పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఓజీ 2’ (OG 2). బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన ‘ఓజీ’కి ప్రీక్వెల్‌గా వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని మెగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజిగా ఉండడం, వ్యక్తిగత కారణాల వల్ల సినిమా కొంత ఆలస్యం కావచ్చనే రూమర్స్ సోషల్ మీడియాలో వినిపించాయి. ఈ నేపథ్యంలో అభిమానుల ఆందోళనను పటాపంచలు చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ చిత్రానికి సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
ఇటీవల జరిగిన ‘కొరియన్ కనకరాజు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథిగా హాజరైన థమన్.. ‘ఓజీ 2’ సినిమాపై వస్తున్న రకరకాల ఊహాగానాలకు తనదైన శైలిలో చెక్ పెట్టారు. సినిమా షూటింగ్ కొంచెం వెనక్కి వెళ్లొచ్చు అనే రూమర్స్ ఉన్నప్పటికీ, అభిమానులను నిరాశపరచమని ఆయన స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా ఈ సెప్టెంబర్‌లో ‘ఓజీ 2’ నుంచి సంచలన అప్డేట్ రాబోతుందని థమన్ గ్యారెంటీ ఇచ్చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మళ్ళీ గడ్డం పెంచుతున్నా, మీసం తిప్పాలా లేదా?’’ అంటూ పవన్ స్టైల్ డైలాగ్‌తో అభిమానులను ఉత్సాహపరిచారు. థమన్ ఇచ్చిన ఈ భరోసాతో పవన్ ఫ్యాన్స్‌లో జోష్ ఒక్కసారిగా తారాస్థాయికి చేరింది. పవన్ ఆరోగ్య సమస్యలు, చికిత్సకు ముందు వచ్చిన వరుస అప్డేట్లు సినిమాపై భారీ అంచనాలను పెంచగా, ఇప్పుడు సెప్టెంబర్ అప్డేట్ ఖాయం కావడంతో సోషల్ మీడియాలో హడావుడి మొదలైంది. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించి మేకర్స్ అధికారిక ప్రకటన వెలువరించే అవకాశం ఉంది. సుజీత్ టేకింగ్, థమన్ హైఓల్టేజ్ మ్యూజిక్ తో ఈ సినిమా మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
