దేశ రాజధాని వేదికగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గంలో త్వరలోనే భారీ మార్పులు చోటుచేసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం . ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపరచడంతో పాటు రాబోయే రాజకీయ అవసరాలకు అనుగుణంగా కేబినెట్‌ను పూర్తిగా పునర్వ్యవస్థీకరించాలని పీఎం మోదీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆశించిన స్థాయిలో రాణించని పలువురు ప్రస్తుత మంత్రులకు ఉద్వాసన పలికేందుకు అధిష్ఠానం సిద్ధమైనట్లు సమాచారం.
గత కొంతకాలంగా వివిధ మంత్రిత్వ శాఖల పనితీరుపై నిఘా పెట్టిన ప్రధానమంత్రి కార్యాలయం (PMO), మంత్రుల ప్రగతి నివేదికలను పరిశీలించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ కీలక పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైఫల్యం చెందిన వారు, అలాగే వివాదాస్పదంగా మారిన కొందరు సీనియర్లను మంత్రివర్గం నుంచి తప్పించి వారికి పార్టీ బాధ్యతలను అప్పగించే యోచనలో బీజేపీ అధినాయకత్వం ఉంది.
మరోవైపు యువతకు, వివిధ రాష్ట్రాల సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ కొత్త ముఖాలను కేబినెట్‌లోకి తీసుకోనున్నారు. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా టెక్నోక్రాట్లు, నిపుణులకు ఈసారి పెద్దపీట వేయబోతున్నట్లు ఢిల్లీ వర్గాల్లో గట్టి ప్రచారం సాగుతోంది. ఈ కేబినెట్ విస్తరణలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాజీ గవర్నర్ ఒకరిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దేశ ఆర్థిక రంగాన్ని సరికొత్త పంథాలో నడిపించేందుకు…అంతర్జాతీయంగా ఉన్న ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆయన సేవలను ఉపయోగించుకోవాలని మోదీ భావిస్తున్నట్లు సమాచారం. ఆయన్ను రాజ్యసభ ద్వారా పార్లమెంటుకు పంపి, కీలకమైన ఆర్థిక లేదా దానికి అనుబంధంగా ఉండే శాఖను అప్పగించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఎన్డీఏ (NDA) కూటమిలోని మిత్రపక్షాలను సంతృప్తి పరిచేలా ఈసారి మంత్రివర్గ కూర్పు ఉండబోతోంది. రాబోయే రోజుల్లో కీలక రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయా రాష్ట్రాల ప్రతినిధులకు కేబినెట్‌లో ప్రాధాన్యత కల్పించనున్నారు. ఏదేమైనా, ఈ భారీ కేబినెట్ మార్పుల ద్వారా అటు ప్రభుత్వంలోనూ, ఇటు పార్టీలోనూ సరికొత్త జోష్ నింపాలని మోదీ-షా ద్వయం పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడితేనే ఎవరెవరికి ఊరట దక్కుతుంది…ఎవరికి ఉద్వాసన తప్పుతుందనేది స్పష్టమవుతుంది.
