ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం బైక్‌పై ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన కడప జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఎక్కువ వ్యూస్, లైక్స్ వస్తాయనే ఉద్దేశంతో బైక్‌పై విన్యాసాలు చేస్తూ వెళ్లిన ముబారక్ (20) అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో ముబారక్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
అతనితో పాటు బైక్‌పై ఉన్న మరో యువకుడికి కూడా తీవ్రమైన గాయాలు కాగా, స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరూ హెల్మెట్ ధరించలేదని సమాచారం.
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. యువత సోషల్ మీడియాలో పేరు, గుర్తింపు కోసం ప్రాణాలకే ప్రమాదం తెచ్చుకుంటున్న తీరుపై ఆందోళన వ్యక్తమవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇలాంటి ప్రమాదకర విన్యాసాలకు దూరంగా ఉండాలని, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని పోలీసులు యువతకు సూచించారు.
