ఎట్టకేలకు ప్రశాంత్ కిశోర్ ఎమ్మెల్యే అయ్యారు. రాజకీయ వ్యూహకర్తగా పని చేసి సొంత పార్టీ ఏర్పాటు చేసిన ప్రశాంత్ కిశోర్ బీహార్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. బీజేపీ కంచుకోట బంకీపూర్ లో ఆ పార్టీ అభ్యర్ధి నీరజ్ కుమార్ పైన విజయం సాధించారు. జాతీయ స్థాయిలో మారుతున్న తాజా సమీకరణాలు ఇక్కడ పోలింగ్ పైన ప్రభావం చూపినట్లు స్పష్టంగా కనిపించాయి. తొలి రౌండ్ నుంచి ఆధిక్యత కనిపించిన ప్రశాంత్ కిశోర్ చివర కు విజయం సాధించారు.
బీజేపీకి ఉప ఎన్నికల్లో గట్టి షాక్ తగిలింది. బంకీపూర్ (బిహార్) అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక బరిలో నిలిచిన జన్ సురాజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి అయిన నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేల ఓట్లకుపైగా మెజారిటీతో ఆయన గెలుపొందారు. ఈ రోజు ఉదయం కౌంటింగ్ మొదలైనప్పటి నుంచీ బీజేపీ నేత నీరజ్ కుమార్ కంటే ముందంజలో ఉన్న ప్రశాంత్ కిశోర్ ఒక్కో రౌండ్ ముగిసేసరికి తన ఆధిక్యాన్ని అంతకంతకూ పెంచుకుంటూ వచ్చారు. రాజ్యసభకు ఎన్నికైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ బంకీపూర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయడంతో ఉపఎన్నిక జరుగుతోంది. బీజేపీ కంచుకోటగా ఈ నియోజకవర్గానికి పేరుంది. 1995 నుంచి అక్కడ బీజేపీ అభ్యర్థులే విజయం సాధిస్తున్నారు.
కాగా, ప్రశాంత్ కిశోర్ అసాధారణ ఆధిక్యంతో విజయం సాధించటం తో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. సురాజ్ పార్టీకి ఇది తొలి విజయం. ఇక గత రెండు ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన ఆర్జేడీకి ఈసారి జనాదరణ మరింతగా తగ్గింది. నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో యువత ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో ఈ ఉపఎన్నికలో ఓటమి బీజేపీకి కచ్చితంగా షాక్ ఇచ్చారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ప్రశాంత్ కిశోర్ పార్టీ గెలవలేదు. నితీన్ నబిన్ అత్యంత సన్నిహితుడు, చిన్ననాటి స్నేహితుడైన నీరజ్ కుమార్ సిన్హా బీజేపీ తరఫున పోటీ చేయగా.. ఆర్జేడీ తరఫున రేఖా కుమారి గుప్తా పోటీ చేశారు. బీహార్ లో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత జరిగిన తొలి ఎన్నికలో ఘోర పరాజయంతో ఆ పార్టీ అంతర్మధనం ప్రారంభించింది.
