పాత ఫోటో కనిపిస్తుంది. అందులో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, యూకే ప్రధాని కియర్ స్టార్మర్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ సహా నాటో నేతలు ఉన్నారు. ఆ ఫోటో వెనుక ఉన్న అమెరికా జెండాలో కెనడా, గ్రీన్‌ల్యాండ్, వెనిజువెలాలను అమెరికా భూభాగాలుగా చూపించారు.
మరో పోస్టులో ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రుబియోతో కలిసి గ్రీన్‌ల్యాండ్‌లో అమెరికా జెండాను ఎగరేస్తున్న దృశ్యం ఉంది. అక్కడ ఉన్న మైలురాయిపై “Greenland US Territory Est 2026” అని రాసి ఉంది.
వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మడురోను అదుపులోకి తీసుకున్న తర్వాత, ఆ దేశంలో సురక్షితమైన, సరైన మార్పు జరిగే వరకు అమెరికా ఆధిపత్యం కొనసాగుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనిని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లీవిట్ కూడా ధ్రువీకరించారు.
గతంలో కెనడాను అమెరికా 51వ రాష్ట్రంగా మారాలని ట్రంప్ సూచించారు. అయితే కెనడా ప్రధాని మార్క్ కార్నీ దీనిని ఖచ్చితంగా తిరస్కరించారు. ఇక గ్రీన్‌ల్యాండ్‌లోని పిటఫిక్ స్పేస్ బేస్‌కు నోరాడ్ (NORAD) యుద్ధ విమానాలను మోహరించనున్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ చర్య డెన్మార్క్‌తో సమన్వయంతో జరిగిందని, గ్రీన్‌ల్యాండ్ ప్రభుత్వానికి ముందే సమాచారం ఇచ్చామని నోరాడ్ తెలిపింది. గ్రీన్‌ల్యాండ్ ప్రపంచ భద్రతకు కీలకమని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు.
