క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ఫాంటసీ యాక్షన్ డ్రామా ‘ది ఒడిస్సీ’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. థియేటర్లలో విడుదలైన కేవలం మూడు వారాల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ.9,500 కోట్లు) కలెక్షన్ల క్లబ్‌లో అడుగుపెట్టింది. నోలన్ కెరీర్‌లో ఈ ఘనత సాధించిన మూడో సినిమాగా ఇది నిలిచింది.
అంతకుముందు ఆయన దర్శకత్వం వహించిన ‘ది డార్క్ నైట్’ (1.008 బిలియన్), ‘ది డార్క్ నైట్ రైజెస్’ (1.08 బిలియన్) ఈ మైలురాయిని తాకాయి. గతేడాది వచ్చిన ‘ఓపెన్‌హైమర్’ ఈ మార్కుకు కాస్త దూరంలో ఆగిపోయింది. అయితే, ఈ వీకెండ్ ముగిసేసరికి ‘ది ఒడిస్సీ’ చిత్రం నోలన్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన ఆల్ టైమ్ హైయెస్ట్ మూవీగా నిలవడం ఖాయమని బాక్సాఫీస్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒక్క ఐమాక్స్ (IMAX) స్క్రీన్ల నుంచే ఏకంగా 257 మిలియన్ డాలర్ల వసూళ్లు (దాదాపు రూ.2,445 కోట్లు) రావడం ఈ సినిమా క్రేజ్ ఏ స్థాయిోలో ఉందో చెప్పకనే చెబుతోంది. త్వరలోనే ఐమాక్స్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగానూ ఇది రికార్డు సృష్టించనుంది.
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చలనచిత్ర మార్కెట్ అయిన చైనాలో ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. చైనా వ్యాప్తంగా సుమారు 800 ఐమాక్స్ స్క్రీన్లతో పాటు వేలాది సాధారణ థియేటర్లలో అత్యంత భారీ స్థాయిలో దీన్ని రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఈ సినిమా రానున్న రోజుల్లో బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలన రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.
