యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్రలో, ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ కాంబినేషన్లో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ‘లవ్ ఇన్సూరెన్స్ కొంపెనీ’ (LIK) బాక్సాఫీస్ వద్ద భారీ నిరాశనే మిగిల్చింది. థియేట్రికల్ రన్లో ఈ సినిమా ఆడియన్స్‌ను పెద్దగా మెప్పించలేకపోయింది. సినిమా విడుదలై వారాలు గడుస్తున్నా.. బాక్సాఫీస్ వద్ద వచ్చిన ఈ ఘోర పరాజయాన్ని జీర్ణించుకోలేకపోతున్న దర్శకుడు విఘ్నేష్ శివన్, తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక సుదీర్ఘమైన ఎమోషనల్ నోట్‌ను పంచుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో ఈ సినిమాపై జరిగిన నెగిటివ్ ప్రచారం వల్లే చాలా మంది ప్రేక్షకులు థియేటర్లకు రాలేకపోయారని విఘ్నేష్ శివన్ ఆరోపించారు. ఆన్లైన్లో విపరీతంగా కనిపించిన విపరీతమైన నెగిటివిటీ చూసి, తాము థియేటర్లలో ఈ సినిమాను స్కిప్ చేశామని చాలా మంది తనకు పర్సనల్‌గా మెసేజ్‌లు పెట్టారని ఆయన వెల్లడించారు. కొన్ని సినిమాలు నెగిటివ్ రివ్యూలను తట్టుకుని నిలబడతాయని, కానీ మరికొన్ని సినిమాలు మాత్రం పబ్లిక్ టాక్ పూర్తిగా వ్యతిరేకంగా మారినప్పుడు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా ఇబ్బంది పడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా కేవలం తమ తెలివితేటలను ప్రదర్శించుకోవడానికి మాత్రమే కొంతమంది రాసే రివ్యూలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇలాంటి పక్షపాత విమర్శలు ప్రేక్షకులకు ఒక సినిమాను చూసే అవకాశం కూడా ఇవ్వకుండా నిరుత్సాహపరుస్తాయని.. అంతేకాకుండా ఎంతో మంది ప్రతిష్టాత్మక, ప్రతిభావంతులైన యువ దర్శకుల కలలను ఇవి పూర్తిగా క్రష్ చేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సినిమా బాక్సాఫీస్ ఫలితాన్ని తాను ఇంకా పూర్తిగా అంగీకరించలేకపోతున్నానని ఒప్పుకున్న విఘ్నేష్.. మొదటి వీకెండ్లో ఎంతో ప్రామిసింగ్‌గా ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ, ఆ తర్వాత చాలా వేగంగా సినిమాపై ఒక తప్పుడు కథనాన్ని సృష్టించి ప్రచారం చేయడం తనను తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు. తాము ఎంతో నిజాయితీతో ఒక డిఫరెంట్, కంప్లీట్ అండ్ ఒరిజినల్ సినిమాను క్రియేట్ చేయడానికి ప్రయత్నించామని.. ప్రేక్షకుల నుండి ఈ చిత్రానికి ఇంకొంచెం ఉదారత లభించి ఉండాల్సిందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక సినిమా విజయం అనేది ఆ సినిమా లోపల ఉన్న కంటెంట్ కంటే.. ఆ సినిమా చుట్టూ బయట ఉన్న పరిస్థితుల పైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుందని తన పోస్ట్‌ను ముగించారు
