మహారాష్ట్రలోని పుణెలో సంచలనం సృష్టించిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేతన్‌తో నిశ్చితార్థం జరిగినప్పటికీ, తన ప్రియుడు చేతన్ చౌధరిని సియా గోయల్ రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు తాజాగా పోలీసుల విచారణలో తేలింది. ఈ హత్య వెనుక ఉన్న అసలు కారణాలు, కుట్ర ఇప్పుడు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో కేతన్ అగర్వాల్, సియా గోయల్‌లకు నిశ్చితార్థం జరిగింది. నవంబర్‌లో వారి వివాహం జరిపించేందుకు ఇరు కుటుంబాలు అంగీకారానికి వచ్చాయి. అయితే కేతన్‌ను పెళ్లి చేసుకోవడం సియాకు ఏమాత్రం ఇష్టం లేదని పోలీసుల దర్యాప్తులో స్పష్టమైంది. ఈ నేపథ్యంలోనే నిశ్చితార్థం జరిగిన తర్వాత, సియా తన ప్రియుడు చేతన్ చౌధరిని పుణెలోని స్థానిక రిజిస్ట్రార్ కార్యాలయంలో రహస్యంగా వివాహం చేసుకుంది. నాలుగు నెలల కిందట జరిగిన ఈ రిజిస్టర్ వివాహానికి, సియా కళాశాల స్నేహితులు ఇద్దరు సాక్షులుగా సంతకాలు చేసినట్లు సమాచారం.
రహస్యంగా వివాహం చేసుకున్న సియా, చేతన్ జంట.. కేతన్ అగర్వాల్‌ను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే వారు కేతన్‌ను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రత్యేక వివాహ చట్టం కింద వీరికి వివాహ ధ్రువీకరణ పత్రం జారీ అయ్యిందా అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుల వివాహానికి సంబంధించిన ఫొటోలను రికవరీ చేసేందుకు సాంకేతిక బృందాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి.
కేతన్ అగర్వాల్ హత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. కేవలం వివాహేతర సంబంధం కోసమే ఈ హత్య జరిగిందా, లేక దీని వెనుక ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు సియా, చేతన్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. నిశ్చితార్థం జరిగిన వ్యక్తిని కాదని, ప్రియుడిని పెళ్లి చేసుకుని, ఆపై కేతన్‌ను హత్య చేయడం పుణెలో తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
